కేసీఆర్‌ను దులిపేసిన మందకృష్ణ, విద్యుత్‌పై హరీష్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదివారం దుమ్మెత్తి పోశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య పైన ఆరోపణలు వచ్చాయని కేసీఆర్ ఆయనను తొలగించారని, మరి కేసీఆర్, మంత్రుల పైన వచ్చిన ఆరోపణల మాటేమిటని ప్రశ్నించారు.
కేసీఆర్ దురహంకార వైఖరిని నిరసిస్తూ ఏప్రిల్ 4న ఇందిరా పార్క్ నుండి కేసీఆర్ ఇంటి వరకు ర్యాలీగా వెళ్తామని, ఆయన ఇంటిని ముట్టడిస్తామని చెప్పారు. ఇది దొరల తెలంగాణ అన్నారు. నిజాం పాలనకు నిదర్శనమని ఆయన చెప్పారు.
తెలంగాణలో మాల, మాదిగలు, మహిళలను అవమానిస్తున్నారని చెప్పారు. మంత్రివర్గంలో మాల, మాదిగ, మహిళలకు ప్రాతినిథ్యం లేదని చెప్పారు. కేసీఆర్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందన్నారు. గవర్నర్ నరసింహన్ కేసీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలన్నారు.

త్వరలో కరెంట్ కష్టాలు తొలగిపోతాయి: హరీశ్
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశామని తెలంగాణ మంత్రి హరీశ్ రావు వేరుగా అన్నారు. సుమారు 8వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు కృషి చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే తెలంగాణలో కరెంట్ కష్టాలు తొలగిపోతాయన్నారు. కొన్ని చెరువులు కబ్జాకు గురికావడంతో మురికి గుంటలుగా రూపాంతరం చెందాయని, ప్రజలే కబ్జా దారుల నుంచి చెరువులను కాపాడాలన్నారు.












Click it and Unblock the Notifications