కేటీఆర్ ఇప్పుడు ఎక్కడ? హైదరాబాద్ వర్షాలపై రేవంత్ రెడ్డి ట్వీట్!!
హైదరాబాద్ నగరం వర్షానికి చిగురుటాకులా వణుకుతోంది. సోమవారం రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాలు అంధకారంలో నిండిపోయాయి.
ఇక నేడు ఉదయం నుండి కుండపోతగా కురుస్తున్న వర్షం దెబ్బకు హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ నగర రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. అడుగు తీసి అడుగు వేయలేని అంతగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మ్యాన్ హోల్స్, నాలాలు పొంగిపొర్లుతున్నాయి.

ముఖ్యంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరం వరదలతో విలవిలలాడుతుంటే మంత్రి కేటీఆర్ ఎక్కడ ఉన్నారు అంటూ ప్రశ్నించారు. నువ్వు నిర్మించానని చెబుతున్న విశ్వనగరం జల విలయంతో పండుటాకులా వణికిపోతుంది అంటూ పేర్కొన్నారు. హైటెక్ హంగుల ఫోటోలు, వీడియోలు పెట్టి సోషల్ మీడియాలో భ్రమలు కల్పించే కేటీఆర్ ఇప్పుడు ఎక్కడ అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
మనిషి కనిపించటం లేదు.. మాట వినిపించడం లేదు అంటూ ట్విట్టర్ వేదికగా సెటైర్ వేస్తారు. వర్షానికి భాగ్యనగరం అతలాకుతలం అవుతుంటే విశ్వనగరం అని చెప్పుకున్న కేటీఆర్ మాట్లాడడం లేదని, భాగ్యనగరం యొక్క గొప్పతనం ఇప్పుడు కేటీఆర్ చెప్పాలని రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు.
ఇప్పుడు భాగ్యనగర వాసులకు తెలంగాణా ప్రభుత్వం తాము చేసిన అభివృద్ధిని, సాధించిన ప్రగతిని చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. చినుకు పడితేనే చిత్తడిగా మారే హైదరాబాద్ నగర దుస్థితిపై ఆయన మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications