అందుకే పూలదండలు వేయించుకోను, ఇంగ్లీష్ పట్టు పట్టండి: కెసిఆర్
వరంగల్: పూలు వాడిపోరాదనే ఉద్దేశ్యంతో వాటి పైన నీళ్లు జల్లుతారని, ఈ పూలదండలు వేసినప్పుడు తన చొక్కా తడిసిపోతుందని, అందుకే తాను పూలదండలు వేయించుకోనని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం అన్నారు.
వరంగల్ జిల్లా గంగదేవిపల్లి గ్రామంలో కెసిఆర్ గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన గ్రామస్థులను పలుమార్లు నవ్వించారు.
అదే సమయంలో పూలదండలు ఎందుకు వేయించుకోనో చెప్పారు. అంతకుముందు ఆయన గ్రామంలో కలియదిరిగారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలువురి నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కెసిఆర్‌కు గ్రామస్థులు సాంప్రదాయ నృత్యాలతో ఘనస్వాగతం పలికారు. గ్రామంలో సీఎం మొక్కను నాటారు.
విద్యార్థులు తెలుగు మీడియంలో కన్నా ఇంగ్లీష్ మీడియంలో చదవడం వల్ల మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని కేసీఆర్ సూచించారు. విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో పట్టు సాధించాలని సూచించారు.గ్రామంలో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రాధాన్యతల వారీగా గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే సమస్యలు ఏమున్నాయన్న విషయాన్ని గుర్తిస్తామని, గ్రామజ్యోతి పథకానికి రూ.25 వేల కోట్లు కేటాయించనున్నామని తెలిపారు.
గంగదేవిపల్లిలో గ్రామజ్యోతి ప్రారంభించిన కెసిఆర్ గ్రామస్థులను ఉద్దేశించి మాట్లాడిన విషయం తెలిసిందే. చెట్లు కొట్టకుండా కరెంట్ లైన్లకు ప్రత్యామ్నయం చూడాలని, గ్రామంలో వంద కేవీ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు.
అన్ని విషయాల్లో ముందుకు దూసుకు పోవాలని కోరారు. కొందరు రాక్షసులుంటారని వారు అడ్డుకుంటారన్నారు. ఎవరినీ లెక్కచేయకుండా అభివృధ్ది వైపు పయనం కొనసాగించాలన్నారు. ధర్మం తప్పకుండా విజయం సాధిస్తుందన్నారు.
గంగదేవిపల్లి ఊరి ప్రజలే తనను ఇక్కడకు రప్పించారన్నారు. మీ ఊరికి అవార్డులు కూడా వచ్చాయని గుర్తు చేశారు. మాజీ సర్పంచి రాజమౌళిని ప్రత్యేకంగా ఆహ్వానించి హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఉపన్యాసం ఇప్పించామని, ఆయన తన హయాంలో చేసిన పనుల అనుభవాలను వివరించారన్నారు.












Click it and Unblock the Notifications