కోడిపుంజు బలిద్దామని నమ్మించి ప్రియుడితో కలిసి మొగుడ్నే బలిచ్చిన ఇల్లాలు.. వనపర్తిలో దారుణం
ఒళ్ళు గగుర్పొడిచేలా రోజురోజుకీ పెరిగిపోతున్న దారుణ ఘటనలు సమాజంలో ఆందోళనకర పరిస్థితులను సృష్టిస్తున్నాయి. నిన్నటికి నిన్న ఓ యువతి పెళ్లి ఇష్టంలేక, పెళ్లి చేసుకోవాలనుకున్న యువకుడికి సర్ ప్రైజ్ కళ్ళు మూసుకోమని చెప్పి గొంతు కోసిన దారుణ ఘటన చోటు చేసుకోగా, తాజాగా మరో కేసు వెలుగులోకి వచ్చింది. గ్రామ దేవతకు కోడిపుంజును బలి ఇద్దామని భర్తకు చెప్పిన ఓ ఇల్లాలు, కోడి పుంజును బలివ్వడానికి భర్తను పంపి ప్రియుడితో కలిసి సుపారీ గ్యాంగ్ తో భర్త ప్రాణాలను నిలువునా తీసి గుట్టుచప్పుడు కాకుండా పాతిపెట్టిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

ప్రియుడి మోజులో ఇద్దరు పిల్లల తల్లి దారుణం.. ఏకంగా భర్తకే స్కెచ్
వనపర్తి జిల్లా కేంద్రం గాంధీనగర్ కు చెందిన మేస్త్రీ బాలస్వామికి, లావణ్య అనే మహిళతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు. భర్తకు తెలియకుండా లావణ్య మదనాపురం మండలం దంతనూరుకు చెందిన నవీన్ అనే యువకుడుతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. దీనిపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. 5 నెలల క్రితం బాలస్వామి తన పొలంలో అమ్మడంతో 30 లక్షల రూపాయల డబ్బులు వచ్చాయి. దీంతో ఆ డబ్బులు తీసుకొని ప్రియుడితో కలిసి పారిపోవాలని నిర్ణయించుకున్న భార్య పక్క ప్లాన్ వేసింది.

మైసమ్మ గుడి దగ్గర కోడిపుంజు బలి పేరుతో ప్రియుడితో కలిసి మర్డర్
వనపర్తి శివారులోని జేరిపోతుల మైసమ్మ గుడి వద్ద అర్ధరాత్రి సమయంలో కోడిపుంజును బలి ఇస్తే మంచి జరుగుతుందని భర్తకు చెప్పి నమ్మించింది. ఇంట్లో భార్య భర్తల మధ్య జరుగుతున్న గొడవలు తగ్గుతాయని చెప్పిన భార్య భర్తను ఒక్కడిని జనవరి 21వ తేదీన అర్ధరాత్రి మైసమ్మ ఆలయం దగ్గరకు పంపింది. అప్పటికే అక్కడ వేచివున్న నవీన్, సూపరీ గ్యాంగ్ కురుమూర్తి, గణేష్ కలిసి బాల స్వామిని గొంతు నులిమి హత్య మార్చారు. కుందూరు శివార్లలోని బ్రిడ్జి వద్ద అతని సెల్ ఫోన్ ను పారేశారు. బంగారి అనే వ్యక్తి సహాయంతో మృతదేహాన్ని హైదరాబాద్ లోని బాలాపూర్ శివార్లకు తీసుకువెళ్లి పాతిపెట్టారు.

ఇంట్లో ఉన్న డబ్బుతో ప్రియుడు నవీన్ తో కలిసి పరారైన ఇల్లాలు
ఆపై ఇంటికి తాళం వేసి లావణ్య ఇంట్లో ఉన్న డబ్బు తీసుకొని ప్రియుడు నవీన్ తో కలిసి పారిపోయింది. అయితే తన అన్న బాలస్వామి కనిపించకపోవడంతో, ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన బాలస్వామి తమ్ముడు రాజు జనవరి 22వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక లావణ్య కూడా కనిపించకపోవడంతో, ఆమెపై అనుమానంతో పోలీసులు గాలింపు చేపట్టారు. మూడు నెలల తర్వాత బుధవారం నాడు లావణ్య నవీన్ ను పట్టుకున్న పోలీసులు వారిని ప్రశ్నించగా అసలు విషయం బయటకు వచ్చింది.

బాలాస్వామి మృతదేహానికి పోస్ట్ మార్టం.. నిందితులు అరెస్ట్
తామే బాలాస్వామిని హతమార్చినట్టు నిందితులు అంగీకరించారు. దీంతో బాలాపూర్ శివారులో పూడ్చిపెట్టిన బాలాస్వామి మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులు పోస్టుమార్టం చేయించారు. ఇక ఈ హత్యలో పాల్గొన్న ప్రియుడు నవీన్, హత్యకు సూత్రధారి అయిన లావణ్య తోపాటు, సుపారీ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సుపారీ గ్యాంగ్ రెండు లక్షల రూపాయలు తీసుకున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.












Click it and Unblock the Notifications