భర్తను కరెంట్ పోల్ కు కట్టేసి చెప్పుతో కొట్టిన భార్య.. మంథనిలో షాకింగ్ ఘటన
వివాహేతర సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. వివాహేతర సంబంధాలు నెరపుతున్న కొందరు భార్య పిల్లలను గాలికి వదిలేసి, యథేచ్ఛగా తమ అక్రమ సంబంధాలను కొనసాగిస్తున్నారు. తాజాగా అటువంటి ఘటనే పెద్దపల్లి జిల్లా మంథనిలో చోటుచేసుకుంది. ఒక బాబు పుట్టిన తర్వాత భార్యను వదిలేసి రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తికి భార్య దేహశుద్ధి చేసింది. కరెంటు పోల్ కు కట్టేసి, చెప్పుల దండ వేసి, చెప్పుతో చితక్కొట్టింది. తనకు తన బిడ్డకు ఏవిధంగా అన్యాయం చేస్తావు అంటూ భర్తను నిలదీసింది.

భార్య ఉండగా మరో పెళ్లి చేసుకున్న భర్త
ఇక ఈ ఘటన వివరాల్లోకి వెళితే 4 సంవత్సరాల క్రితం మంథని మండలం స్వర్ణపల్లి గ్రామానికి చెందిన అఖిల అనే యువతిని శ్రీకాంత్ రెడ్డి అనే యువకుడు వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో అఖిల కుటుంబ సభ్యులు శ్రీకాంత్ రెడ్డికి కట్నంగా 20 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇక వీరిద్దరికీ ఒక కొడుకు కూడా జన్మించాడు. ఆ తర్వాత ఇరువురి మధ్య ఏమైందో తెలియదు కానీ శ్రీకాంత్ రెడ్డి భార్యని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. భర్త మళ్ళీ తన దగ్గరికి తిరిగి వస్తాడనే నమ్మకంతో కొడుకుతో కలిసి జీవిస్తూ ఎదురుచూస్తున్న భార్యకు, తాజాగా అతను మరొక పెళ్లి చేసుకున్నట్టుగా సమాచారం తెలిసింది.

కరెంట్ పోల్ కు కట్టేసి చెప్పుల దండేసి చెప్పుతో కొట్టిన భార్య
దీంతో ఆగ్రహించిన భార్య, ఆమె కుటుంబ సభ్యులు శ్రీకాంత్ రెడ్డిని హనుమకొండ నుండి స్వర్ణ పల్లికి తీసుకొచ్చారు. భర్త శ్రీకాంత్ ను కరెంటు పోల్ కు కట్టేసి, కోపంతో ఊగిపోయిన భార్య అఖిల భర్తను చితక బాదటమే కాకుండా చెప్పులతో కొట్టింది. చెప్పుల దండ మెడలో వేసి ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు, తన కుమారుడికి ఎందుకు అన్యాయం చేశారో చెప్పాలని నిలదీసింది. తమకు న్యాయం చేయాలని భోరున ఏడ్చింది.

న్యాయం చెయ్యాలని బోరున విలపించిన భార్య
భర్త చేసిన పనికి తీవ్ర ఆగ్రహంతో ఉన్న భార్య మొదటి భార్య ఉండగా రెండో పెళ్లి ఎలా చేసుకున్నావ్ అంటూ భర్తను ప్రశ్నించింది. తనకు న్యాయం చేసేంత వరకూ భర్తను విడిచి పెట్టేది లేదని భార్య అఖిల తేల్చిచెప్పింది. అఖిలతో పాటు స్వర్ణపల్లి గ్రామస్తులు కూడా శ్రీకాంత్ చేసిన పని పై ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్యాబిడ్డలను పెట్టుకొని మరో పెళ్లి ఎలా చేసుకున్నావ్ అంటూ ప్రశ్నించారు. మొదటి భార్య ఉండగా, బిడ్డ ఉండగా రెండో పెళ్లి చేసుకున్న భర్త శ్రీకాంత్ ను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications