బండి భగీరథ్ చేసిన పనికి బండి సంజయ్‌కు సంబంధం లేదు: బీజేపీ స్టేట్ చీఫ్!
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు తెలంగాణా బీజేపీకి పెద్ద తలనొప్పిగా తయారైంది. తెలంగాణా బీజేపీని, బండి సంజయ్ ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు విరుచుకుపడుతున్నాయి. తాజాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఈ కేసుపై స్పందించారు. ఈ వ్యవహారం బండి సంజయ్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయమని, బీజేపీకి దీనితో సంబంధం లేదని తేల్చిచెప్పారు.
బండి సంజయ్ కు ఈ కేసుతో సంబంధం లేదన్న బీజేపీ స్టేట్ చీఫ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ, "బండి భగీరథ్ చేసిన పనికి బండి సంజయ్‌కు సంబంధం లేదన్నారు. అలాగే బీజేపీ పార్టీకి కూడా ఈ విషయంతో ఎలాంటి సంబంధం లేదు అని స్పష్టం చేశారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా రాజకీయ లబ్ది కోసం ఈ కేసును బీజేపీతో ముడిపెట్టి ప్రచారం చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

చట్టం తన పని చేస్తుంది
ఈ కేసులో బండి సంజయ్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంటే సమగ్ర విచారణ జరపాలని రామచందర్ రావు అన్నారు. ఇది పూర్తిగా న్యాయపరమైన విషయమని, చట్టం తన మార్గంలో పని చేసి న్యాయం చేస్తుందని వివరించారు. అనవసరపు ప్రచారాలు చేసి బీజేపీపై బురద చల్లాలని చూస్తే ఊరుకోమని అన్నారు.
ప్రధాని మోదీ సభపై సంతృప్తి
మరోవైపు, హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన బహిరంగ సభ విజయవంతం కావడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హర్షం వ్యక్తం చేశారు. సభను విజయవంతం చేయడంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణా రాష్ట్రానికి చాలా ప్రాధాన్యతను కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నది నిన్న ప్రధాని కార్యక్రమాలతో స్పష్టం అయిందన్నారు.
రేవంత్ సిట్ ఏర్పాటు, బీజేపీ స్టేట్ చీఫ్ స్పందనతో ఆసక్తి
ఇదిలా ఉంటే బండి సంజయ్ తన కుమారుడు భగీరథ్ వ్యవహారంపై ప్రధాని మోదీ సభలో భావోద్వేగంగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ కేసును తనపై రాజకీయ కుట్రగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే ఈ కేసు విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది.













Click it and Unblock the Notifications