Weather Update: రాష్ట్రంలో క్రమంగా తగ్గుతోన్న ఉష్ణోగ్రతలు..!
రాష్ట్రంలో వర్షాకాలం సీజన్ ముగుస్తోంది. ఇప్పటికే తెలంగాణ నుంచి నైరుతి రుతుపవనాలు తిరిగి వెళ్లిపోయాయి. ఇక చలికాలం మొదలు కానుంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో చలికాలం మెల్లగా వస్తోంది. వర్షాలు పూర్తిగా ముగిసేలోపు కొన్ని దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్టోబర్ 25 తర్వాత రుతుపవనాల కాలం అధికారికంగా ముగుస్తుందని భారత వాతావరణ శాఖ (IMD) పేర్కొంది.
రుతుపవనాల నిష్క్రమణతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఇప్పటికే తగ్గుముఖం పట్టినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది చల్లని వాతావరణం ప్రారంభానికి సంకేతమని వివరిస్తున్నారు. వర్షాకాలం ముగుస్తున్న కొద్దీ హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నట్లు వివరించారు.తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) గణాంకాల ప్రకారం.. నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతోన్నాయి. 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయి.

హైదరాబాద్, వనపర్తి, నల్గొండ, జోగుళాంబ గద్వాల్ వంటి జిల్లాల్లో 20 డిగ్రీల సెల్సియస్ నుంచి 22 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత నమోదు అయింది.శీతలీకరణ ధోరణి ఉన్నప్పటికీ డిసెంబరు వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు 17 డిగ్రీల సెల్సియస్ లేదా 18 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈసారి చలికాలం ఉష్టోగ్రతలు కనిష్ట స్థాయికి తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈసారి తెలంగాణలో వర్షాకాలం సీజన్ లో వర్షపాతం సాధారణం కంటే అధికంగా నమోదు అయింది.
ఆగస్ట్ లో లోటు వర్షపాతం నమోదు అయినప్పటికీ సెప్టెంబర్, అక్టోబర్ లో కురిసిన వర్షాలతో లోటు వర్షపాతం కాస్త అధిక వర్షపాతంగా మారిందని అధికారులు చెబుతున్నారు. ఈసారి రబీ సీజన్ లో నీటి సమస్య ఉండకపోవచ్చని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications