కోతి కారణంగా ఆత్మహత్య చేసుకున్న వివాహిత..
దుగ్గొండి : దంపతుల మధ్య కోతి పెట్టిన చిచ్చు విషాదాన్ని మిగిల్చింది. కోతి చేసిన పనికి తాను తిట్లు తినాల్సి రావడంతో.. తీవ్ర మనస్థాపానికి గురైన వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో తీవ్ర గాయాలపాలై సోమవారం తెల్లవారు జామున మృతి చెందింది.
వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా దుంగొడి మండలం తొగర్రాయి గ్రామంలో కందకట్ల మనోహర(40), శ్రీనివాస్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఓ సైకిల్ స్టాండ్ తో పాటు కిరాణ దుకాణం కూడా ఉంది. ఇదే క్రమంలో గత 11వ తేదీన సాయంత్రం 4గం.లకు దుకాణంలో దూరిన ఓ కోతి చాక్లెట్ డబ్బాలు ఎత్తుకెళ్లింది. దీంతో కోతి వచ్చి డబ్బాలు ఎత్తుకెళ్లేదాకా ఏంచేశావంటూ భార్య మనోహరను భర్త శ్రీనివాస్ మందలించాడు.

అంతటితో ఆగక పరుష పదజాలంతో ఆమెను దూషించడంతో.. మనోహర తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. అనంతరం మనోహరను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూసింది. అయితే మనోహర భర్త శ్రీనివాస్ ప్రతిరోజు ఆమెతో గొడవ పడేవాడని, అతడి అవమానకర మాటలు తట్టుకోలేకే తమ కూతురు చనిపోయిందని మనోహర తల్లి వరలక్ష్మీ ఆరోపిస్తున్నారు. వరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు ఎస్సై ఊరడి భాస్కర్ రెడ్డి.












Click it and Unblock the Notifications