పెళ్లయి నెలన్నరే: చీరతో ఉరేసుకుని స్త్రీ ఆత్మహత్య
వరంగల్ : భర్త వేధింపులు భరించలేక పెళ్లయిన నెలన్నర రోజులకే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వరంగల్ జిల్లా గూడురు మండలంలోని రాములు తండా గ్రామపంచాయతీ పరిధి సాంబయ్యపల్లి గ్రామంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది.
చావ్లీ, ఈర్య దంపతుల కుమారుడు బజ్యా కుమార్తె అనూష(19)కు చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన లావుడ్య బాలుతో గత మార్చి 13న వివాహమైంది. కట్నకానుకలన్నీ అందజేశారు. అనూష తల్లి చిన్నప్పుడే చనిపోగా, తండ్రి బజ్యా బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాడు.
నాలుగు రోజుల క్రితం అనూషను చూడడానికి ఈర్య పాపయ్యపేటకు వెళ్లాడు. తనను బాలు తరుచూ కొడుతున్నాడని, అనుమానిస్తున్నాడని అనూష ఈర్యకు చెప్పింది. దీంతో ఆయన అనూషను సముదాయించాడు. అనూష తాతయ్యతోపాటే సాంబయ్యపల్లికి వచ్చి నాలుగురోజులుగా అక్కడే ఉంటున్నది.

అనూషను బాలు వద్దకు తీసుకెళ్లేందుకు బట్టలు సర్దుకొమ్మని చెప్పి ఈర్య, చావ్లీ ఉపాధిపనులకు వెళ్లిపోయారు. కూలికి వెళ్లి ఇంటికి వచ్చి చూడగా అనూష ఇంట్లో చీరతో ఉరివేసుకుని కనిపించింది.
సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనూష తండ్రి బజ్యా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటరత్నం తెలిపారు.












Click it and Unblock the Notifications