రక్షణ కల్పించండి?: ఎన్నారై భర్త దారుణం, ఆడపిల్ల పుట్టడమే నేరమా?
హైదరాబాద్: ఆడపిల్ల పుట్టిందనే కోపంతో భార్యబిడ్డలను వదిలేసి అమెరికా వెళ్లిపోయిన ఎన్నారైపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆశ్రయించారు. ఈ సంఘటనకు సంబంధించి బుధవారం నగరంలోని నారాయణగూడలోని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు అచ్యుతరావు వివరాలు వెల్లడించారు.
మహబూబ్‌నగర్ జిల్లా ఖానాపూర్ సమీపంలోని తలకొండపల్లికి చెందిన జగత్‌రెడ్డి, పుష్పలత కొడుకు వెంకటపద్మ నారాయణరెడ్డి అమెరికాలో ఉంటున్నాడు. హైదరాబాద్ ఎల్బీనగర్‌కు చెందిన భగవంత్‌రెడ్డి కుమార్తె అర్చనను అతడికి ఇచ్చి 2011లో ఘనంగా పెళ్లి జరిపించారు. ఆ తర్వాత 2012 ఆగస్టులో వారికి ఆడపిల్ల పుట్టింది.
దీంతో ఆడపిల్ల పుట్టిందనే కోపంతో భార్యతో గొడవ పెట్టుకుని వెంకట నారాయణ రెడ్డి తిరిగి అమెరికా వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతడు ఇండియాకు రాలేదు. భార్య అర్చన ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతడు స్పందించకపోడవంతో పాటు అత్తమామలు తల్లితో పాటు చిన్నారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారు.

ఆ తర్వాత కొన్నాళ్లకు ఇంటి నుంచి గెంటివేశారు. దీంతో బాధితురాలు ఎంతో మనోవేదనకు గురై తన కూతురికి రక్షణ కల్పించి, న్యాయం చేయాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆశ్రయిచింది. అర్చన ఫిర్యాదు మేరకు జూన్ 16వ తేదీ లోపు విచారణ జరిపి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎల్బీనగర్ డీసీపీలకు నోటీసుల జారీ చేశారు.
ఇలాంటి సంఘటనలు మరోమారు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. అర్చనకు, ఆమె బిడ్డకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అమెరికాలో నివాసం ఉంటున్న అర్చన భర్త వెంకట నారాయణరెడ్డిని ఎలాగైనా సరే నగరానికి రప్పించి చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications