అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించింది
హైదరాబాద్: తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిల తన భర్తను కిరాయి హంతకులతో చంపించింది. పక్కా ప్రణాళిక ప్రకారం తన భర్తను చంపించి చివరికి పోలీసులకు దొరికిపోయింది. ఈ ఘటన హైదరాబాదులోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
కూకట్‌పల్లి ఏసీపీ భుజంగరావు తెలిపిన వివరాల ప్రకారం - మహారాష్ట్ర నాందేడ్ జిల్లా డెగ్లూర్‌కు చెందిన డి.అంకుశ్ (24), అంబిక దంపతులు. అయితే బతుకుదెరువు కోసం కొన్ని నెలల క్రితం అంకుశ్ హైదరాబాద్‌లో ఉంటున్న తన బాబాయి వద్దకు వచ్చాడు. స్వగ్రామంలోనే ఉన్న అంబిక సూర్యకాంత్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది.

తనకు అడ్డు ఉన్నాడని కట్టుకున్న భర్తనే కడతేర్చాలని ఆమె నిర్ణయించుకుంది. తాను వేసుకున్న ప్రణాళిక ప్రకారం - భర్తతో మాట్లాడుతూ అతని కదలికలను ఎప్పటికప్పుడు ప్రియుడికి చేరవేస్తోంది. వారిద్దరూ కలసి అంకుశ్‌ను చంపేందుకు ప్రణాళిక వేసుకున్నారు.
ఈ మేరకు అదే గ్రామానికి చెందిన తుకారాం, ప్రకాశ్ అనే వారికి రూ.1.30 లక్షల సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. ముందుగా వారికి రూ.10 వేలు ఇచ్చి వారిని హైదరాబాద్ కు పంపింది. ఈ మేరకు 9వ తేదీ రాత్రి ప్రకాశ్, తుకారాంలు మియాపూర్‌లో అంకుశ్ ఉండే ప్రాంతానికి చేరుకున్నారు.

అక్కడే ఉన్న మద్యం దుకాణం వద్దకు అతడిని తీసుకెళ్లారు. మద్యం తాగిన అనంతరం అదను చూసుకుని తలపై రాయితో మోది చంపేశారు. ఈ ఘటనపై ఈ నెల 10 వ తేదీన అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చివరికి భార్యనే నిందితురాలిగా తేల్చారు. నిందితులు సూర్యకాంత్, తూకారాంలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న అంబికా, ప్రకాశ్‌ల కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications