year ender 2023: ఈ ఏడాది స్టార్ పొలిటీషియన్.. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి!!
2023 సంవత్సరం రేవంత్ రెడ్డికి బాగా కలిసొచ్చింది. ఆయన రొట్టె విరిగి నేతిలో పడింది. నక్క తోక తొక్కిన చందంగా రేవంత్ రెడ్డికి ఈ సంవత్సరం ఊహించని విధంగా ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఈ ఏడాది లీడర్ ఆఫ్ ది ఇయర్ గా తెలంగాణ రాజకీయాలలో చెప్పవచ్చు.
ఆది నుంచి సంచలనాలకు, వివాదాలకు కేంద్రంగా నిలుస్తూ తెలంగాణ రాజకీయాలలో తనదైన మార్క్ కొనసాగించిన వ్యక్తి రేవంత్ రెడ్డి.ఆర్ఎస్ఎస్, టీడీపీ మూలాలున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఒక ఊహించని పరిణామం అయితే, అధిష్టానం ఆయనను టిపిసిసి చీఫ్ గా నియమించడం, 2023లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేలా ఆయన పని చేయడం, మెజార్టీ స్థానాలలో గెలిపించడం అంతకన్నా ఊహించని పరిణామం.

టిపిసిసి బాధ్యతలు అప్పగించిన నాటినుండి సీనియర్ల నుండి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నా , తనదైన శైలిలో పని చేసుకుపోతూ, అధికార బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ కు వెన్నులో వణుకు పుట్టించిన నేత రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ పై మాటల దాడిని పెంచి, కెసిఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి అలుపెరుగని పోరాటం చేసిన నేత రేవంత్ రెడ్డి.
రేవంత్ రెడ్డి ని అణచివేసేందుకు తెలంగాణ సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆయన ఇంట్లోకి పోలీసులు చొరబడి, బెడ్ రూమ్ తలుపులు బద్దలు కొట్టి మరీ ఆయనను అరెస్టు చేసి తీసుకు వెళ్లినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా, కెసిఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి.
అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు కోల్పోయింది అని ప్రజలు భావిస్తున్న తరుణంలో టిపిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎంట్రీ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆది నుంచి నిదానంగా క్షేత్రస్థాయిలో పని చేసుకుంటూ, ప్రజల వద్దకు వెళుతూ, ప్రజా మద్దతును కూడగట్టుకున్న రేవంత్ రెడ్డి తన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలను అందించగలిగారు.
ఇక ఈ పరిణామమే రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసింది. ఉనికి కోసం పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి తన సారథ్యంలో అధికారాన్ని చేపట్టిన పవర్ఫుల్ పార్టీగా మార్చడంతో రేవంత్ రెడ్డికి అధిష్టానం సీఎంగా అవకాశం ఇచ్చింది. కెసిఆర్ ఎత్తులకు పైఎత్తులు వేస్తూ బీఆర్ఎస్ రాజకీయాన్ని చిత్తు చేసిన రేవంత్ రెడ్డి ఈ ఏడాది రాజకీయాలలో స్టార్ పొలిటీషియన్ అని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications