వైఎస్ షర్మిల పుట్టినరోజు: మంత్రి రోజా విషెస్; జగన్‌తో కలిసున్న ఫోటోలతో నెట్టింట సందడి!!
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల జన్మదినం నేడు. ఇక వైఎస్ షర్మిల పుట్టినరోజు సందర్భంగా అనేకమంది వైయస్ షర్మిల కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక అభిమానులైతే వైయస్ షర్మిల పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు పాటలు రిలీజ్ చేసి, పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు.
షర్మిలకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ
వైయస్ షర్మిల జన్మదిన వేడుకలకు సంబంధించి గతంలో వైఎస్సార్ వున్న సమయంలో, అన్న జగన్ మోహన్ రెడ్డి తో కలిసి ఉన్న సమయంలో పుట్టినరోజు జరుపుకున్న అనేక ఫోటోలను పోస్ట్ చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. షర్మిల, జగన్ ఇద్దరి మధ్య ఏమి ఉన్నా అభిమానుల మనసులో మాత్రం ఇద్దరూ ఒకటే అన్న అభిప్రాయం నేడు షర్మిల పుట్టినరోజు సందర్భంగా వైరల్ అవుతున్న ఫోటోలతో అర్ధం అవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నేతలు కూడా వైయస్ షర్మిల జన్మదినం సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

షర్మిలకు విషెస్ చెప్పిన మంత్రి రోజా
అందులో ముఖ్యంగా మంత్రి రోజా షర్మిల పుట్టినరోజు సందర్భంగా షర్మిల, తాను కలిసి ఉన్న ఒక ఫోటోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక మంత్రి రోజా పోస్ట్ చేసిన ట్వీట్ లో మీ పుట్టిన రోజు పూర్తిగా సూర్యకాంతితో, ఇంద్రధనస్సు తో, ప్రేమతో, సంతోషంతో నిండి ఉంటుందని తాను భావిస్తున్నానని, మీ ప్రత్యేకమైన ఈ రోజున తాను శుభాకాంక్షలు తెలుపుతున్నానని పేర్కొంటూ హ్యాపీ బర్త్ డే డియర్ వైయస్ షర్మిల గారు అంటూ రోజా ట్వీట్ చేశారు.
జగన్ తో పాటు షర్మిల ఉన్న అనేక ఫోటోలు వైరల్
ఇక రోజా చేసిన ట్వీట్ కు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ధన్యవాదాలు తెలుపుతూ ఆమె చేసిన పోస్ట్ ను రీ ట్వీట్ చేసింది. మంత్రి రోజా చేసిన ట్వీట్ లోనే పలువురు నాయకులు, అభిమానులు వైయస్ షర్మిలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఒక్క మంత్రి రోజా మాత్రమే కాదు పలువురు వైసిపి నేతలు సైతం వైయస్ షర్మిల కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏపీ వైఎస్సార్సీపీ అధినేత జగన్ ను, తెలంగాణాలో వైఎస్సార్టీపీ అధినేతి షర్మిలను కలిపి పోస్ట్ చేస్తున్న ఫోటోలు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ఎంతైనా అన్నా చెల్లెళ్ళు కదా అని అందరూ ఆలోచించేలా చేస్తున్నాయి.

తెలంగాణాలోనూ వైఎస్ షర్మిల పుట్టినరోజు వేడుకలు చేస్తున్న వైఎస్సార్టీపీ నాయకులు
ఇక ఈ సమయంలో జగన్ సోదరికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారా అని సోషల్ మీడియాలో వెతుకుతున్న వారు లేకపోలేదు. ఇక వైయస్సార్ తెలంగాణ పార్టీ నేతలు వివిధ జిల్లాలలో కేకులు కట్ చేస్తూ, వైయస్ షర్మిల జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. వైయస్ జగన్ అభిమానులు కూడా చాలామంది వైయస్ షర్మిలకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. నాడు జగన్ తో ఉన్న ఫోటోలను పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications