హైకోర్టు అనుమతి ఇచ్చినా వైఎస్ షర్మిల పాదయాత్ర కత్తి మీద సామే.. ఎందుకంటే!!
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే గత విచారణ సందర్భంగా విధించిన షరతులను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. వైయస్ షర్మిల పాదయాత్ర కు అనుమతి ఇవ్వాలని పోలీసులకు స్పష్టం చేసింది. తాము పాదయాత్ర చేసుకోవడానికి అనుమతి ఇచ్చినా, పోలీసులు ఎందుకు మళ్లీ అనుమతి నిరాకరించారని హైకోర్టు వరంగల్ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది.

వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతి వద్దని పోరాడిన తెలంగాణా ప్రభుత్వం .. అయినా అనుమతి
వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతి ఇవ్వరాదని కోర్టులో తెలంగాణా ప్రభుత్వం గట్టిగానే పోరాడింది. వైయస్ షర్మిల షరతులను ఉల్లంఘించారని కేసీఆర్ పై, తెలంగాణ ప్రభుత్వం పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, తాలిబన్ రాజ్యం తో పోల్చారు అని ప్రభుత్వం తరపు న్యాయవాది న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు. ఇక వాదోపవాదాల తర్వాత వైయస్ షర్మిల పాదయాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కోర్టు అనుమతిచ్చింది. అయితే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని షరతు విధించింది.

వైఎస్ షర్మిల పాదయాత్ర కత్తిమీద సామే..
ఈ క్రమంలో వైఎస్ షర్మిల పాదయాత్ర చేయగలుగుతారా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. వైఎస్ షర్మిల పాదయాత్ర కత్తిమీద సామే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇంతకు ముందు వరకు ఒకెత్తు ఇక ముందు మరో ఎత్తు అన్న చర్చ జోరుగా సాగుతుంది. వైయస్ షర్మిల కు తెలంగాణ పోలీసులు సహకరించే పరిస్థితి కనిపించటం లేదు. ఏ చిన్న సంఘటన జరిగినా పాదయాత్రను అడ్డుకోవడానికే వారి ప్రయత్నం చేస్తారు అన్న చర్చ ప్రధానంగా జరుగుతుంది. ఇక ఇదే సమయంలో వైయస్ షర్మిల పాదయాత్ర అడ్డుకోవడానికి వివిధ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నాయకులు సైతం రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వైఎస్ షర్మిల పాదయాత్ర చేయడం చాలా కష్టం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

బీఆర్ఎస్ నాయకులు పాదయాత్ర కొనసాగనిస్తారా ?
వైయస్ షర్మిల పాదయాత్ర చేసినా ఎవరిపైనా ఎక్కడా ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది. అలా పాదయాత్ర చేసీ ప్రయోజనం ఉండదు. ప్రతి నియోజకవర్గంలోనూ నియోజకవర్గ ఎమ్మెల్యే అవినీతిని ఎండగట్టడం తో పాటు, ప్రభుత్వ వైఖరిపై నిప్పులు జరిగే వైయస్ షర్మిల తన స్వభావానికి విరుద్ధంగా నియోజకవర్గాలలో సైలెంట్ గా పాదయాత్ర చేయడం సాధ్యమేనా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏది మాట్లాడినా అనుచిత వ్యాఖ్యలు అని తప్పు పట్టే బీఆర్ఎస్ నాయకులు ఆమె పాదయాత్రను కొనసాగానిస్తారా? అన్నది ప్రశ్నార్ధకంగానే ఉంది.

పోలీసులు పాదయాత్రను మళ్ళీ అడ్డుకునే ఛాన్స్.. షర్మిల ముందుకు సాగేదేలా?
ఏది ఏమైనా హైకోర్టు పాదయాత్రను కొనసాగించడానికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో వైయస్ షర్మిల మళ్లీ పాదయాత్రను కొనసాగిస్తారని సమాచారం. అయితే ఇంతకు ముందులాగా వైయస్ షర్మిల పాదయాత్ర ఉండబోదని స్పష్టంగా అర్థమవుతున్న క్రమంలో వైయస్ షర్మిల పాదయాత్రను మళ్లీ బీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే పరిస్థితి లేకపోలేదు. అదే గనక జరిగితే మళ్లీ శాంతి భద్రతల సమస్య తలెత్తిందని పోలీసులు వైయస్ షర్మిల పాదయాత్ర అడ్డుకోవడం ఖాయం గా కనిపిస్తుంది. ఇక ఇటువంటి పరిస్థితుల్లో వైయస్ షర్మిల తన అడుగులను ఏ విధంగా వేయబోతున్నారు? తెలంగాణ రాజకీయాల్లో ఆమె ఏ విధంగా ముందుకు సాగబోతున్నారు? అన్నది అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రజలలోనూ ఆసక్తికరంగా మారింది












Click it and Unblock the Notifications