వైఎస్ షర్మిల సెన్సేషన్ ; కమిటీలను రద్దుచేస్తూ సంచలన నిర్ణయం వెనుక మతలబు అదేనా!!
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైయస్ షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైయస్ఆర్ తెలంగాణ పార్టీలో ప్రస్తుతమున్న కమిటీలను రద్దు చేస్తున్నట్లుగా వైయస్ షర్మిల ఒక ప్రకటన చేశారు. అంతేకాదు తాజాగా కమిటీల స్థానంలో జిల్లాలకు కోఆర్డినేటర్లు నియమిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన షర్మిల
గతేడాది జూలై 8 వ తేదీన వైయస్సార్ తెలంగాణ పార్టీని అధికారికంగా ప్రకటించిన వైయస్ షర్మిల, నాటి నుండి తన దూకుడును కొనసాగిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కు, గులాబీ పార్టీ నేతలకు రాష్ట్రంలోని అనేక సమస్యలపై ప్రశ్నాస్త్రాలను సంధిస్తూ, ప్రజల పక్షాన పోరాటం చేస్తూ షర్మిల అధికార పక్షానికి ఊపిరాడనివ్వడం లేదు.
ఒకపక్క ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తూనే, మరోపక్క పార్టీపై దృష్టి సారించి, పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో ఉత్సాహంగా పని చేస్తున్న నాయకులకు అవకాశం ఇవ్వాలని వారిని జిల్లాలలో పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేలా ప్రోత్సహించాలని షర్మిల భావిస్తున్నారు.

పాత కమిటీలను రద్దు చేసిన షర్మిల .. ఆ స్థానంలో జిల్లాలకు కోఆర్డినేటర్లు
ఈ క్రమంలో గత ఏడాది పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల ఆ తర్వాత పార్లమెంటు నియోజకవర్గాలకు కోఆర్డినేటర్ లను, రాష్ట్రస్థాయిలో అధికార ప్రతినిధులను, సోషల్ మీడియా తో పాటుగా పలు రకాల విభాగాలను ఏర్పాటు చేసి ఇన్చార్జి లను నియమించారు. అయితే ఇంతకాలం వారందరి పని తీరును అంచనా వేసి తాజాగా వాటన్నింటినీ రద్దు చేస్తున్నట్లుగా షర్మిల ప్రకటించారు. ఇక ఆ స్థానంలో జిల్లాలకు కోఆర్డినేటర్లు నియమిస్తున్నట్లుగా వెల్లడించారు.

నూతన కో ఆర్డినేటర్ల వివరాలు ఇవే
ఇక నూతనంగా నియమించిన కోఆర్డినేటర్ల విషయానికి వస్తే గ్రేటర్ హైదరాబాద్ కు వడుక రాజగోపాల్ ను , ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గడిపల్లి కవితను, వరంగల్ హనుమకొండ లకు నాడెం శాంతి కుమార్ ను, ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి గా బెజ్జంకి అనిల్ కుమార్ ను నియమించారు వైయస్ షర్మిల. అలాగే నిజామాబాద్ జిల్లా కు నీలం రమేష్ ను, యాదాద్రి భువనగిరి జిల్లా కు మహమ్మద్ అత్తార్ ఖాన్, వికారాబాద్ జిల్లా కు తమ్మాలి బాలరాజులకు బాధ్యతలు అప్పగించారు.

జిల్లాల వారీగా ఇంచార్జ్ లను నియమించటంతో పార్టీలో చర్చ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కు అప్పం కిషన్, నల్గొండ జిల్లాకు ఇంజమ్ నర్సిరెడ్డి, ములుగు జిల్లా కు రామ సహాయం శ్రీనివాస్ రెడ్డిని, రంగారెడ్డి జిల్లా కు ఎడమ మోహన్ రెడ్డి ని, నారాయణపేట జిల్లాకు మడివాల కృష్ణను నూతన కోఆర్డినేటర్లు గా నియమించారు. వైయస్ షర్మిల ఒక్కసారిగా పార్టీలోని అన్ని కమిటీలను రద్దు చేసి తిరిగి జిల్లాల వారీగా ఇంచార్జ్ లను నియమించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీలో నిలవటం కోసం షర్మిల పార్టీలో పలు మార్పులు చేస్తున్నారని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. పార్టీ పెట్టిన నాటి నుండి పార్టీ కోసం పనిచేస్తున్న నాయకుల పని తీరును బట్టి ఆమె నూతన కోఆర్డినేటర్లను ఏర్పాటు చేసినట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications