టీడీపీ-బీజేపీ పొత్తు ఖరారు ? వైసీపీ, బీఆర్ఎస్ దాడి మొదలు! చంద్రబాబుకు కలిసొస్తున్న వైనం!
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష నేత చంద్రబాబు ఇన్నాళ్లుగా చేస్తున్న పోరాటం ఓ ఎత్తయితే ఇప్పుడు తాజాగా మారిన పరిస్దితుల్లో ఆయన చేయాల్సిన పోరాటం మరో ఎత్తుగా మారబోతోంది. దీనికి ప్రధాన కారణం తెలంగాణలో బీజేపీతో టీడీపీకి దాదాపుగా పొత్తు ఖరారు కావడమే. తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటనతో తెలంగాణలో చంద్రబాబు ఇచ్చిన రీఎంట్రీ తర్వాత బీఆర్ఎస్, వైసీపీ ఆయన్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టేశాయి. దీంతో ఎన్నికల రాజకీయంపై ఓ క్లారిటీ వచ్చేసింది.

బీజేపీ-టీడీపీ పొత్తు ఖరారు?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ అక్కడి అధికార పార్టీ టీఆర్ఎస్ ను ముచ్చెమటలు పట్టించింది. చివరికి టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ గా మారేందుకు కారణమైంది. ఇప్పుడు బీఆర్ఎస్ గా మారినా బీజేపీని కచ్చితంగా ఓడిస్తుందో లేదో తెలియని పరిస్దితి. దీనికి దారి తీస్తున్న కారణాల్లో టీడీపీతో బీజేపీ పెట్టుకోబోతున్న పొత్తు కూడా ఒకటి.
ఇప్పటికే టీడీపీతో పొత్తు కోసం రంగం సిద్ధం చేస్తున్న బీజేపీ అధిష్టానం.. అందులో భాగంగానే ముందుగా ఆ పార్టీకి సన్నిహితులైన జూనియర్ ఎన్టీఆర్, రామోజీరావు వంటి వారితో చర్చలు కూడా జరిపింది. ఇందులోనే దాదాపు క్లారిటీ ఇచ్చేసింది. అయితే ఆ బహిరంగ ప్రకటన చేయడం ఒక్కటే మిగిలింది.

తెలంగాణలో చంద్రబాబు రీఎంట్రీ
తెలంగాణ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కోసం బీజేపీ ఎప్పుడైతే సంకేతాలు ఇచ్చిందో అప్పుడే చంద్రబాబు రెడీ అయిపోయారు. మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చిందని భావించారు. అయితే తెలంగాణలో రీఎంట్రీకి సరైన సమయం కోసం ఎదురుచూశారు. అదీ రానే వచ్చింది. తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లా టూర్ తో చంద్రబాబు రీఎంట్రీ చేసేశారు.
త్వరలో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో టీడీపీ సభలు పెట్టి ఎన్నికల సంగ్రామంలోకి అడుగుపెట్టేందుకు చంద్రబాబు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే అధికార బీఆర్ఎస్ తో సై అంటే సై అంటున్న బీజేపీతో పొత్తు పెట్టుకుని తెలంగాణలో అధికార భాగస్వామి అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో టీడీపీ-బీజేపీ పొత్తు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాక రేపుతోంది.

దాడి మొదలుపెట్టేసిన వైసీపీ, బీఆర్ఎస్
తెలంగాణలో ఎలాంటి అడ్డంకుల్లేకుండా చంద్రబాబు రీఎంట్రీ ఇచ్చేయడంతో వైసీపీ, బీఆర్ఎస్ ఆయన్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టేశాయి. ఏపీలో చంద్రబాబుకు అడ్రస్ లేదని, ఏపీని వదిలి తెలంగాణలో రాజకీయాలు చేసుకుంటున్నారని వైసీపీ విమర్శిస్తుండగా.. ఆయన తెలంగాణకు వచ్చినా చేసేదేమీ లేదని బీఆర్ఎస్ విమర్శిస్తోంది.
అంతేకాదు గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని గుర్తుచేస్తూ బీఆర్ఎస్ నేతలు చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. అయితే ఓ విషయంలో మాత్రం వైసీపీ, బీఆర్ఎస్ ఇద్దరూ చంద్రబాబును ఒకేలా టార్గెట్ చేస్తున్నాయి. అదే బీజేపీతో టీడీపీ పొత్తు.

చంద్రబాబుకు కలిసొచ్చిన బీఆర్ఎస్?
కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ తెలంగాణను దాటి ఈ నెలలో ఏపీలో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో గతంలోలా తెలంగాణ సెంటిమెంట్ ను ప్రయోగిస్తూ చంద్రబాబును అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కు అవకాసం లేకుండా పోయింది. ఇప్పుడు తెలంగాణలో చంద్రబాబును అడ్డుకుంటే ఏపీలో బీఆర్ఎస్ ను టీడీపీ అడ్డుకునే అవకాశముంది.
దీంతో చంద్రబాబు విషయంలో ఈసారి కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు ఆచితూచి స్పందిస్తున్నారు. ఇదే అదనుగా చంద్రబాబు గతంలో తనను తీవ్రంగా వ్యతిరేకించిన ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సైతం సభలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అంతిమంగా బీజేపీతో పొత్తు ప్రకటన అధికారికంగా వచ్చేలోపు తెలంగాణ జిల్లాల్ని కూడా ఏపీతో సమానంగా చుట్టేసేందుకు చంద్రబాబు వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications