Tirumala: తిరుమల నడక మార్గంలో చిరుత పులి, ఎలుగుబంటి..
తిరుమల నడక మార్గంలో మరోసారి చిరుత పులి సంచారం కలకలం రేపింది. చిరుత, ఎలుగుబంటి కదలికలు కనిపించడంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. గడచిన నెల రోజుల్లో రెండు రోజులపాటు వీటి సంచారం కనిపించినట్లు అధికారులు చెబుతున్నారు. చిరుత, ఎలుగుబంటి సంచరించినట్లు ట్రాప్ కెమెరాల్లో వీడియో రికార్డు అయింది. డిసెంబర్ నెలలో 13, 29 తేదీల్లో ట్రాప్ కెమెరాకు చిరుత చిక్కినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
చిరుత, ఎలుగుబంటి సంచారంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు భక్తులను హెచ్చరించారు. నడకమార్గంలో వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మెట్ల మార్గంలో గుంపులుగా వెళ్లాలని కోరింది. శేషాచల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో రెండు సార్లు చిరుత సంచారం కనిపించిందని అటవీ శాఖ అధికారి పేర్కొన్నారు. ఎలుగుబంటి సంచారం కూడా కనిపించిందని చెప్పారు.

నడక మార్గానికి సమీపంలో ఎక్కడా జంతు సంచారం లేదని.. అలిపిరి కాలిబాట మార్గంలోని 7వ మైలు నుంచి నరసింహ స్వామి ఆలయం వరకు ఫారెస్ట్ సిబ్బంది ప్రత్యేకంగా గస్తీ నిర్వహిస్తున్నారని వివరించారు. కాలినడకన భక్తులు ఎలాంటి ఆందోళన పడాల్సిన పనిలేదన్నారు.
గత రెండు నెలల క్రితం తిరుమల నడక మార్గంలో చిరుత పులి చిన్నారిపై దాడి చేసింది. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందడంతో తిరుమలలో కలకలం రేపింది.
ఈ నేపథ్యంలో టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అటవీ కలిసి ఆపరేషన్ చిరుత చేపట్టారు. చిరుతలను బోన్లలో బంధించారు. నడక మార్గంలో వెళ్లే భక్తులకు కర్రలు కూడా ఇచ్చారు. నెలరోజుల నుంచి భక్తులు ఎలాంటి ఆందోళన లేకుండా మెట్లమార్గంలో కొండపైకి వెళ్తున్నారు. తాజాగా ఎలుగుబంటి, చిరుత సంచారం భక్తులను మరోసారి కలవరానికి గురి చేస్తోంది.












Click it and Unblock the Notifications