Tirupati: శ్రీవారి నామాలతో గరుడ వారధి ఫ్లైఓవర్ తొలి పిల్లర్: శరవేగంగా నిర్మాణ పనులు..!
తిరుపతి: పరమ పవిత్ర పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న తిరుమలను సందర్శించడానికి దేశ, విదేశాల నుంచీ వేల సంఖ్యలో చేరుకునే భక్తుల సౌకర్యం కోసం తిరుపతిలో నిర్మిస్తోన్న గరుడ వారధి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఏకధాటిగా కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది నాటికి అందబాటులోకి తీసుకుని రావాలనే ఉద్దేశంతో ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వేగవంతం చేశారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. ఇందులో భాగంగా నిర్మితమైన తొలి పిల్లర్‌కు శ్రీవారి నామాలతో డిజైన్ చేశారు.

సీతాకోక చిలుక రూపంలో..
తిరుమలను సందర్శించడానికి ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేస్తుంటారు భక్తులు. ఏటేటా పెరుగుతోన్న భక్తల రద్దీ వల్ల తిరుపతిలో వాహనాల రాకపోకలు నిత్యం స్తంభించిపోతుంటాయి. తిరుపతి రైల్వేస్టేషన్, బస్ స్టేషన్, అలిపిరి వంటి చోట్ల వేలాది మంది భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. దీనికితోడు- ప్రైవేటు వాహనాలు, ఆటోలతో ఆయా ప్రాంతాలన్నీ కిటకిటలాడుతుంటాయి. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి ఓ భారీ వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు.

ఆరు కిలోమీటర్లు.. 684 కోట్ల రూపాయలు..
ఈ ఎలివేటెడ్ కారిడార్ పొడవు ఆరు కిలోమీటర్లు. దీని నిర్మాణానికి అయ్యే ఖర్చు 684 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ కారిడార్ నిర్మాణాన్ని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అయినందు వల్ల ఇందులో కేంద్రప్రభుత్వ వాటా 65 శాతం ఉంటుంది. మరో 35 శాతం నిధులను తిరుమల తిరుపతి దేవస్థానం భరిస్తుంది. నిజానికి ఈ 35 శాతం నిధులను తిరుమల తిరుపతి దేవస్థానం, రాష్ట్ర ప్రభుత్వం సమానంగా భరించాల్సి ఉంది. ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడం వల్ల ఈ వాటాను టీటీడీనే భరిస్తోంది.

అత్యంత రద్దీ మార్గంలో.. నాన్‌స్టాప్ ప్రయాణం..
తిరుపతిలో అత్యంత రద్దీ మార్గాల్లో ఒకటి అలిపిరి రోడ్. రేణిగుంట వైపు నుంచి తిరుమలకు వెళ్లే వాహనాలు ఈ మార్గం గుండానే రాకపోకలు సాగిస్తుంటాయి. అందుకే ఈ మార్గంలోనే ఈ కారిడార్‌ను నిర్మిస్తున్నారు. తిరుచానూరు సమీపంలోని మ్యాంగోమార్కెట్ వద్ద ఎలివేటెడ్ కారిడార్ వంతెన ఆరంభమౌతుంది. లక్ష్మీపురం సర్కిల్, రామానుజుల వారి సర్కిల్, శ్రీనివాసం, లీలామహల్ సెంటర్ మీదుగా వెళ్తుంది. నంది సర్కిల్ వద్ద ఈ వంతెన ముగుస్తుంది. అక్కడి నుంచి ఎలాంటి వాహనాల రాకపోకలకు సంబంధించిన ఇబ్బందులు లేకుండా అలిపిరి టోల్‌గేట్ వరకూ వెళ్లవచ్చు.

సీతాకోక చిలుక రూపంలో..
సీతాకోక చిలుక ఆకృతిలో వంతెన మార్గమధ్యలో ఎంఎస్ సుబ్బులక్ష్మి సర్కిల్ వద్ద ఎలివేటెడ్ కారిడార్‌ను సీతాకోక చిలుక ఆకృతిలో నిర్మిస్తారు. తిరుచానూరు నుంచి వంతెన మీదుగా తిరుపతి బస్‌స్టాండ్ లేదా రైల్వేస్టేషన్ వెళ్లడానికి ఇక్కడ ర్యాంప్ ఏర్పాటు చేస్తారు. బస్‌స్టాండ్ లేదా రైల్వేస్టేషన్ నుంచి రేణిగుంట వైపునకు వెళ్లడానికి కూడా అవసరమైన ర్యాంప్‌ను ఈ ప్రాంతంలో నిర్మిస్తారు. దీనితో పాటు బస్‌స్టాండ్, రైల్వేస్టేషన్‌ల నుంచి వంతెన మీదుగా అలిపిరి చేరుకునే వారికి, రేణిగుంట నుంచి అలిపిరికి వెళ్లాల్సిన వాహనాల కోసం ప్రత్యేక ర్యాంప్‌లను అందుబాటులోకి తీసుకొస్తారు. దీనితో అక్కడ సీతాకోక రెక్కల తరహా ఆకృతి ఏర్పడుతుంది.












Click it and Unblock the Notifications