తిరుమలలో ముఖేష్ అంబానీ: టీటీడీ ఏర్పాట్లపై..: కాబోయే కోడలితో కలిసి..!!
తిరుపతి: దేశీయ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీల అధినేత ముఖేష్ అంబానీ.. తిరుమలకు వచ్చారు. ఈ ఉదయం ఆయన శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి నిజపాద దర్శనం సేవలో పాల్గొన్నారు. తన కుటుంబ సభ్యులు, కాబోయే కోడలు రాధిక మర్చంట్‌తో కలిసి ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. రాధిక మర్చంట్.. ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీకి కాబోయే భార్య.
తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీనివాసుడి నిజపాద దర్శన సేవలను పూర్తి చేసుకున్నారు. వారితో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మా రెడ్డి, పాలక మండలి సభ్యుడు, చంద్రగిరి శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి లోక్‌సభ సభ్యుడు డాక్టర్ మద్దిళ్ల గురుమూర్తి ఆయన వెంట ఉన్నారు. అనంతరం అర్చకులు రంగనాయకుల మండపంలో ముఖేష్ అంబానీకి శ్రీవారి శేష వస్త్రాన్ని బహూకరించారు. తీర్థప్రసాదాలను అందజేశారు. వేదమంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనాలు పలికారు.

అనంతరం ముఖేష్ అంబానీ కోటిన్నర రూపాయల డీడీని ఈఓ ధర్మారెడ్డికి అందజేశారు. అనంతరం తనను కలిసిన విలేకరులతో క్లుప్తంగా మాట్లాడారు. శ్రీవారిని దర్శించుకోవడం పట్ల ఆనందంగా ఉందని, కొంత విరామం అనంతరం మళ్లీ తిరుమలకు వచ్చానని చెప్పారు. తిరుమలలో ఏర్పాట్లు చాలా బాగున్నాయంటూ టీటీడీ అధికారులను ప్రశంసించారు. ఎప్పటికప్పుడు ఇక్కడి ఏర్పాట్లు మరింత మెరుగుపడుతున్నాయని అన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖుల్లో బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు కూడా ఉన్నారు. ఈ తెల్లవారు జామున వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. తిరుపతి జిల్లాలో వెంకటగిరిలో పోలేరమ్మ జాతరలో పాల్గొన్నారు. అనంతరం తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహంలో ఆమె బస చేశారు. ఈ తెల్లవారు జామున స్వామివారిని దర్శించుకున్నారు.

కాగా- తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వెలుపల క్యూ లైన్లలో భక్తులు వేచి ఉంటోన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి సుమారుగా 18 గంటల సమయం పడుతోంది. గురువారం నాడు శ్రీవారిని 65,634 మంది భక్తులు దర్శించుకున్నారు.

తమ మొక్కులను చెల్లించుకున్నారు. వారిలో 31,419 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. హుండీ ద్వారా నాలుగు కోట్ల రూపాయలకు పైగా ఆదాయం టీటీడీకి అందింది.












Click it and Unblock the Notifications