రేపు తిరుమలలో శ్రీవారి పౌర్ణమి సేవ.. జులై నెలలో విశేష ఉత్సవాలు ఇవే!!
కలియుగ వైకుంఠ దైవం, కోరి కొలిచిన వారికి కొంగుబంగారం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతీ నెల స్వామి వారికి విశేష పూజలు నిర్వహిస్తారు. రేపు ఆషాడ పౌర్ణమి సందర్భంగా విశేష సేవలు జరగనున్నాయి. స్వామివారికి రేపు గరుడ సేవ చేయనున్నారు.
రేపు రాత్రి సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామి వారు గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తారు. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టిటిడి స్వామివారికి గరుడ సేవ ను నిర్వహిస్తుంది.ఈ ఆషాడ మాసంలో వచ్చే పౌర్ణమికి విశేషం ఉన్న కారణంగా రేపు ఈ వేడుకను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. రేపు గురు పౌర్ణమిని స్వామి వారి ప్రత్యేక సేవలతో నిర్వహించనున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలో జులై నెలలో జరిపించే విశేష ఉత్సవాలను టీటీడీ వెల్లడించింది. జులై 1వ తేదీన స్వామివారి ఆలయంలో శని త్రయోదశి నిర్వహించగా, రేపు మూడవ తేదీన ఆషాఢ పూర్ణిమ, వ్యాస పూజ, గురు పూర్ణిమ ను నిర్వహించనున్నారు. ఆపై 13వ తేదీన సర్వ ఏకాదశి, మళ్లీ 15వ తేదీన శనిత్రయోదశి, 17వ తేదీన శ్రీవారి ఆణివార ఆస్థానం నిర్వహించనున్నారు.
22వ తేదీన ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర, శ్రీవారు పురుసై వారి తోట కు వేంచేయటం, 30వ తేదీన నారాయణగిరి లో ఛత్ర స్థాపన మహోత్సవం వంటి విశేష ఉత్సవాలు ఉంటాయని టీటీడీ పేర్కొంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.
అన్ని కంపార్టుమెంటులు భక్తుల రద్దీతో నిండిపోయాయి. ఆషాడ మాసం కావడంతో గత కొద్ది రోజులుగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు రద్దీ తగ్గింది. కేవలం మూడు గంటల్లోనే స్వామి దర్శనం కూడా పూర్తయింది. అయితే మళ్లీ శుక్రవారం నుంచి భక్తుల రద్దీ విపరీతంగా పెరగడం ప్రధానంగా కనిపిస్తుంది. భక్తులు క్యూకాంప్లెక్స్ ల బయట కూడా శ్రీవారి దర్శనానికి వేచి ఉన్నారు.












Click it and Unblock the Notifications