టీటీడీ సాంప్రదాయ భోజనం తక్షణం నిలిపివేస్తున్నాం : టీటీడీ చైర్మన్ సంచలన నిర్ణయం, రీజన్ ఇదే !!
తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల వెంకన్నను దర్శించుకోవడానికి వచ్చే శ్రీవారి భక్తులకు సాంప్రదాయ భోజనాన్ని అందించాలని ప్రయోగం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఆగస్టు 26వ తేదీ నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకూ సాంప్రదాయ భోజనాన్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చి పరిశీలించాలని భావించిన టిటిడి సాంప్రదాయ భోజనంపై అనేక విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీ సాంప్రదాయ భోజనంపై తిరుమల తిరుపతి దేవస్థానం వెనక్కు తగ్గింది

దేశీయ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ఉత్పత్తులతో వండిన భోజనమే సాంప్రదాయ భోజనం
అసలు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకు వచ్చిన సాంప్రదాయ భోజన విధానం ఏంటి ? ప్రస్తుతం దానిని తక్షణం నిలిపి వేయడానికి గల కారణం ఏమిటి అంటే .. పూర్తిగా దేశీయ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన ఆహార ఉత్పత్తులతో వండిన భోజనాన్ని భక్తులకు అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ ఆహార పదార్థాలను తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, ప్రస్తుత కరోనా సమయంలో శాస్త్రవేత్తలు కూడా ఇమ్యూనిటీని పెంచే ఆహారాన్ని ప్రధానంగా చర్చిస్తున్నారని టీటీడీ ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి వెల్లడించారు. ఈ క్రమంలోనే తిరుమలకు వచ్చే భక్తుల కోసం సహజసిద్ధమైన సాంప్రదాయ భోజనాన్ని అందించడానికి నిర్ణయించారు.

భక్తులకు సాంప్రదాయ భోజనం అందించాలని నిర్ణయం తీసుకున్న టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పలమనేరులో సుమారు 450 ఎకరాలను దేశీయ గోశాల ఉంది. సేంద్రియ ఎరువులు పంచగవ్య వంటివి ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. వీటి ద్వారా గో ఆధారిత వ్యవసాయాన్ని నిర్వహిస్తున్నారు. దేశీయ ఆవుల ఎరువులతో పండించిన పంటలతో సాంప్రదాయ ఆహారాన్ని తయారుచేసి భక్తులకు అందించాలని టిటిడి భావించింది. గతంలో అన్నమయ్య భవనంలో ప్రైవేట్ క్యాంటీన్ నిర్వహణ గడువు ముగియడంతో, తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య భవన్లో ఈ సాంప్రదాయ భోజనాన్ని అందించాలని , కాస్ట్ టు కాస్ట్ సేల్ విధానంలో భక్తులకు అందించే ప్రయత్నం చేయాలని భావించింది.

లాభాపేక్ష లేకుండా భోజనం అందించాలని ప్రయోగం మొదలుపెట్టిన టీటీడీ
కొర్రలు, సామలు, అరికలు వంటి చిరుధాన్యాలతో వండిన పదార్థాలు, ముడి బియ్యంతో వండిన పదార్థాలు మొత్తం పదిహేను రకాలకు పైగా వంటకాలను తయారుచేసి భక్తులకు అందిస్తున్నారు. ఈ సాంప్రదాయ భోజనాన్ని శాశ్వత ప్రాతిపదికన, లాభాపేక్ష లేకుండా అందించాలని నిర్ణయించారు. అయితే డబ్బులు తీసుకుని భోజనం పెట్టాలని టిటిడి తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ వ్యవహారంపై టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి స్పందించారు. ఈ క్రమంలో ఆయన ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
Recommended Video

సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ .. తక్షణం సాంప్రదాయ భోజనం నిలిపివేస్తూ చైర్మన్ సంచలనం
భోజనానికి డబ్బులు తీసుకోవాలని నిర్ణయించడంపై సామాజిక మాధ్యమాలలో విమర్శల వెల్లువగా మారడంతో టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి సాంప్రదాయ భోజన విధానాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై అధికారులతో కూడా చర్చించామని ఆయన తెలిపారు. పాలకమండలి లేనప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించిన టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, స్వామివారి ప్రసాదంగానే భోజనం అందించాలని అన్న ప్రసాదానికి డబ్బులు తీసుకోకూడదని పేర్కొన్నారు. ఇదే సమయంలో తిరుమల సాంప్రదాయ భోజనం పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. భక్తులు, దాతలు అసత్య ప్రచారాలను నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది .












Click it and Unblock the Notifications