శ్రీవారి హుండీపై కానుకల సునామీ: టీటీడీ అంచనాలకు అందని విధంగా
తిరుపతి: కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డులు తిరగరాస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఎప్పుడూ లేనివిధంగా కోట్ల రూపాయల మేర రాబడి వస్తోంది. కోట్లాదిమంది భక్తులు శ్రీవారికి హుండీ ద్వారా సమర్పించే కానుకల విలువ 100 కోట్ల రూపాయలను దాటుతోంది. హుండీ ద్వారా వచ్చే ఆదాయం వరుసగా కొన్ని నెలలుగా 100 కోట్ల రూపాయల మార్క్‌ను అధిగమిస్తోంది.

ఈ నెలలో ఇప్పటికే రూ.100 కోట్లు
ఈ నెలలో మరోసారి రికార్డు ఆదాయం అందే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే స్వామివారి హుండీ ఆదాయం 100 కోట్ల రూపాయలను దాటేసింది. ఈ నెల ముగియడానికి ఇంకా ఎనిమిది రోజుల గడువు ఉంది. ఈ లోగా శ్రీవారి హుండీ ఆదాయం మరో 40 కోట్ల రూపాయలకు చేరుకోవచ్చనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నెల 5వ తేదీన ఒక్కరోజే 6 కోట్ల 18 లక్షల రూపాయల మేర ఆదాయం.. హుండీ ద్వారా టీటీడీకి లభించింది.

ఆ రికార్డు తెరమరుగు..
ఈ స్థాయిలో హుండీ ఆదాయం రావడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో పది సంవత్సరాల కిందట నమోదైన ఒక్కరోజు రికార్డుస్థాయి హుండీ ఆదాయం తెరమరుగైంది. 2012 ఏప్రిల్ 1వ తేదీన లభించిన టీటీడీకి హుండీ ద్వారా అందిన ఒక్కరోజు ఆదాయం 5 కోట్ల 73 లక్షల రూపాయలు. ఇప్పుడది తెరమరుగైంది. కాగా- నాలుగు నెలలుగా శ్రీవారి హుండీ ఆదాయం వంద కోట్ల రూపాయలను అధిగమిస్తోంది. ఈ ఏడాది మార్చి నుంచి వరుసగా ప్రతి నెలా హుండీ రెవెన్యూ వంద కోట్ల రూపాయలను దాటుతోంది.

ప్రతినెలా వంద కోట్లు..
మార్చిలో 128 కోట్ల రూపాయలు, ఏప్రిల్‌లో 127.50 కోట్ల రూపాయలు, మేలో 130.50 కోట్ల రూపాయల హుండీ ఆదాయం రికార్డయింది. జూన్‌లో కూడా 123.76 కోట్ల రూపాయలు అందాయి. ఈ నెలలో తొలి మూడు వారాల్లోనే హుండీ రాబడి 100 కోట్ల రూపాయలను దాటింది. ఈ నెల ముగిసే సరికి మరో 40 కోట్ల రూపాయల ఆదాయం అందుతుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు. అదే జరిగితే- ఈ నెల హుండీ రాబడి సరికొత్త రికార్డును సృష్టించినట్టవుతుంది.

ఇదివరకు ఆర్థిక కష్టాలు..
కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల కారణంగా రెండు సంవత్సరాల పాటు టీటీడీ కొంత మేర నిధుల కొరతను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నెలల తరబడి శ్రీవారిని దర్శించడానికి తిరుమలకు వచ్చే భక్తుల రాకపోకలపై నిషేధం విధించడం వల్ల రోజువారీ ఆదాయం గణనీయంగా తగ్గింది. ఇప్పుడా పరిస్థితులు లేవు. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. రోజూ 75 నుంచి 80 వేల మందికి పైగా భక్తులు ఏడుకొండలవాడిని దర్శించుకుంటోన్నారు.

భక్తుల రద్దీ..
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 26 కంపార్టుమెంట్లలో భక్తులు నిండిపోయారు. శ్రీవారి సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. శనివారం ఏడుకొండలవాడిని 78,479 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 37,521 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.76 కోట్ల రూపాయలు. సగటున ప్రతీరోజూ హుండీ ద్వారా మాత్రమే అయిదు కోట్ల రూపాయలకు పైగా ఆదాయం శ్రీవారికి అందుతోంది.












Click it and Unblock the Notifications