Tirumala: టీటీడీ కీలక నిర్ణయం.. గోవిందా అని కోటిసార్లు రాస్తే వీఐపీ దర్శనం..
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రామ కోటి తరహాలో గోవిందా అని కోటి సార్లు రాస్తే వారిని కుటుంబ సమేతంగా వీఐపీ దర్శనానికి అనుమతి ఇస్తామని టీటీడీ తెలిపింది. గోవిందా అని కోటిసార్లు రాసిన వారు ఆ బుక్ ను టీటీడీకి పంపాలని కోరింది. ఆలా రాసిన వారికి, వారి కుటుంబ సభ్యులకు వీఐపీ దర్శనానికి అనుమతి ఇస్తామని టీటీడీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
గోవిందా అని 10,01,116 సార్లు రాస్తే ఒక్కరికే మాత్రమే వీఐపీ దర్శనం ఉంటుందని వెల్లడించింది. యువతలో భక్తిభావం పెంచేలా 25 ఏళ్లలోపు వయసున్న యువతీయువకులను గోవింద కోటి రాసేలా ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారు. యువతలో సనాతన ధర్మం పట్ల, విలువ పట్ల అవగాహన పెంచే కార్యక్రమాలు చేస్తున్నట్టు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం భగవద్గీత సారాంశాన్ని 20 పేజీల పుస్తకం రూపంలో యువతకు అందజేస్తామని వివరించారు.

తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న రెండు, మూడు గోవిందరాజస్వామి సత్రాలను తొలగించి, 600కోట్ల రూపాయలతో ఆధునిక వసతి సముదాయాలను నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అధికమాసం రావడంతో ఈఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు జరగనునన్నందున.. భక్తుల దర్శనాలు, వసతి సౌకర్యాలపై సమావేశంలో చర్చించామని కరుణాకర్‌రెడ్డి చెప్పారు.
2కోట్ల రూపాయలతో చంద్రగిరి మూలస్థాన ఆలయ జీర్ణోద్ధరణ, 5 కోట్ల రూపాయలతో ముంబయి బాంద్రాలో తితిదే సమాచార కేంద్రం, కోటిన్నరతో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టనున్నట్లు టీటీడీ ప్రకటించింది. తిరుమల అన్నమయ్య భవనంలో తొలిసారి సమావేశమైన పాలక మండలి... నూతన భవనాలకు అచ్యుతం, శ్రీపథం అనే పేర్లు పెట్టాలని తీర్మానం చేసింది. సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు మంచి కావని అన్నారు.












Click it and Unblock the Notifications