తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకల్లో ప్రముఖులు .. స్వర్గంలో నడిచిన అనుభూతి ఉందన్న రోజా
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలన్నీ భక్త జనసందోహంతో పోటెత్తాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార దర్శనం కోసం వైకుంఠ ద్వారాలు తెరిచారు ఆలయ అర్చకులు. ఈరోజు ఉదయం నాలుగు గంటల నుండి స్వామివారి వైకుంఠద్వార దర్శనం ప్రారంభం కాగా వీఐపీలు దర్శనాల కోసం పోటెత్తారు.

వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన ప్రముఖులు
వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, పలువురు ప్రముఖులు ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బోబ్డే ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇందు మల్హోత్రా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు, జస్టిస్ సి వి నాగార్జున రెడ్డి, ఏపీ హైకోర్టు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ ఈశ్వరయ్య, హైకోర్టు న్యాయమూర్తి వెంకటరమణ, తెలంగాణ హైకోర్టు జస్టిస్ అమర్నాథ్ గౌడ్ సైతం స్వామివారిని దర్శించుకున్నారు.
తిరుమల వెంకన్న వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్న ఏపీ మంత్రులు
ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంత్రులు ఈ రోజు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు అవంతి శ్రీనివాస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్ స్వామివారిని దర్శించుకున్నారు. ఎంపీలు మిథున్ రెడ్డి, వేమారెడ్డి ప్రభాకర్ రెడ్డి, గోరంట్ల మాధవ్, మోపిదేవి వెంకటరమణ సైతం స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా తిరుమల శ్రీవారిని వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా దర్శించుకున్నారు.
తెలంగాణా రాష్ట్రం నుండి కూడా స్వామి దర్శనానికి పోటెత్తిన ప్రముఖులు
ఆంధ్రప్రదేశ్ నూతన సియస్ ఆదిత్యనాథ్ కూడా ఉత్తరద్వార దర్శనం ద్వారా స్వామివారి దర్శనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, మంత్రి మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, తెలంగాణ కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్, బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్, తదితరులు ఈరోజు తిరుమలకు క్యూ కట్టారు. ఈ రోజు మొత్తం 3,000 మంది వీఐపీలకు టిక్కెట్లు కేటాయించామన్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి . భక్తుల సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు.

వైకుంఠ ద్వార దర్శనం .. ఎంతో అదృష్టం , స్వర్గంలో నడిచిన అనుభూతి : రోజా
వైకుంఠ ఏకాదశి సందర్భంగా నగరి ఎమ్మెల్యే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ ద్వార దర్శనంపై స్పందించిన రోజా వైకుంఠ ద్వార దర్శనం చేస్తుంటే స్వర్గంలో నడిచిన అనుభూతిని పొందామని, ఈరోజు స్వామిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ పులకించిపోయారు అని, ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఈ రోజు స్వామి దర్శనం దొరకదని పేర్కొన్నారు. 2020 ఎన్నో కష్టాలను, నష్టాలను చూశామని, కరోనా కారణంగా ఇబ్బందులు పడ్డామని పేర్కొన్న రోజా 2021 లో అందరూ సంతోషంగా ఉండాలని, ప్రతి ఒక్కరి కష్టాలు తొలగిపోవాలని స్వామివారిని కోరుకున్నారని తెలిపారు.