లండన్ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న వైఎస్ జగన్: ఘన స్వాగతం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన విదేశీ పర్యటనను ముగించుకుని విజయవాడ చేరుకున్నారు. సెప్టెంబర్ 2న తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించిన జగన్.. ఆ తర్వాత తన పిల్లలను కలిసేందుకు లండన్ వెళ్లిన విషయం తెలిసిందే.
లండన్ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న సీఎం జగన్#YSJagan #CMJagan #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/QRUmeZMfco
— oneindiatelugu (@oneindiatelugu) September 12, 2023
లండన్ పర్యటనను ముగించుకుని మంగళవారం ఉదయం 6 గంటలకు సీఎం జగన్ ప్రయాణించిన ప్రత్యేక విమానం గన్నవరం విమనాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. విదేశీ పర్యటనను ముగించుకుని రాష్ట్రానికి తిరిగివచ్చిన సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు మంత్రులు, అధికారులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు.

ఏపీ మంత్రులు జోగి రమేష్, విశ్వరూప్, ఎమ్మెల్యేలు వంశీ, విష్ణు, పార్థసారథి, కైలే అనిల్, వెల్లంపల్లి శ్రీనివాస్.. అలాగే మంత్రి నందిగామ సురేష్, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహార్ రెడ్డి తదితరులు సీఎం జగన్‌కు స్వాగతం పలికినవారిలో ఉన్నారు.
విజయవాడ చేరుకున్న సీఎం జగన్ గన్నవరం నుంచి రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. కాగా, విదేశీ పర్యటన ముగిసిన వెంటనే సీఎం వైయస్ జగన్ బుధవారం ఢిల్లీ పర్యటకు వెళ్లనున్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెడతారని ప్రచారం, చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో హై-టెన్షన్ నెలకొన్న సమయంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ఊహాగానాలు చెలరేగుతున్న వేళ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో రాజకీయంగా భిన్న వాతావరణం నెలకొంది. చంద్రబాబు అరెస్టులో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రం పాత్ర కూడా ఉందని ఏపీ వామపక్ష పార్టీల నేతల ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications