ఇంకోసారి యూటర్న్ తీసుకున్న చంద్రబాబు?
Vellampalli Srinivas: తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల పారితోషికాన్ని 10,000 రూపాయలకు పెంచుతామంటూ తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీపై మాజీమంత్రి, విజయవాడ సెంట్రల్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఇలాంటి హామీ ఇస్తోన్నాడని అన్నారు.
బుధవారం ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుతో మాట్లాడారు. వలంటీర్లు గోనె సంచులు మోస్తారని, ఇంట్లో మగవాళ్లు లేని సమయంలో వెళ్లి తలుపులు కొడతారంటూ కించపరిచిన చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకుని, వాళ్లకు జీతాలు పెంచుతానంటూ హామీ ఇస్తోన్నాడని విమర్శించారు.

చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వలంటీర్ వ్యవస్థ మీద ఎంత నీచంగా మాట్లాడారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో కలిసి వలంటీర్ల ద్వారా ఇంటింటికీ పెన్షన్లను అందజేయడాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. అవ్వా తాతల ఉసురు పోసుకున్నారని విమర్శించారు.
2014లో తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డాక చంద్రబాబు తన కొడుకు నారా లోకేష్‌కు మూడు శాఖల మంత్రిగా ఉద్యోగం ఇప్పించాడని, ఆయన హయాంలో ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా? అని ప్రశ్నించారు. మంగళగిరిలో నారా లోకేష్, పిఠాపురంలో పవన్ కల్యాణ్ మరోసారి ఓడిపోవడం ఖాయమని తేల్చి చెప్పారు.
కుప్పంలో చంద్రబాబు, రాజమండ్రి ఎంపీగా పురంధేశ్వరిని ప్రజలు ఓడించి తీరుతారని వెల్లంపల్లి చెప్పారు. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి దిగజారిపోయాడని చురకలు అంటించారు. ఎన్నికల తరువాత టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీలో విలీనమౌతాయని వెల్లపల్లి అన్నారు.
శవ రాజకీయాలు చేయడం చంద్రబాబుకు బాగా అలవాటయిన విద్య అంటూ వెల్లంపల్లి వ్యాఖ్యానించారు. నందమూరి హరికృష్ణ భౌతికకాయాన్ని పక్కనపెట్టుకుని కేసీఆర్‌తో చంద్రబాబు పొత్తు రాజకీయాలు మాట్లాడుకున్నాడని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని లాక్కోలేదా అని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications