గుడివాడలో గెలుపుపై కొడాలి నాని: ఎనీ డౌట్స్..!!
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నమ్మకం నువ్వే జగన్.. అనే ప్రచార కార్యక్రమానికి ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటినీ పలకరిస్తోంది. లబ్దిదారులను ముఖాముఖిగా కలుసుకుంటోంది. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు వారికి అందుతున్నాయా? లేదా? అనే విషయాన్ని ప్రత్యేకంగా ఆరా తీస్తోంది.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా స్థాయి పార్టీ అధ్యక్షులు.. ఇందులో విస్తృతంగా పాల్గొంటోన్నారు. మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్లను ప్రతి ఇంటికీ అతికిస్తోన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న వివిధ సంక్షేమ పథకాల కింద మంజూరయిన నిధుల వివరాలతో కూడిన బ్రోచర్లను లబ్దిదారులకు అందజేస్తోన్నారు. ప్రభుత్వంపై వారిలో నెలకొన్న అభిప్రాయాలను సేకరిస్తోన్నారు. ఈ కార్యక్రమం విజయవంతమైందని వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నారు.

కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలో జరిగిన మా నమ్మకం నువ్వే జగన్.. కార్యక్రమంలో మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీకి చెందిన స్థానిక శాసన సభ్యుడు కొడాలి నాని పాల్గొంటోన్నారు. నియోజకవర్గ ప్రజలను కలుసుకుంటోన్నారు. ఇంటింటికీ వెళ్లి లబ్దిదారులను కలుసుకుంటోన్నారు. వలంటీర్లు, అధికారుల పనితీరును అడిగి తెలుసుకుంటోన్నారు. స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలంటూ కొడాలి నాని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. వచ్చే సంవత్సరం జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి రావడ గ్యారంటీ అని, దీన్ని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. యువగళం పేరుతో నారా లోకేష్ కొనసాగిస్తోన్న పాదయాత్ర- తెలుగుదేశం పార్టీ విజయానికి పెద్దగా ఉపయోగపడదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ స్థానాలన్నింటినీ గెలవబోతోన్నామని పునరుద్ఘాటించారాయన.

గుడివాడలో తనను ఓడించడానికి చంద్రబాబు, నారా లోకేష్ చేస్తోన్న ప్రయత్నాలేవీ ఫలించబోవని కొడాలి నాని స్పష్టం చేశారు. 2019 కంటే 2024 ఎన్నికల్లో రెట్టింపు మెజారిటీతో విజయం సాధిస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు గుడివాడలో పర్యటనకు రానుండటంపైనా స్పందించారు. ఓటర్లను రెచ్చగొట్టి వెళ్లడమే తప్ప ఆయన పర్యటన వల్ల ఎలాంటి ఉపయోగం ఉండబోదని అన్నారు.
2004 నుంచి గుడివాడలో కొడాలి నాని జైత్రయాత్ర సాగుతోంది. వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు. టీడీపీ, వైసీపీ నుంచి రెండుసార్లు చొప్పున గెలిచారు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన దేవినేని అవినాష్‌పై 19,479 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ దఫా ఎన్నికల్లో దీనికి రెట్టింపు మెజారిటీతో విజయం సాధిస్తానని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications