ధ్వంసమైన కారులోనే సీఎం జగన్ దగ్గరకు వెళ్లేందుకు పట్టాభి యత్నం .. దాడిపై పట్టాభి భార్య ,తల్లి ఆవేదన
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై విజయవాడలో దాడి జరిగింది. ఇంటి నుంచి కార్యాలయానికి బయలుదేరుతుండగా పట్టాభి నివాసం వద్దనే దుండగులు దాడికి దిగటంతో పట్టాభికి గాయాలయ్యాయి . విజయవాడ లో ఇంటి ముందు దుండగుల దాడిలో గాయపడిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే తనపై దాడి జరిగిన నేపథ్యంలో తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వాలని పట్టాభి తో సహా తెలుగుదేశం పార్టీ నేతలు ప్రయత్నించారు.
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై దుండగుల దాడి .. వైసీపీ కుట్ర అంటూనే గాయాలతో ఆస్పత్రికి

దుండగుల దాడిలో ధ్వంసమైన కారులోనే తాడేపల్లి కి వెళ్లాలని ప్రయత్నించిన పట్టాభి
దుండగుల దాడిలో ధ్వంసమైన కారులోనే తాడేపల్లి కి వెళ్లాలని ప్రయత్నించిన పట్టాభి ని పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా వాహనంలో ఆసుపత్రికి తరలించారు. పట్టాభి తో పాటు ఉన్న మరి కొందరు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
ఒకవైపు తనపై దాడి జరిగే అవకాశం ఉందని పట్టాభి వారం రోజుల క్రితమే భార్యకు చెప్పారని తనతోపాటు బోడె ప్రసాద్ పై కూడా దాడి జరిగే ప్రమాదం ఉందని ఆయన చెప్పారని అందుకే ప్రతి రోజూ ఇద్దరు ముగ్గురిని వెంటబెట్టుకుని ఆయన బయటకు వెళుతున్నారని పట్టాభి భార్య తన భర్త పై జరిగిన దాడి పై ఆవేదన వ్యక్తం చేశారు.

ఏదైనా జరిగితే వైసిపి ప్రభుత్వానిదే బాధ్యతన్న పట్టాభి భార్య , కన్నీరుపెట్టుకున్న తల్లి
తన భర్తకు ఏదైనా జరిగితే వైసిపి ప్రభుత్వానిదే బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. పట్టాభి పై జరిగిన దాడిపై పట్టాభి తల్లి కన్నీరుమున్నీరయ్యారు. తన కుమారుడికి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు ఉదయం బయటకు వెళ్ళగానే తాను తలుపులు వేసుకున్నానని ఆ తర్వాత కాసేపటికే పెద్దగా కేకలు వినిపించాయి అని, రెండో డ్రైవర్ అరుస్తూ పరుగులు తీశాడని , తన కుమారుడు కారులో నుండి దిగి లేక పోయాడని, దుండగుల దాడిలో గాయాలపాలయ్యాడు అని పట్టాభి తల్లి కన్నీరుమున్నీరయ్యారు.

పట్టాభిపై దాడి వెనుక కొడాలి నానీ ?
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి పై జరిగిన దాడి పట్ల టిడిపి నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. టిడిపి నేతలపై దాడులకు పాల్పడుతూ, అరెస్టులు చేస్తూ భయ భ్రాంతులకు గురి చేస్తూ పంచాయతీ ఎన్నికలలో టిడిపి బలపరిచిన అభ్యర్థులను పోటీలో లేకుండా చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది వైసీపీ కుట్ర అని ఈ ఘటన వెనుక వైసీపీ నేతలు ఉన్నారని టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కొడాలి నానీ ఇదంతా చేయిస్తున్నాడని మండిపడుతున్నారు .