బెజవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్న సోనూ సూద్: అమరావతి రైతులకు మద్దతు
అమరావతి: విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు ప్రముఖ సినీనటుడు సోనూ సూద్. ఆయనను ఆలయ అర్చకులు సాదర స్వాగతం పలికారు. తీర్థ, ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు ఆయనకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదంను అందించారు.
కరోనా కష్టకాలం నుంచి ప్రజలంతా కోలుకుని తిరిగి సాధారణ జీవనం కొనసాగించేలా కనకదుర్గమ్మ తన చల్లని ఆశీస్సులు అందించాలని ప్రార్థించినట్లు సోనూ సూద్ తెలిపారు. దుర్మమ్మను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

అంతకు ముందు.. విజయవాడ నగరంలో అంకుర ఆస్పత్రిని సోనూ సూద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంకుర హాస్పిటల్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు. తాను రియల్ హీరో కాదు నిజ జీవితంలో సామాన్యులే రియల్ హీరోస్ అని అన్నారు. సోనూ సూద్ చారిటీ ఫౌండేషన్ ద్వారా పేదలకు సహాయం అందించాలి అనుకుంటే అందించవచ్చని తెలిపారు. అంకుర హాస్పిటల్ ద్వారా పేద ప్రజలకు సామాన్యులకు వైద్య సేవలు అందుతాయని బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నానని సోనూ సూద్ పేర్కొన్నారు.
కాగా, విజయవాడ పర్యటనకు వచ్చిన సోనూ సూద్‌ను గన్నవరం విమానాశ్రయంలో అమరావతి మహిళా రైతులు కలిశారు. తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరగా.. రైతుల వెంటే ఉంటానని ఆయన చెప్పారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ 632 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రాజధాని గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. తూళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం, పెదపరిమి దీక్షా శిబిరాల్లో నిరసన చేపడుతూ మద్దతుగా నినాదాలు చేశారు.

కరోనా కాలంలో సోనూ సూద్ అనేక మంది కార్మికులు, ప్రజలకు సాయమందించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులను తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు తన సొంత ఖర్చులతో బస్సులను ఏర్పాటు చేసి తరలించారు. రైలు, విమానాల ద్వారా కూడా ఆయన కొంత మంది ప్రజలను తమ స్వస్థలాలకు చేర్చారు. అంతేగాక, కష్టాల్లో ఉన్నామంటూ పలువురు విజ్ఞప్తి చేసిన వెంటనే.. వారికి అవసరమైన సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నారు.












Click it and Unblock the Notifications