TDP defeat in Vijayawada Corporation Elections: ఆసక్తికర చర్చ .. సొంత పార్టీ నేతలే కొంప ముంచారా !!
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో విజయం సాధిస్తామని టిడిపి జెండా ఎగరేస్తాం అని ధీమా వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ విజయవాడ కార్పొరేషన్ లో బోల్తా పడింది . విజయవాడ కార్పొరేషన్ లో ఘోర పరాభవాన్ని చవిచూసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం నిర్వహించినా లాభం లేకపోయింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పై వైసీపీ జెండా ఎగురవేసింది. విజయ దుందుభి మోగించింది.

విజయవాడలో 14 స్థానాలకు పరిమితమైన టీడీపీ
విజయవాడ కార్పొరేషన్ లో మొత్తం 64 డివిజన్ లు ఉండగా వైసిపి 49 స్థానాలలో విజయం సాధించింది. ఇక టిడిపి 14 స్థానాలకు పరిమితం కావలసి వచ్చింది .సీపీఎం నుంచి ఒక అభ్యర్థి విజయం సాధించారు. విజయవాడలో టిడిపి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు తాజా ఫలితాలను చూసి షాక్ తిన్నారు. అయితే స్వయంకృతాపరాధమే టిడిపి కొంప ముంచిందని స్థానికంగా చర్చ జరుగుతోంది.

టీడీపీ అంతర్గత పోరు రోడ్డుకెక్కటంతో ఊహించని దెబ్బ
తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు ఎన్నికల సమయంలో రోడ్డుకెక్కడం ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి మైనస్ అయింది. ఎంపీ కేశినేని నాని ఒంటెత్తు పోకడలకు పోతున్నారని బుద్దా వెంకన్న, బోండా ఉమా , నాగుల్ మీరా బాహాటంగా విమర్శలు గుప్పించి రచ్చ చేశారు. ఎన్నికలకు మరో నాలుగు రోజులు ఉందనగా తీవ్రరూపం దాల్చిన వీరి మధ్య విభేదాలు టీడీపీకి మైనస్ అయ్యాయి. విజయవాడ టిడిపి నేతలకు కేశినేని నాని మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం ఏ మాత్రం రుచించక పోవడంతో ప్రచారం కూడా పెద్దగా చేయలేదని తెలుస్తుంది.

టీడీపీ హామీలను ప్రజా క్షేత్రంలోకి తీసుకువెళ్లటంలో టీడీపీ నేతలు విఫలం .. పని చెయ్యని చంద్రబాబు చరిష్మా
టిడిపి హామీలను ప్రజాక్షేత్రంలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా తెలుగుదేశం పార్టీ నేతలు విఫలమైనట్లుగా సమాచారం. ఎన్నికల సమయంలో నేతలందరూ కలిసికట్టుగా ఉంటే మరో పది స్థానాలు సాధించేదన్న భావన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉంటే టిడిపి ఎన్నికల మేనిఫెస్టో కూడా ఓటర్లను ఏమాత్రం ఆకర్షించ లేకపోయింది. చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం చేసినా చంద్రబాబు చరిష్మా పని చేయలేదు. వైసిపి కోసం నేరుగా మంత్రులు రంగంలోకి దిగి ప్రచారం చేయడం, సంక్షేమ పథకాలను జనాల్లోకి బాగా తీసుకువెళ్లటం వైసీపీకి లాభించింది .

విజయవాడ పై బాగా ఫోకస్ చేసిన వైసీపీ .. కొంప ముంచిన టీడీపీ పంచాయితీ
మూడు రాజధానులకు ప్రజల మద్దతు ఉందని నిరూపించడం కోసం విజయవాడ, గుంటూరు, విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లను బాగా ఫోకస్ చేయడంతో వైసీపీ నేతల వ్యూహం ఫలించింది. సొంత పార్టీ నేతల్లో సమన్వయం లేకపోవడం, పెద్ద ఎత్తున ప్రచారం సాగించకపోవడం, టిడిపి మేనిఫెస్టో పై ప్రజల్లో విశ్వాసం లేకపోవడం, వైసీపీ నేతలు, మంత్రులు ప్రధానంగా విజయం సాధించాలన్న లక్ష్యంతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం తెలుగుదేశం పార్టీని విజయవాడ కార్పొరేషన్ లో ఓటమి పాలు చేసింది. అన్నిటికంటే తెలుగుదేశం పార్టీ నేతల పంచాయితీనే విజయవాడలో టీడీపీ కొంపముంచింది.