పవన్ తో మరోమారు భేటీ అయిన వంగవీటి .. జనసేనలో చేరిక ముహూర్తం ఫిక్స్
Recommended Video
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో టీడీపీ నేత వంగవీటి రాధా మరోసారి భేటీ అయ్యారు. ఎన్నికల ముందు వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఆయన తాజా పరిణామాల నేపధ్యంలో టీడీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నాడు పవన్ , వంగవీటి రాధాకృష్ణ సమావేశమై సుమారు గంటపాటు సుదీర్ఘంగా చర్చించుకున్న సంగతి తెలిసిందే. కాగా ఇవాళ విజయవాడ పటమటలోని పవన్ నివాసంలో మరోసారి భేటీ అయ్యి పార్టీలో చేరిక తేదీపై చర్చించినట్లు తెలుస్తుంది. దీంతో వంగవీటి జనసేనలో చేరిక పక్కానే అని అర్ధం అవుతుంది .

వంగవీటి రంగా జయంతి నాడు పార్టీ లో చేరే ముహూర్తం ఫిక్స్ చేసిన వంగవీటి రాధా
వంగవీటి రాధా తండ్రి, దివంగత నేత వంగవీటి మోహన రంగా జయంతి సందర్భంగా జులై 4 లేదా 5 న జనసేన కండువా కప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక నేడు పవన్ కళ్యాణ్ తో జరిగిన వంగవీటి భేటీలో పవన్ , రాధాతో పాటు పి.రామ్మోహన్, రియాజ్, హరిప్రసాద్ లు పాల్గొన్నారు. అయితే ఇప్పటి వరకూ ఈ భేటీపై అటు జనసేన నుంచి గానీ , ఇటు వంగవీటి కుటుంబ సభ్యుల నుంచి గానీ ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే రాధా జనసేనలో చేరడం మాత్రం ఖాయమని తాజా పరిణామాల నేపధ్యంలో తెలుస్తోంది.

టీడీపీలో ఉంటే ఇబ్బందులు అని భావించే జనసేనకు జంప్ అవుతున్న వంగవీటి
గతంలో వైసీపీ నేతగా ఉన్న రాధా మొన్నటి ఎన్నికల సమయంలో టీడీపీలో చేరి జగన్ కు వ్యతిరేకంగా ఎన్నికల సమయంలో ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంటో టీడీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. టీడీపీని ఏపీలో సమూలంగా లేకుండా చెయ్యాలని అటు వైసీపీ , ఇటు బీజేపీ కంకణం కట్టుకుని పని చేస్తున్న క్రమంలో టీడీపీలో ఉంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ఆయన జనసేనలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే దీనిపై ప్రకటన చేస్తారని తెలుస్తుంది.

జనసేనలోకి రాధా వస్తే జిల్లాకు సారధ్యం వహించే అవకాశం ఇవ్వనున్న పవన్
మరోవైపు జనసేనలోకి వెళితే బాగుంటుందని అనుచరుల నుంచి వంగవీటి రాధాపై ఒత్తిడి కారణంగానే ఆయన జనసేన వైపు చూస్తున్నారని జిల్లా రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వంగవీటి రాధా పార్టీలోకి వస్తే ఆయనకు పార్టీకి సంబంధించి జిల్లా సారథ్యం అందించేందుకు కూడా జనసేన సుముఖంగా ఉందనే భావన వ్యక్తం అవుతుంది . అయితే ఏపీలో బలపడేందుకు బీజేపీ వ్యూహారచన చేస్తున్న నేపథ్యంలో వంగవీటి రాధా జనసేనవైపు ఎందుకు చూస్తున్నారు అన్న అనుమానాలు కూడా లేకపోలేదు . ఏపీలో ఇకపై తాను కూడా రాజకీయాలు చేస్తానని వ్యాఖ్యానించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో పార్టీని బలోపేతం చెయ్యటానికి పార్టీలోకి వచ్చే వారికీ స్వాగతం పలికే ఆలోచనలో ఉన్నారు.












Click it and Unblock the Notifications