బినామీల పరం చేయాలన్నది జగన్నాటకం.. స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకం ప్రతిపాదనపై విమర్శల వెల్లువ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఐక్యకార్యాచరణ సమితి ఉద్యమ బాట పట్టింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒప్పుకోబోమని తేల్చి చెబుతోంది. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ప్రభుత్వం సైతం వ్యతిరేకిస్తుందని పేర్కొన్న జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ భూములలో నిరుపయోగంగా ఉన్న 7 వేల ఎకరాల భూములను ప్లాట్లుగా చేసి విక్రయించి, విశాఖ స్టీల్ ప్లాంట్ నగదు రిజర్వ్ పెంచి, స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవచ్చని కేంద్రానికి ఒక ప్రతిపాదన పెట్టారు. ఈ ప్రతిపాదన ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణమవుతోంది.
ఆ 7వేల ఎకరాలతో స్టీల్ ప్లాంట్ ప్రాబ్లమ్స్ కు చెక్: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపటానికి సీఎం జగన్ స్కెచ్

జగన్ కు ఇంగిత జ్ఞానం ఉందా : చంద్రబాబు ప్రశ్న
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ భూములను అమ్మాలని ప్రతిపాదన పెట్టిన ఏపీ సీఎం వైయస్ జగన్ పై మండి పడుతున్నారు.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏడు వేల ఎకరాలు అమ్మేస్తే విశాఖ ఉక్కు సమస్య పరిష్కారం అవుతుందని ముఖ్యమంత్రి అనడం ఎంత ఫార్సు.. ఆయనకు ఇంగిత జ్ఞానం, ప్రజల భావోద్వేగాలను గౌరవించే ఆలోచన లేదా అంటూ మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా ప్రవర్తించడం అంటే ఇదే అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

విశాఖ ఉక్కు కోసం పోరాడుతున్న వారిని పరామర్శించారా..
విశాఖ ఉక్కు కోసం 16 వేల మంది రైతులు 26 వేల ఎకరాల భూములు ఇస్తే వాటిని అమ్మేస్తే డబ్బులు వస్తాయని కేంద్రానికి రాసిన లేఖలో తాను అదే విషయం చెప్పాను అని అంటున్నారని పేర్కొన్న చంద్రబాబు, విశాఖ ఉక్కు కోసం ఉద్యమిస్తున్నవారిని వెళ్లి పరామర్శించడానికి కూడా సీఎం జగన్ కు తీరిక లేదని అసహనం వ్యక్తం చేశారు.
ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకం కుట్ర ఏ1, ఏ2 లదేనని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపణలు గుప్పించారు.

జగన్ బినామీల కోసమే భూముల అమ్మకం ప్రతిపాదన
సీఎం జగన్ మోహన్ రెడ్డి తన బినామీలకు మేలు చేయడం కోసమే భూముల అమ్మడానికి ప్రతిపాదన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మొదట విశాఖ ప్రభుత్వ భూములు, ఆశ్రమ భూములపై జగన్ కన్ను పడిందని, ఇప్పుడు ఏకంగా స్టీల్ ప్లాంట్ భూములపై జగన్ కన్ను పడిందని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను బినామీలకు కట్టబెట్టి , ప్రైవేటు పరం చేయడం కోసమే ప్రధానికి జగన్ లేఖ రాశారని వ్యాఖ్యానించారు.

తన చేతికి మట్టి అంటకుండా కేంద్రం ద్వారా అమ్మించే ప్లాన్ చేసిన ఏ1 , ఏ2
విశాఖలో జే గ్యాంగ్ బెదిరింపులు, భూ కబ్జాలకు అంతే లేకుండా పోయిందని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల అమ్మకం ప్రణాళిక వెనుక జగన్ రాసిన లేఖలో రహస్య ఎజెండా ఉందని ఆయన ఆరోపించారు.
తన చేతికి మట్టి అంటకుండా కేంద్రం ద్వారా అమ్మించి తన బినామీల పరం చేయాలన్నది జగన్నాటకం అని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్మికులు చేస్తున్న ఉద్యమంలో భాగస్వామ్యం తీసుకోవాలని కార్మిక సంఘాల నాయకులు కోరినప్పటికీ వారిని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి విశాఖ శారదా పీఠంలో యాగానికి వెళ్లడం ఎంతవరకు సమంజసమని యనమల రామకృష్ణుడు సీఎం జగన్ మోహన్ రెడ్డిని నిలదీశారు.