సెల్ ఫోన్లు ఎవరి వల్ల వచ్చాయి..చెప్పండి తమ్ముళ్లు
విజయనగరం: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇవ్వాళ విజయనగరం జిల్లాలో పర్యటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఇదేం ఖర్మ రాష్ట్రానికి ఆందోళనలో భాగంగా ఆయన విజయనగరంలో పర్యటించారు. రోడ్ షోలను నిర్వహించారు. విజయనగరం కోట కూడలిలో రాత్రి నిర్వహించిన రోడ్ షో కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుతో కలిసి పాల్గొన్నారు.

జగన్ ప్రభుత్వంపైనే..
వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు ఘాటు విమర్శలను సంధించారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం రోజురోజుకూ పెల్లుబుకుతోందని, ఇక ఎంతోకాలం వైసీపీ పాలన ఉండబోదని అన్నారు. తగిన సమయం కోసం ప్రజలు ఎదురు చూస్తోన్నారని చెప్పారు. రాష్ట్రంలో సైకో వైఎస్ జగన్ పాలన పోయి.. తెలుగుదేశం పార్టీ సారథ్యంలో సైకిల్ పాలన రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని, పూజలు చేస్తోన్నారని పేర్కొన్నారు.

జగన్‌కు తెలిసింది అదే..
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రాభివృద్ధి ఏ మాత్రం పట్టదని చంద్రబాబు విమర్శించారు. ఆయనకు తెలిసిందల్లా రివర్స్ పరిపాలన సాగించడమేనని ధ్వజమెత్తారు. విధ్వంసం చేయడం సులువేనని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేయడం చాలా కష్టమని చంద్రబాబు హితబోధ చేశారు. తాను 14 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించానని, ఎలా అభివృద్ధి పరచాలో తనకు బాగా తెలుసునని అన్నారు.

జగన్ ద్రోహం..
ఏ ముఖ్యమంత్రి కూడా చేయని ద్రోహం వైఎస్ జగన్ ఈ రాష్ట్రానికి చేశాడని చంద్రబాబు ఆరోపించారు. 2024 నాటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించడం ద్వారా ప్రజలు తమ ప్రతీకారాన్ని తీర్చుకోవాలని ఆయన అన్నారు.
జగన్ ప్రభుత్వంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయని మండిపడ్డారు. మున్సిపాలిటీ చెత్త పైనా కూడా జగన్ ప్రభుత్వం పన్ను వేస్తోందని విమర్శించారు. వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా ఇసుకను దోపిడీ చేస్తోన్నారని ధ్వజమెత్తారాయన.

సెల్ ఫోన్లు ఎవరి వల్ల వచ్చాయి..
తన ప్రసంగంలో సెల్ ఫోన్ల గురించి ప్రస్తావించారు చంద్రబాబు. సెల్ ఫోన్లు ఎవరి వల్ల వచ్చాయంటూ ప్రశ్నించారు. సెల్ ఫోన్లు రావడానికి తానే కారణమని స్పష్టం చేశారు. సెల్ ఫోన్లు ఉండటం వల్ల ఏ పని అయినా ఇట్టే చిటికెలో పూర్తవుతోందని గుర్తు చేశారు. దేశంలో సెల్ ఫోన్ల విప్లవం తన వల్లే వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. రోడ్ షోకు వచ్చిన ప్రతి ఒక్కరితోనూ, వారి వినియోగించే సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్లను వెలిగింపజేశారు.

నేనే దోహదం చేశా..
సెల్ ఫోన్లు రావడానికి తాను దోహదం చేశానని తేల్చి చెప్పారు చంద్రబాబు. 20 సంవత్సరాల కిందటే తాను సెల్ ఫోన్లను దేశానికి రప్పించానని అన్నారు. అప్పట్లో తనను అందరూ ఎగతాళి చేశారంటూ చంద్రబాబు గతాన్ని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు తెప్పించిన సెల్ ఫోన్లు తిండి పెడతాయా? అంటూ తనను అందరూ ఎద్దేవా చేశారని అన్నారు. భర్త లేకపోతే భార్య, భార్య లేకపోతే భర్త ఉండగలుగుతున్నారని, సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరూ ఉండలేరని, టెక్నాలజీ శక్తి అదేనని వివరించారు.












Click it and Unblock the Notifications