హరహర మహా దేవ ... శివరాత్రికి ముస్తాబవుతున్న శైవ క్షేత్రాల ఖిల్లా .. ఓరుగల్లు జిల్లా
మహాశివరాత్రి సందర్భంగా చారిత్రక శివాలయాలు శివనామస్మరణతో మారుమోగనున్నాయి. కాకతీయులు పాలించిన ఓరుగల్లు ఖిల్లాలో శివరాత్రి సందర్భంగా ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. హన్మకొండలోని రుద్రేశ్వరస్వామివారి వేయిస్తంభాలగుడి, రామప్ప , కటాక్షపురంలో శివకేశవాలయాలు,కాశిబుగ్గలోని కాశీవిశ్వేశ్వరాలయం, మెట్టు గుట్ట రామ లింగేశ్వర ఆలయం , పద్మాక్షి వద్ద ఉన్న సిద్దేశ్వరాలయం అన్నీ శివరాత్రి సందర్భంగా శోభాయమానంగా ఉన్నాయి.

కాకతీయుల ఖిల్లాలో శివరాత్రి వేడుకలు
కాకతీయులు పాలించిన ఓరుగల్లులో శైవం పరిఢవిల్లింది. కాకతీయ రాజులు ముఖ్యంగా శివారాధకులు కావటంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాకతీయుల కాలంలోనే ప్రసిద్ధ శైవ క్షేత్రాల నిర్మాణం జరిగింది. కాకతీయ రాజులు ఏక, ద్వి, త్రికూట మరియు పంచకూట ఆలయాలను నిర్మించారు. హర హర మహాదేవ శంభో అంటూ భక్తజనం ఆ పరమశివుని కరుణాకటాక్ష వీక్షణాల కోసం శైవ క్షేత్రాల్లో బారులు తీరే శుభ సమయం ఆసన్నమైంది .

ముస్తాబైన ఓరుగల్లులోని శైవ క్షేత్రాలు
మహాశివరాత్రి సందర్భంగా చారిత్రక వేయి స్తంభాల దేవాలయం, రామప్ప దేవాలయం, కటాక్షాపూర్ లోని శివాలయం, ఓరుగల్లు కోటలోని కాశీ విశ్వేశ్వరాలయం తో పాటుగా, అయినవోలు, కురవి వంటి శైవక్షేత్రాలలోనూ ఓంకార నాదం ప్రతిధ్వనిస్తోంది. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన అభిషేకాలను చేస్తూ భక్తజనం మహాశివరాత్రి వేడుకలు జరుపుకునేందుకు సిద్ధం అవుతున్నారు

రుద్రేశ్వర స్వామి కి తెల్లవారుజాము నుండే మహన్యాస పూర్వక రుద్రాభిషేకం
చారిత్రక వేయిస్తంభాల దేవాలయం లో రుద్రేశ్వర స్వామి కి తెల్లవారుజాము నుండే మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తారు . భక్తజనంతో వేయిస్తంభాల దేవాలయం మహా శివరాత్రి సందర్భంగా పోటెత్తుతుంది. కాకతీయ మహారాజు రుద్రదేవమహారాజు క్రీ.శ 1084లో దీనిని నిర్మించాడు. ఇది నిజానికి త్రికూటలాయం. ఒకే వేదిక మీద మూడు దిక్కుల మూడు ఆలయాలను నిర్మించారు. అవి శ్రీ రుద్రేశ్వర, వాసుదేవ, సూర్యదేవాలయాలు. ప్రస్తుతం రుద్రేశ్వరస్వామి గా పూజలందుకుంటున్న ఆ పరమ శివుని దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. రాత్రి జాగరణ్ ఉండే భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు .భక్తుల శివరాత్రి జాగారాలతో దేవాలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది .

రామప్ప దేవాలయంలో ఘనంగా శివరాత్రి
ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప దేవాలయంలో సైతం మహాశివరాత్రి పర్వదినాన వేడుకలు ఘనంగా జరుగుతాయి . రామలింగేశ్వరస్వామి కి తెల్లవారుజాము నుండే పూజాదికాలు నిర్వహిస్తారు. కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఈ దేవాలయం రామప్ప అనే శిల్పి నిర్మాణం చేయడం వల్ల రామప్ప దేవాలయం గా ప్రసిద్ధి గాంచింది. మహా శివరాత్రి వేడుకల తో పాటు జాగరణ చేసే భక్తుల కోసం పలు సాంస్కృతిక కార్యక్రమాలను సైతం నిర్వహిస్తూ మహాశివరాత్రి మహోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేశారు అధికారులు.

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శివరాత్రి
వరంగల్ కాశిబుగ్గలోని కాశీవిశ్వేశ్వరాలయంలోనూ శివరాత్రి వేడుకలు ఘనంగా జర్గుతాయి. ఇక పద్మాక్షి గుట్ట వద్ద ఉన్న సిద్దేశ్వర స్వామీ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. హన్మకొండకు 27కిలోమీటర్ల దూరంలోని కటాక్షపురంలో శివకేశవాలయాలలో సైతం వేడుకలు నిర్వహించటానికి ఏర్పాటు చేశారు. ఇక కురవి మండల కేంద్రంలోని వీరభద్రస్వామి ఆలయం,బచ్చన్నపేట మండలం కొడవటూరులోని సిద్ధేశ్వరాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి.

ఓరుగల్లు ఖిల్లా శైవ క్షేత్రాల జిల్లా
చేర్యాల మండలంలోని కొమురవెల్ళి మల్లికార్జున స్వామి ఆలయం, ఐనవోలు మల్లికార్జున స్వామీ దేవాలయం ,పాలకుర్తిలోని సోమేశ్వరాలయం, మెట్టుగుట్టపై ఉన్న రామలింగేశ్వరాలయాలే కాదు ఇలా ఒకటి కాదు రెండు కాదు లెక్కకు మిక్కిలి శైవ క్షేత్రాలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఈ శైవ క్షేత్రాలలో ను శివరాత్రి పర్వదిన వేడుకలు చాలా ఘనంగా , అంగ రంగ వైభవంగా ఆధ్యాత్మికత ఉట్టి పడేలా సాగుతాయి. ఓరుగల్లు ఖిల్లా శైవ క్షేత్రాల జిల్లాగా ప్రసిద్ధి పొందిన నేపధ్యంలో ఓరుగల్లులో మహాశివరాతి వేడుకలు ఎప్పుడూ ప్రత్యేకమే .












Click it and Unblock the Notifications