కేసీఆర్ జీ కళ్లుంటే చూడండి..కాళ్లుంటే తిరగండి.. అభివృద్ధి కనపడుతుంది: కిషన్ రెడ్డి
సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైరయ్యారు. హన్మకొండ బహిరంగ సభ వేదికపై ఆయన మాట్లాడారు. సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణ బీజేపీ ఇంఛార్జీ సునీల్ బన్సల్ తదితరులు హాజరయ్యారు. ఉద్యమాల పురిటిగడ్డ ఓరుగల్లు అని కిషన్ రెడ్డి అన్నారు. కాకతీయుల శౌర్యానికి, రాణి రుద్రమ పరిపాలనకు కేంద్రం ఓరుగల్లు అని వివరించారు.
కేసీఆర్ అంటూ తన ప్రసంగాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు. మోడీ వచ్చాక ఎంత అభివృద్ధి జరిగిందో చెబుతా అని పేర్కొన్నారు. వరంగల్‌లో స్మార్ట్ సిటీ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.196 కోట్లు ఖర్చు చేసిందన్నారు. వరంగల్ జిల్లాలో సైనిక స్కూల్ రాబోతోందని వివరించారు. వరంగల్‌లో రూ.500 కోట్లతో బైపాస్ రోడ్డు వేశాం అని... రాష్ట్రంలో రోడ్ల కోసం కేంద్రం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు.

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు తెచ్చామని వివరంచారు. రామప్ప ఆలయ అభివృద్ధి కోసం రూ.60 కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం కేంద్రం వేల కోట్లు ఇచ్చిందని.. ఇవన్నీ కేంద్రం ఇవ్వలేదని టీఆర్ఎస్ సర్కారు చెప్పగలదా? అని అడిగారు. రూ.8,200 కోట్లతో పత్తి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.. జగిత్యాల-వరంగల్ రోడ్డు కోసం కేంద్రం రూ.4,321 కోట్లు ఖర్చు చేస్తోందని.. వరంగల్-ఖమ్మం రోడ్డు కోసం కేంద్రం రూ.3,364 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు.
కేసీఆర్ జీ... కళ్లుంటే చూడండి, కాళ్లుంటే తెలంగాణలో తిరగండి... అభివృద్ధి అర్థం అవుతుంది అని ప్రసంగించారు. 1300 కిమీ రైల్వేలైను రాష్ట్ర సర్కారు భూమి కేటాయించలేదని ఆరోపించారు. తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చిన మొదటిరోజే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. కుటుంబ పాలన నుంచి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కల్పిస్తామని వివరించారు.