వరంగల్‌లో భారీ అగ్నిప్రమాదం.. రెస్టారెంట్ పూర్తిగా దగ్ధం; ఆస్తి నష్టం
వరంగల్ జిల్లా కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది . వరంగల్ చౌరస్తాలోని మను ఫ్యామిలీ రెస్టారెంట్ లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో రెస్టారెంట్లో మంటలు చెలరేగాయని తెలుస్తుంది. మంటల్లో రెస్టారెంట్ పూర్తిస్థాయిలో కాలిపోయినట్లుగా సమాచారం.
వరంగల్ చౌరస్తాలో శుక్రవారం తెల్లవారుజామున మను ఫ్యామిలీ రెస్టారెంట్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. రెస్టారెంట్ కి ముందు క్లాత్ తో చేసిన డెకరేషన్ కు మొదట మంటలు అంటుకోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన రెస్టారెంట్ సిబ్బంది అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో, రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈలోపే రెస్టారెంట్ లోని ఫర్నిచర్ మొత్తం దగ్ధమైంది.

ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఇక మను రెస్టారెంట్ కింద ఫ్లోర్ లో మరో రెండు షాపులు ఉండటంతో వాటికి కూడా మంటలు అంటుకుంటాయి అని సదరు షాప్ యజమానులు ఆందోళన చెందారు. అయితే రెస్టారెంట్ కింద ఉన్న బిగ్ సి మొబైల్ షాప్ లోకి మంటలు విస్తరించకుండా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చెయ్యగలిగారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే గురువారం నాడు హైదరాబాద్లోని చార్మినార్ ప్రాంతంలో కూడా ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి పాతబస్తీ చార్మినార్ సమీపంలో లాడ్ బజార్ లోని రెండు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగి ఒక బట్టల దుకాణం పూర్తిగా దగ్ధమైంది. ఈ అగ్ని ప్రమాదంలో కూడా భారీగానే ఆస్తినష్టం జరిగింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.