దళితులపై కపట ప్రేమ, కేసీఆర్‌పై సీతక్క నిప్పులు
దళితులపై సీఎం కేసీఆర్ కపట ప్రేమ ఒలకబోస్తున్నారని ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ధనసరి సీతక్క విమర్శించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి కూచన రవళిరెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో గల నారాయణగిరిపల్లి, వెల్తుర్లపల్లి గ్రామాల్లో దళిత, గిరిజన దండోరా కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడారు. మోసపూరిత వాగ్దానాలు చేస్తూ హుజూరాబాద్ నియోజకవర్గ దళితులపై వరాలజల్లు కురిపిస్తూ.. సీఎం కేసీఆర్ కపట ప్రేమ ఒలకబోస్తున్నారని దుయ్యబట్టారు.
దళితులపై ప్రేమానురాగాలు ఉంటే తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఆ సామాజిక వర్గం నుంచి ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించారు. ఇచ్చిన హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. పైగా ప్రతిపక్షాలపైనే ఆరోపణలు చేస్తారని ఫైరయ్యారు. బై పోల్ కోసమే దళిత బంధు కార్యక్రమం అని చెప్పారు. అంతే తప్ప దళిత సామాజిక వర్గం మీద ప్రేమ లేదని చెప్పారు. ఈ విషయాన్ని విజ్ఞులైన దళితులు గ్రహించారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మల్లాడి రామిరెడ్డి, మండల అధ్యక్షుడు చెన్నోజు సూర్యనారాయణ, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బండి శ్రీనివాస్, నాయకులు తుమ్మేటి రాజిరెడ్డి, మాడ ప్రకాశ్, కోరె బిక్షపతి, యాట నర్సయ్య, ఆవుల జయంత్, బుడిగొండ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
హుజురాబాద్ బై పోల్ వేళ అధికార పార్టీ హామీలను ఇస్తోంది. బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. నామినేటెడ్ పోస్టులను ఎంపిక చేస్తోంది. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవీ కూడా ఇచ్చింది. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బరిలోకి దింపి.. బీసీ సామాజిక వర్గం నుంచి ఓట్లు రాబట్టుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆరోపణలు చేశారు.