డబ్బులిచ్చి సెక్స్‌కుయత్నం: రైళ్లోనుండి పడిన యువతి

ఈ ఘటనను తాను మరిచి పోలేకపోతున్నానని ఆమె కన్నీటి పర్యంతంతో చెప్పింది. తాను కెంగేరి నుండి రామనగర్ వెళుతుండగా ఆ యువకులు తనను పలకరించారని, ఆ తర్వాత తనను టీజ్ చేయడం ప్రారంభించారని, తనతో అసభ్యంగా ప్రవర్తించారని తెలిపింది. తాను స్నాక్స్ తీసుకోవడానికి వెళ్లినప్పుడు డబ్బులు వారు చెల్లించేందుకు ప్రయత్నించారని, దానిని తాను తిరస్కరించానని చెప్పింది.
ఆ తర్వాత వారు తనతో అసభ్యంగా ప్రవర్తించారని, మిగిలిన ప్రయాణీకుల ముందే వారు తనకు రూ.300 ఇచ్చి వారితో రావాల్సిందిగా చెప్పారని, ఈ దుర్మార్గాన్ని తోటి ప్రయాణీకులు అడ్డుకుంటారని తాను భావించానని, దురదృష్టవశాత్తూ ఎవరూ స్పందించలేదని తెలిపింది. దీంతో చేసేది లేక వారి నుండి తప్పించుకునేందుకు తాను ఆ కంపార్టుమెంటులోని మరోవైపుకు వెళ్లానని, వారు కూడా తనను అనుకరించారని, దీంతో కోపం వచ్చిన తాను వారికి చివాట్లు పెట్టానని చెప్పింది. దాంతో అందులో ఒకరు తన చెంపపై కొట్టి ఆ తర్వాత రైలులో నుండి బయటకు తోసేశారని తెలిపింది.
ఈ యువతికి క్లోజ్ రిలేటివ్స్ ఎవరూ లేరని తెలుస్తోంది. ఆమె మరో యువతితో కలిసి మైసూరులోని విద్యారణ్యపురంలో ఉంటోంది. హోసూరా రోడ్డులోని ఇందూరా గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పని చేస్తోంది. ఆమె గత ఆరేళ్లుగా మైసూర్ నుండి బెంగళూరుకు ప్రయాణం చేస్తోంది.
ఆ యువకులు తన పట్ల ఇలా ప్రవర్తించడం జీర్ణించుకోలేక పోతున్నానని, తోటి ప్రయాణీకులు కూడా దీనిని అడ్డుకోక పోవడం చూస్తుంటే చాలా బాధేస్తుందని, తనతో వారు అసభ్యంగా ప్రవర్తిస్తుంటే ఒక్కరు కూడా ఆపే ప్రయత్నాలు చేయలేదని, ఇలాంటి సంఘటనలు జరుగుతోంటే ఒకమ్మాయి నిర్భయంగా ఎలా ఉద్యోగానికి వెళ్లగలదని ఆమె ప్రశ్నిస్తోంది.
కాగా సదరు యువతిపై కొంత మంది యువకులు అసభ్యంగా ప్రవర్తించి, ఆ తర్వాత కదులుతున్న రైలు నుంచి కిందికి తోసేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం కర్ణాటకలోని మద్దూరు వద్ద జరిగింది. విచిత్రంగా ఆమె ప్రాణాలతో బయటపడింది. అయితే, తీవ్రమైన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. శింషా నదిపై గల కొల్లి వంతెనపై పరుగులు తీస్తున్న యశ్వంత్‌పూర్ - మైసూర్ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి యువతిని కిందికి తోసేశారు. ఆమె 25 అడుగుల లోతు ఉన్న నది జలరహిత భూభాగంపై పడింది.
ఆమెను కిందికి తోసిసేన సంఘటనను చూసిన ఓ ప్రయాణికుడు విషయాన్ని మద్దూరు పోలీసులకు తెలియజేశాడు. గాయపడిన యువతిని మాండ్యా వైద్య విజ్ఝాన సంస్థకు తరలించి చికిత్స చేస్తున్నారు. యువతి తలపై, వెన్నెముకకు, కాళ్లకు దెబ్బ తగిలాయి. ఇద్దరు యువకులను మాండ్యా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మరో ఇద్దరిని పాండవపుర వద్ద అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications