• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పార్ట్-10

By Staff
|

యూనివర్శిటీలో ఎర్ర జెండా ఆనవాళ్లంటూ లేకుండా పోయాయి. మిగతా విద్యార్థి సంఘాల ప్రధాన నాయకులందరికీ యూనివర్శిటీలో ఉద్యోగాలిచ్చారు. వారి వెనుక నడిచిన విద్యార్థులనే మెట్లుగా ఉపయోగించుకుని వారు ఉద్యోగాల్లో దర్జాగా బైఠాయించారు.

ఇప్పుడు యూనివర్శిటీలో ఏం జరిగినా చీమ చిటుక్కుమనదు. యూనివర్శిటీ మునుపటిలా లేదు. అడుగు తీసి అడుగు వేస్తుంటే ఈ విశ్వాన్ని జయించామనే ధీమా కాస్తా విద్యార్థుల్లో నీరు గారిపోయింది. విప్లవ విద్యార్థి సంఘం చర్య ఇందుకు కారణం ఏ మాత్రం కాదా అనేది రాంరెడ్డి ప్రశ్న. ఈ ప్రశ్న వేస్తే వందల గొంతులు అతనిపైకి గుర్రుగా చూస్తాయి. అతన్ని వెలి వేస్తాయి. నలుగురు విప్లవోద్యమం నాయకుల ఎన్‌కౌంటర్‌పై వార్తా కథనంతో ఆ పని పూర్తిగా జరిగిపోయింది.

రాంరెడ్డి రెంటికి చెడ్డ రేవడి అయ్యాడు. విప్లవ సానుభూతిపరులు వ్యతిరేక వర్గంలో చేర్చేశారు రాంరెడ్డిని. మిగతావాళ్లు అక్కడి వాడే వీడు అన్నట్లు చూడడం మొదలుపెట్టారు. ఒక విమర్శ, ఒక ఆత్మావలోకన ఎంత పని చేస్తుంది?! ఇక్కడ మనిషికి స్వతంత్ర ఆలోచన ఉండకూడదు. వేయి పూలు వికసించకూడదు. మాటలు వేరు, చేతలు వేరు. మిగతా విప్లవ సానుభూతిపరులు రాంరెడ్డి కన్నా గొప్పగా వున్నారా? అదేం లేదు. వారి జీవితాలు దర్జాగా వెళ్లిపోతుంటాయి. వేలకు వేలు జీతాలు, హైదరాబాద్‌లో గిర్రున తిరగడానికి బైక్స్‌. ఇవన్నీ అడగకూడదు. అడిగినవాడు శత్రువు. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే తత్వంగా సాహిత్య, సాంస్కృతిక ఉద్యమ కారులు తయారయ్యారనేది రాంరెడ్డి అభియోగం. ఈ అభియోగం మోపడానికి రాంరెడ్డి ఎవడు? వాడేమైనా త్యాగాలు చేశాడా? మధ్యతరగతి జీవితం వాడిది. జీతం చేసుకుంటూ కుటుంబాన్ని ఈడిస్తూ ఇవన్నీ ప్రశ్నలు, సందేహాలు వీడికెందుకనేది వారి మంట. నిజమే, తనకెందుకు ఇవన్నీ అని చాలా సార్లు అనుకున్నాడు రాంరెడ్డి. రక్తంలో ఇమిడిపోయిన తత్వం ఊరికే పోతుందా? పోవడం లేదు. ప్రమాదాలను కావాలని కొని తెచ్చుకుంటున్నట్లుగా ఉంది అతని పరిస్థితి.

ఈ స్థితి నుంచి బయటపడడానికి ఊరికెళ్లాడు రాంరెడ్డి. ఊరెందుకో మునుపటిలా అనిపించలేదు. వీధులన్నీ ఇరుకిరుగ్గా అనిపించాయి. ఈ వీధులు ఎంత విశాలంగా అనిపించేవని చిన్నప్పుడు. విడిచిపెట్టిన ఇల్లులా ఉంది ఊరు. మనుషుల్లో అప్పటి జీవం కనిపించలేదు. మోడులువారినా చెట్లలా అనిపించారు. తాను మారిపోయాడా, ఊరు మారిపోయిందా అనే విచిక్సతలో పడ్డాడు రాంరెడ్డి. ఇంతకు ముందు ఊరుకొస్తే తీరిక ఉండేది కాదు. ఇప్పుడు పొద్దు పోవడం లేదు. ఎవరూ సరిగా పలకరించడం లేదు. మునుపటిలా వరసలు పెట్టి పిలవడం లేదు. విచిత్రంగా, కొత్త మనిషిని చూస్తున్నట్లు చూస్తున్నారు. హైదరాబాద్‌లో తాను అనుభవిస్తున్నదంతా ఇక్కడ రిఫ్లెక్ట్‌ అవుతోందేమోనని అనుకున్నాడు.

చూద్దామని ఓ రోజు అమ్మతో బాయికాడికి వెళ్లాడు. బాయి గడ్డ మీద అవే పెద్ద రెండు చింత చెట్లు. ఆ చింత చెట్ల కింద దొడ్డి. బాయి గడ్డ మీద నిలబడ్డాడు రాంరెడ్డి. ఎక్కడి నుంచి వచ్చాడో మల్‌రెడ్డి వచ్చి పక్కన నిలబడి ''ఏమల్లుడూ! ఎట్లున్నవు?'' అని అడిగాడు. అమ్మ పొలం వొరం మీద గడ్డి కోస్తోంది. వరుసకు మామే అవుతాడు గానీ మల్‌రెడ్డి రాంరెడ్డి కన్నా రెండేళ్లు చిన్నవాడు.

''ఏదో నడుస్తున్నది'' అన్నాడు రాంరెడ్డి.

మల్‌రెడ్డి వాళ్లది పెద్ద కుటుంబం. వాళ్ల అమ్మానాయనలకు అతను పదో సంతానం. అతనికి ఐదుగురు అన్నలు, నలుగురు అక్కలు. అందరి పెళ్లిల్లు అయిపోయాయి. ఉన్న పొలం కూడా పంచుకున్నారు. ఒక్కొక్కరికి రెండేసి ఎకరాలు కూడా రాలేదు. మల్‌రెడ్డితో పాటు అమ్మానాయనలు ఉండేవారు. పూటకెళ్లేది కాదు. చదువు కూడా సరిగా చదువుకోలేదు. దొంగతనాలు చేసేవాడు. ఊళ్లో నుంచి చెప్పాపెట్టకుండా పారిపోయేవాడు. అతను ఊళ్లో ఎప్పుడుంటాడో, ఎప్పుడు వెళ్లిపోతాడో ఎవరికీ తెలియదు. ఊరి నిండా అప్పులే. వేలకు వేలు కాదు, వందల్లోనే ఆ అప్పులు. ఆ అప్పులు తీర్చడం కూడా గగనమైపోతోంది అతనికి. మల్‌రెడ్డి తమ బాయి వైపు ఎందుకు వచ్చాడో రాంరెడ్డికి అర్థం కాలేదు. వాళ్ల బాయికి రాంరెడ్డి బాయికి దారి ఒకటి కాదు. వాళ్ల బాయి ఊరికి తూర్పున వుంటే, రాంరెడ్డి వాళ్ల బాయి ఊరికి దక్షిణాన అదీ పక్కూరి శివారులో వుంటుంది. అదే విషయాన్ని అడిగాడు. జవాబు చెప్పలేదతను. ఇంతలో అమ్మ వచ్చింది. మల్‌రెడ్డి తనతో మాట్లాడుతుండడం ఆమెకు నచ్చనట్టుంది.

''ఏంద్రా, మల్రెడ్డీ?'' అని అడిగింది.

''ఏం లేదక్కా! ఉత్తగనే ఒచ్చిన''

''పా, బిడ్డా పోదాం!'' అంది అమ్మ. ఆ మాటతో మల్రెడ్డి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.

''వాడితోటి జాగర్త, బిడ్డా!'' అంది తనను హెచ్చరిస్తున్నట్లు. అమ్మ కళ్లలో భయం తారాట్లాడుతున్నట్లు అనిపించింది.

''ఎందుకమ్మా?'' అని అడిగాడు. చిన్నప్పుడు కలిసిన తిరిగినవాళ్లు, కలిసి ఆడుకున్నవాళ్లు. వాడితో మాట్లాడితే అమ్మకు భయమెందుకో రాంరెడ్డికి అర్థం కాలేదు. మల్రెడ్డి కూడా మునుపటిలా సరదాగా లేడు. అమ్మతో ఎంత బాగా మాట్లాడేవాడు? తనతో ఎంత కలుపుగోలుగా ఉండేవాడు?

''వాడు అన్నల్లో కలిసిండు'' అని చెప్పింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X