• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పార్ట్-21

By Staff
|

తీతువు ఎక్కడో అరిచింది. తోక చుక్క రాలిపడింది. దళితులకు, కమ్యూనిస్టులకు, విప్లవానికి, మరి దేనికో దేనికో ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పే ప్రయత్నం చేయడంతో పార్టీ పేరు పలకడానికి కూడా వీలు లేనంతగా చాంతాడంతా పొడుగైపోయింది. ఉన్న సవాలక్ష కమ్యూనిస్టు పార్టీల్లో ఇది ఒకటిగానూ, ఉన్న కొన్ని విప్లవ గ్రూపుల్లో ఇదొకటిగానూ తయారైంది. ఆయుధం ప్రధానమైపోయింది. సాయుధ విప్లవానికి దళితులను సమాయత్తం చేయడం, వారికి పదవులు ఇవ్వడం జరిగిపోయింది. దీంతో రాంరెడ్డికి, రాజయ్యకు లింక్‌ తెగిపోయింది.

పార్టీ కొన్నాళ్లకే సాయుధ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. వసూళ్ల కార్యక్రమం ఎక్కువైంది. వ్యాపారుల కిడ్నాప్‌లు, అగ్రకుల పెత్తందార్ల ఇళ్లపై దాడులు, వసూళ్లు.. ఈ దృష్ట్యా చూస్తే పార్టీ చురుగ్గా పని చేస్తున్నట్లే. అయితే కాలం ఎప్పుడూ ఒక్కరిదే కాదు. కాలం కత్తులు దూస్తుంది. ఆకాశం సూర్యుళ్లనే కాదు, పిడుగులను ప్రసవిస్తుంది. కాలం దూసిన కత్తితో నేల రక్తసిక్తమైంది. ఊరు కాని ఊరిలో రాజయ్య దేహం పశ్చిమాద్రిని పొడిచిన సూర్యుడిలా ముద్ద కట్టింది. ఒక దళిత సూర్యుడి శవం. రిట్‌ మాండమస్‌లూ, పౌర హక్కుల నేతల ఎర్రజెండాల జైత్రయాత్రలూ ఉండవు. శవంపై ఎర్రజెండా కప్పడానికి త్వరపడే మేధావులూ ఉండరు.

.............. .............. ..................

ఒక్కడే ఒక్కడు టాటా సుమో వేసుకుని రాలిపడిన నల్ల సూర్యుడి కోసం....

ఎక్కడ మిర్యాలగుడా ఎక్కడెక్కడి నిజామాబాద్‌ పల్లెటూరు..

చూపులు కత్తులై మనసును చీరేస్తున్నా వెరవని చంద్రకాంత్‌...

శవాన్ని టాటా సుమోలో వేసుకుని మిర్యాలగుడా వచ్చాడు చంద్రకాంత్‌. అప్పుడు కదిలింది హైదరాబాద్‌ మేధవి వర్గం రథం. అంతా మిర్యాలగుడా దగ్గరి చిన్న పల్లెటూరుకు చేరారు. దేహం చిన్నదే, ధైర్యమే పెద్దది అన్నారు చూసిన జనం. ఇసుకేస్తే రాలనంత జనం... తాను కన్నబిడ్డను కళ్లారా చూసుకోవడానికి ఆ పల్లెటూరు వేలాది కళ్లను అరువు తెచ్చుకుంది. శవయాత్ర ప్రవాహంలా సాగింది. రాజయ్య అమరవీరుడయ్యాడు.

రాజయ్య బతికే ఉంటే.. అని అప్పుడప్పుడూ అనుకుంటూ ఉంటాడు రాంరెడ్డి. ఆశయాలు, ఆలోచనలెప్పుడూ గొప్పగానే ఉంటాయి. వాటిని ఆచరణలో పెట్టడంలోనే ఉంది తిరకాసంతా. రాజయ్యను దారి తప్పించారెవరో.. ఆ ఎవరో తనకెరుకే.. కానీ చెప్పడానికి మనిషితనం అడ్డం. మనిషి ముసుగేసుకున్న భయం అడ్డం.

రాజయ్య రూపంలో చిగురించిన ఆశ మొగ్గలోనే తుంచేయబడింది. ఇక ఈ సమాజానికి నిష్కృతి లేదనుకంటాడు రాంరెడ్డి. చాలా పార్టీల్లాగా రాజయ్య పార్టీ కూడా ఒక్కటైపోయింది. ఒక విప్లవపార్టీకి పుట్టిన మరో శిశువు మాత్రమే అయింది తప్ప స్వతంత్రంగా ఎదిగే సూర్యుడి బిడ్డ కాలేకపోయింది. చీకటి చెరిగిపోలేదు. మబ్బులు విడిపోలేదు. వెలుగు కనిపించే దారి లేదు. అంతా నిరాశానిస్పృహ.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X