• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

2001- కవితా సంకలనాలు

By Staff
|

తెలుగు కవిత్వం విషయానికి వస్తే ఈ ఏడాదికి ఒక ప్రత్యేకమైన స్థానం వుంటుంది. కవిత్వాన్ని అంచనా వేయడానికి ఉద్యమాలను, వాదాలను గీటురాయిగా తీసుకునే కాలం ఇంతకు ముందు వుంది. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. వ్యక్తిగతానుభవాలను, అనుభూతులను కవులు ఈ ఏడాది కవిత్వీకరించారు. లేదంటే అలా కవిత్వీకరించబడిన కవిత్వాలు సంకలనాలుగా వెలువడ్డాయి. వాదాలకు, సిద్ధాంతాలకు కవిత్వంలో కాలం చెల్లినట్లు ఆ సంకలనాలను చూస్తే తెలుస్తుంది. ఒక రకంగా, స్త్రీ, దళిత ఉద్యమాలు స్తబ్దతకు గురికావడం, విప్లవ సాహిత్యోద్యమం ముందుకు సాగకపోవడం వంటి కారణాల వల్ల ఉద్యమ కవిత్వం చాలా తక్కువగా వచ్చింది. అలా చూస్తే తెలంగాణ ప్రాంతీయ కవిత్వం కొంత జోరుగా వచ్చింది.

ఈ ఏడాది దీర్ఘ కవితలు కూడా అచ్చయ్యాయి. ఇందులో ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన జూకంటి జగన్నాథం 'వాస్కోడిగామా. కామ్‌', సుంకిరెడ్డి నారాయణ రెడ్డి 'దాలి'. జూకంటి జగన్నాథం సంకలనంలో నాలుగు దీర్ఘ కవితలున్నాయి. అయితే ఇందులో 'వాస్కోడిగామా. కామ్‌' కవిత అత్యంత శక్తివంతమైంది. గ్లోబలైజేషన్‌ దుష్ప్రభవాల గురించి సమర్థంగా చెప్పిన కవిత ఇది. ఇక, నారాయణరెడ్డి 'దాలి' ప్రత్యేక తెలంగాణను ఆశిస్తూ రాసిన కవిత. అన్ని రంగాల్లో తెలంగాణ కోస్తా ఆధిపత్యం వల్ల, కోస్తా అంతర్గత వలస వల్ల ఎలా నాశనమవుతున్న తీరును వ్యక్తీకరించిన పొలికేక 'దాలి'. జూలూరి గౌరీ శంకర్‌ 'మా తెలంగాణ' దీర్ఘ కవిత కూడా ఈ ఏడాదే వెలువడింది. బెస్తల జీవితాల గురించి ఆక్రోశం వెలిబుచ్చుతూ వెంకట్‌ వెలువరించిన దీర్ఘ కవిత 'వర్జి'. వివిధ రంగాల్లో జరుగుతున్న విధ్వంసాన్ని దర్భశయనం శ్రీనివాసాచార్య 'ఆట' అనే దీర్ఘ కవితను వెలువరించారు. ఈ దీర్ఘ కవితలన్నీ తెలంగాణ కవుల నుంచే వెలువడడం గమనార్హం.

కరెంట్‌ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా ఈ ఏడాది తీవ్ర పోరాటం జరిగింది. ఈ సందర్భంగా బషీర్‌బాగ్‌ వద్ద జరిగిన పోలీసు కాల్పుల్లో కొంత మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా కవులు తమ గొంతును పోరాటంతో కలిపారు. పలువురు కవులు విద్యుత్‌ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ కవిత్వం రాశారు. అమరులను జ్ఞాపకం చేసుకుంటూ కవిత్వం అల్లారు. ఈ కవితలన్నీ ఒక పుస్తకంగా అచ్చయ్యాయి. ఇదే సమయంలో గ్లోబలైజేషన్‌ వ్యతిరేక పోరాటం కూడా తెలుగు ప్రాంతంలో ప్రధానంగా ముందుకు వచ్చింది. గ్లోబలైజేషన్‌ వ్యతిరేక కవిత్వాన్ని 'అక్షరం' అనే సంస్థ 'గ్లోబల్‌ ఖడ్గం' పేర అచ్చేసింది. ఇందులో శక్తివంతమైన కవితలున్నాయి. అఎn్ఘానిస్థాన్‌పై అమెరికా దాడులు కూడా తెలుగు సమాజాన్ని ప్రభావితం చేశాయి. అమెరికా ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ విరివిగా కవితలు వచ్చాయి. ఈ కవితలను విప్లవ రచయితల సంఘం (విరసం) ఒక సంకలనంగా తెచ్చింది. ఆ తర్వాత బిసి కవులు తెలుగులో ఒకటై ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టే ప్రయత్నం కూడా ఈ సంవత్సరంలో జరిగింది. దళితవాదం వెనుకంజ వేసినట్లు కనిపించడం బహుశా ఇందుకు కారణం కావచ్చు. జూలూరి గౌరీశంకర్‌, ప్రసేన్‌ సంపాదకులుగా 'వెంటాడే కలాలు' పేర బిసిల కవిత్వం అచ్చయింది. ఇందులో పలువురు బిసి కవులు తమ ఆత్మకథలను కవితాత్మకంగా వెలువరించారు. స్త్రీవాద కవిత్వంలో బలమైన గొంతు అయిన కొండేపూడి నిర్మల నుంచి 'మల్టీనేషనల్‌ ముద్దు' అనే కవితా సంకలనం వెలువడింది. గ్లోబలైజేషన్‌ వ్యతిరేక కవితలు ఇందులో ఎక్కువగా వున్నాయి. స్త్రీ దృక్కోణం నుంచి గ్లోబలైజేషన్‌ దుష్ప్రభావాన్ని ఆమె కవితలు వెలువడ్డాయి.

ఇక, ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఈ ఏడాది ప్రత్యేక లక్షణంగా వచ్చిన కవిత్వం గురించి. కవులు తమ వ్యక్తిగతనాభవాలను, అనుభూతులను కవిత్వీకరించారు. ఇలా వ్యక్తీకిరించడంలో కొంత మంది నైతిక విలువల గోడలు బద్దలు కొట్టే పని చేశారు. ఇలా బద్దలు కొట్టే ప్రయత్నం చేసిన కవులు అయిల సైదాచారి, ఎస్‌.జగన్‌ రెడ్డి. సైదాచారి కవిత్వం 'ఆమె నా బొమ్మ' అనే పేరుతో పుస్తకంగా వచ్చింది. జగన్‌ రెడ్డి కవిత్వం 'నేనొక్కణ్నే' పేరుతో వెలువడింది. ఈ ఇరువురు కవులు లైంగిక ప్రస్తావనలను, ప్రతీకలను జంకుగొంకు లేకుండా వాడారు. వీరు తమ ఆత్మ సంక్షోభాలను, తమ తీరని దాహాలను, పడిన వేదనలను కవిత్వీకరించారు. పాత నిబంధనలను త్రోసిరాజంటూ కొత్త కవిత్వానికి బాటలు వేశారు. సిద్ధాంతాలతో, వాదాలతో నిమిత్తం లేకుండా కవిత్వాన్ని పండించిన వారు ఇంకా వున్నారు. డాక్టర్‌ పులిపాటి గురుస్వామి 'చెమ్మ', ముకుంద రామారావు'మరో మజిలీకి ముందు', ఎం.ఎస్‌. నాయుడు 'ఒక వెళ్లిపోతాను', రమణజీవి 'నలుగురు పాండవులు', తమ్మినేని యదుకుల భూషన్‌ 'నిశబ్దంలో నీ నవ్వులు', బైరెడ్డి కృష్ణారెడ్డి 'ఆర్తి', కందుకూరి దుర్గా ప్రసాద్‌ 'ఇసుక గొంతులు' సిద్ధాంత రాద్ధాంతాల గొడవ లేకుండా సమాజాన్ని, వ్యక్తినీ వ్యక్తీకరించిన కవితా సంకలనాలు. ఈ కవితా సంకలానాల నిండా మనిషితనం ఉట్టిపడుతూ వుంటుంది. జీవితంలోని, సమాజంలోని అసంబద్ధతను ఈ సంకలనాలు ప్రశ్నిస్తాయి.

అఫ్సర్‌, ప్రసేన్‌, వంశీకృష్ణ, సీతారాం కలిసి ఒక ప్రయోగం చేశారు. నలుగురు కలిసి ఒక కవితల పుస్తకాన్ని అచ్చేశారు. ఈ పుస్తకం పేరు 'కవిత్వం'. కవిత్వం ముఖ్యం గానీ కవులు కారని చెప్పడానికి వీరు ఈ పుస్తకం వేశారు. ఎవరు ఏ కవిత రాశారో ఎక్కడా చెప్పలేదు. అట్ట మీద మాత్రం నలుగురి పేర్లు కామాలు లేకుండా వేశారు. ఈ పేర్లు కూడా చిరునామా కోసమే తప్ప మరోటి కాదని చెప్పుకున్నారు.

ఈ సంవత్సరం వెలువడిన అఫ్సర్‌ 'వలస' కవితాసంకలనాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మనిషి పరాయికరణ చెందడం గురించి ఆయన ప్రతిభావంతంగా రాశారు. తన ఆవేదనలను, ఆవేశాలను, ఆక్రోశాలను కవిత్వంగా మలిచాడు అఫ్సర్‌. తెలంగాణ యాసలో కవిత్వం రాసే కృష్ణమూర్తి యాదవ్‌ 'శబ్నం' పేర ఒక కవితాసంకలనం వేశారు. ఇంకా కొన్ని సంకలనాలు కూడా వచ్చాయి. మొత్తంగా ఈ ఏడాది వైవిధ్య భరితమైన కవిత్వం వెలువడిందని చెప్పాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X