వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కథాపెద్దల హ్రస్వ దృష్టి

By Staff
|
Google Oneindia TeluguNews

పలువురు రాసిన కథల నుండి ఎన్నిక చేసి యేటా ఒక కథాసంకలనం తీసుకు వచ్చే సంప్రదాయాన్ని 'కథా సాహితి' పేరిట వాసిరెడ్డి నవీన్‌, పాపినేని శివశంకర్‌ ప్రారంభించారు. సాహిత్యాభిమానుల సహకారంతో ఇప్పటికే పదకొండు సంకలనాలు ప్రచురించారు. ఈ పదకొండు సంకలనాల్లో 90 మంది కథకులు రాసిన 143 కథలు చేర్చబడ్డాయి. అంతా మంచి కృషి అని ప్రశంసిస్తూ వచ్చారు. పదేళ్ల తర్వాత సంహావలోకనం చేస్తే ఒక క్రమ పద్ధతిలో తెలంగాణ కథకు, దళిత బహుజన కథలకు తీరని అన్యాయం జరిగిందనేది తిరుగులేని వాస్తవం.

తెలంగాణ కథకు, దళిత బహుజన జీవితాల కథలకు తీరని అన్యాయం చేస్తున్నారని సంపాదకుల వైఖరి మారాలని ఈ వ్యాసకర్త 1992లోనే ఆంధ్రజ్యోతి దినపత్రికలో వ్యాసం రాశాడు. అందుకు స్పందించి విభజించు పాలించు సూత్రాన్ని స్వీకరించి అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి సలహా సహకారాలకు కృతజ్ఞతలంటూ ముందు మాటల్లో రాస్తూ తెలంగాణ రచయితల ధర్మాగ్రహాన్ని వారిపైకి మళ్లించే కృషి చేశారు. తద్వారా తెలంగాణ కథకుల నోరు మూయించారు. దశాబ్ద కాలంలో సంకలనాల చరిత్ర స్పష్టంగా కళ్లెదుట వున్నది దాచేస్తే దాగని సత్యాలివి.

వీళ్లు ప్రచురించిన 143 కథల్లో తెలంగాణ కథలు 15 మాత్రమే. అవైనా ఏడుగురి కథకులవే. అవి ఇలా వున్నాయి. కథ 90లో సుమనస్పతి రెడ్డి కథ నిశ్శబ్దం, గోపి కథ ఒక తండ్రి, 91లో ఆడెపు లక్ష్మీపతి ఆక్రోశం, అల్లం రాజయ్య కమల, 92లో తుమ్మేటి ఉరి, 93లో తుమ్మేటి జాడ, 94లో తుమ్మేటి పనిపిల్ల, 95లో అల్లం రాజయ్య అతడు, ఆడెపు లక్ష్మీపతి జీవన్మృతుడు, 96లో ఆడెపు లక్ష్మీపతి తిర్యగ్రరేఖ, 97లో కాలువ మల్లయ్య యుద్ధభూమి, బి.ఎస్‌. రాములు మెరుగు, 98లో నిల్‌, 99లో బి.ఎస్‌. రాములు వారసత్వం, 2000లో పెద్దింటి అశోక్‌కుమార్‌ వలసపక్షి, ఆడెపు లక్ష్మీపతి విధ్వంస దృశ్యం మాత్రం ప్రచురించారు.

కథ 92, 93, 94, 96, 99 అనగా అయిదు సంకలనాల్లో ఒకే ఒక తెలంగాణ కథ ప్రచురించారు. కథ 98లో తెలంగాణ కథ ఒక్కటి కూడా లేదు. కథ 99లో ఉన్న ఒకే ఒక తెలంగాణ కథ వారసత్వంను చివరి క్షణాల్లో చేర్చడం జరిగిందని ఆవిష్కరణ సభలో సంపాదకులే ప్రకటించారు. తెలంగాణ నుండి విప్లవ సంబంధ కథలు తప్ప ఇతర కథలు వేయం అని కూడా నిస్సిగ్గుగా దురహంకారంతో ప్రకటించారు.

పదకొండేళ్ల తెలంగాణ సమాజ పరిణామాల్ని కథ 90-2000 సంకలనాలు ఏ మేరకు పట్టించుకున్నాయి. ఎంత మంది తెలంగాణ కథకులకు, దళిత బహుజన కథకులకు, కథలకు ప్రాధాన్యత ఇవ్వదల్చుకున్నారు, ప్రోత్సహించదల్చుకున్నారు అనేవే ఇక్కడ ప్రధానం. మొత్తం తెలుగు సమాజ పరిణామాలకు ఈ సంకలనాలు ఏ మేరకు ప్రాతినిధ్యం వహిస్తాయనే ముఖ్యాంశానికి ఇది గీటు రాయి కూడా.

పదకొండేళ్ల తెలంగాణ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, చారిత్రక పరిణామాల్ని చిత్రిస్తూ వందలాది కథలు వచ్చాయి. ఉదాహరణకు: ఒక్క కాలువ మల్లయ్యే రెండు వందలకు పైగా కథలు రాశారు. కె.వి. నరేందర్‌ 70, బోయ జంగయ్య 40, పులుగు శ్రీనివాస్‌ 25, బి.ఎస్‌.రాములు 50, భూపాల్‌ 25, ముదిగంటి సుజాతారెడ్డి 50, తంబల్ల జనార్ధన్‌ 30, సదానంద శారద 20, పి. చంద్‌ 30, అంపశయ్య నవీన్‌ 30, బెజ్జారపు వినోద్‌కుమార్‌ 10, కాసుల ప్రతాపరెడ్డి 25, జూకంటి జగన్నాథం 10, గీతాంజలి 20, అయితా చంద్రయ్య 75, గుండెడప్పు కనకయ్య 15, చైతన్యప్రకాశ్‌ 20 కథలు రాశారు. ఈ కథల్లోంచి చారిత్రక కర్తవ్యంగా సంకలనాల్లో చేర్చాల్సిన కథలే లేవా? ఇప్పుడు సంకలనంలో చేర్చిన కథల కన్నా గొప్ప కథలు, ఉత్తమోత్తమ కథలు ఈ దశాబ్దంలో లేవా? లేవని ఎవరైనా అనే సాహసం చేస్తారని నేను అనుకోను. అయినా ఈ కథకుల కథల్ని, గొప్ప కథల్ని ఎందుకు వదిలేశారు? మార్క్సిజం చెప్పే ఉత్పత్తి సంబంధాల పరిణామాలే సమాజ పరిణామాల కేంద్ర బిందువని తెలిసి వాటిని చిత్రించే కథల్ని ఎందుకు వదిలేశారు?

నలభై శాతం జనాభా నిష్పత్తి ప్రకారం 143 కథల్లో 60 కథలు తెలంగాణ కథలుండి తీరాలి. అది జరక్కపోతే తెలుగు భాష ఒకటే, తెలుగు ప్రజలు ఒక్కటే అని తెలంగాణ ప్రజలు కలిసి వుండడం దేనికి? ప్రత్యేక రాష్ట్రం కోరుకోవడాన్ని అనివార్యం చేస్తున్నది ఎవరు? ఈ నిశ్శబ్ద దుర్మార్గపు హింస, అణచివేత సాహిత్య సాంస్కృతిక రంగాల్లో పోలీసు, రాజ్యహింస కన్నా హీనమైనది, క్రూరమైనది.

నిజానికి సామాజిక కథలకు తెలంగాణాయే పెద్ద దిక్కని అందరూ అంగీకరించారు. కాని గత పదకొండేళ్లలో ఈ సంకలనాల ద్వారా, వీటి సమీక్షలు, ప్రశంసల ద్వారా తెలంగాణ కథ దిక్కు లేకుండా చేయబడింది. పది శాతం మించకుండా తెలంగాణ కథల్ని ప్రచురించినట్టే ఒక పది శాతం కోస్తా కథలూ, ఒక పది శాతం రాయలసీమ కథలూ ప్రవాసాంధ్రుల కథలూ చేర్చి ఎనభై శాతం తెలంగాణ కథలు ఎన్నిక చేసి ఈ దశాబ్ద ఉత్తమ తెలుగు కథలని ప్రచురిస్తే అవి కూడా గొప్ప కథలుగానే, ఉత్తమ కథలుగానే వుంటాయనే విషయంలో సందేహం అక్కర లేదు.

తెలంగాణ సమాజాన్ని, సామాజిక పరిణామాల్ని గత దశాబ్దంలో బహు ముఖాలుగా కథల్లో ఎంతో గొప్పగా చిత్రించడం జరిగింది. తెలంగాణ కథలు ఇప్పటికే సమాజ పరిణామాలు కేంద్రంగా కథౄ వస్తువు నడవడం తెలంగాణ చేసుకున్న గొప్ప అదృష్టం. కోస్తా ప్రాంతాల కథల్లో ఇలాంటి కతలు అల్ప సంఖ్యలో వెలువడితే తెలంగాణాలో మెజారిటీ సామాజిక కథలే. ఇదే తెలంగాణ కథల గొప్పదనం. కోస్తా ప్రాంతాల కథల్లో వ్యక్తి కేంద్రంగా, కుటుంబం కేంద్రంగా సామాజికతను కుదించడం సర్వసాధారణం.

కాలువ మల్లయ్య, బి.ఎస్‌. రాములు కథల్లో నూరేళ్ల తెలంగాణ సామాజిక ఆర్థిక సాంస్కృతిక చరిత్ర పరిణామాలు ఆవిష్కృతమయింది ఈ దశాబ్దంలోనే. కార్మికుల గురించి, వలసవాదుల గురించి పులుగు శ్రీనివాస్‌ అద్భుతమైన కథలు రాసింది ఈ దశాబ్దంలోనే. బోయ జంయ్య, కె. వి. నరేందర్‌ నూతనోత్తేజంతో నాలుగేసి కథా సంపుటాలు వెలువరించింది ఈ దశాబ్దంలోనే. వలసల గురించి పెద్దింటి అశోక్‌కుమార్‌, సిమెంటు, బొగ్గు పరిశ్రమల వల్ల భూనిర్వాసితులవుతున్న సామాజిక చరిత్రను పి. చంద్‌ సాహితీకరించింది ఈ దశాబ్దంలోనే. కమ్యూనిస్టు సంస్కృతి కుటుంబ వ్యవస్థలో, ఆలోచనల్లో తెచ్చిన పరిణామాల్ని అత్యద్భుతంగా సంశయం వంటి కథల్లో బెజ్జారపు వినోద్‌కుమార్‌ చిత్రించింది ఈ దశాబ్దంలోనే. తెలంగాణ ప్రజల బొంబాయి వలసల గురించి, అవి తెలంగాణ జీవితాల్లో తెస్తున్న మార్పుల గురించి తంబల్ల జనార్ధన్‌ విజృంభించి రాసింది ఈ దశాబ్దంలోనే. తెలంగాణ బడుగు జీవుల, స్త్రీల బతుకు వేదనలను బలంగా పలు పార్శ్వాల్లో చిత్రించి విసుర్రాయి, మింగుతున్న పట్నం కథా సంపుటాల్ని ముదిగంటి సుజాతారెడ్డి వెలువరించింది ఈ దశాబ్దంలోనే.

కథా సంకలనాలు, కవితా సంకలనాలు మొత్తం సమాజానికి, మొత్తం సమాజ పరిణామాలకు ప్రాతినిధ్యం వహించాలి. తెలంగాణ, రాయలసీమ, కోస్తా ప్రాంతాల దేశీయత జనాభా నిష్పత్తిలో సరైన వాటా ఇవ్వాలి. పైన పేర్కొన్న సమాజ పరిణామాల్ని అన్ని స్పెషలైజేషన్లకు తగిన స్థానం ఇవ్వాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు గానీ, విశ్వవిద్యాలయాలు గానీ, ఇతరులు గానీ ప్రచురించే కథా సంకలనాలు మొత్తం సమాజానికి, మొత్తం సమాజ పరిణామాలకు, మంచి కథకులందరికి ప్రాతినిధ్యం వహించాలి.

మొత్తంగా చూస్తే కథ-2000 సంకలనాలు తెలంగాణ కథల్ని, దళిత బహుజన కథల్ని ఆవిష్కరించే వారి ఎదుగుదలను ప్రోత్సహించే అవకాశం ఇవ్వలేదని స్పష్టమవుతున్నది. పదకొండేళ్లుగా వారిలో దళిత బహుజనుల పట్ల, తెలంగాణ పట్ల వ్యతిరేకత, ద్వేషం, అణచివేత దృక్పథం కొనసాగుతున్నాయని చెప్పడానికి ఈ సంకలనాలు తిరుగులేని సాక్ష్యం ఇస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X