రోజువారీ ఫుడ్ మెనూలో దీన్ని చేర్చుకోండి.. చాలు
ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ క్రమంలో తృణధాన్యాలు మళ్లీ ప్రాచుర్యంలోకి వస్తోన్నాయి. అలాంటి వాటిలో బార్లీకి అత్యంత ప్రాధాన్యత ఉంది. వేల ఏళ్ల చరిత్ర కలిగిన బార్లీ గింజల్లో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజూవారీ ఆహారంలో దీనిని భాగం చేసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గుర్తు చేస్తోన్నాయి. వీటిని తరచూ తీసుకుంటోండటం వల్ల ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
బార్లీలో డైటరీ ఫైబర్ అత్యధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులోని బీటా గ్లూకాన్ అనే కరిగే పీచురకం కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్-బీ కాంప్లెక్స్, ఐరన్, మెగ్నీషియం, సెలీనియం వంటి ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు దీనిలో మెండుగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పటిష్టం చేయడంతో పాటు శరీర కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి.

గుండె జబ్బుల ముప్పును సైతం తగ్గించడంలో బార్లీ ఎంతగానో తోడ్పడుతుంది. బార్లీలో ఉండే బీటా-గ్లూకాన్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను అదుపులో ఉంచుతుంది. తద్వారా రక్తనాళాల పనితీరు మెరుగవుతుంది. దీనితో పాటు బార్లీ గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండటం వల్ల మధుమేహ బాధితులకు ఇది చక్కని ఆహారం. రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఒక్కసారిగా పెరగకుండా నియంత్రిస్తుంది. ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది.
జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారికి బార్లీ ఓ దివ్యౌషధం లాంటిది. దీనిలోని అధిక పీచుపదార్థం మలబద్ధకాన్ని నివారిస్తుంది. ప్రేగులలో మంచి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. బార్లీ తీసుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువసేపు ఉంటుంది. ఇది తరచుగా ఆకలి వేయకుండా నియంత్రిస్తుంది. తద్వారా స్థూలకాయం లేదా అధిక బరువును తగ్గించుకోవాలనుకునే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
బార్లీలో ఉండే మెగ్నీషియం, ఫాస్ఫరస్, మాంగనీస్ వంటి మూలకాలు ఎముకల సాంద్రతను పెంచడంలో సహాయపడతాయి. ఇవి ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల బారిన పడకుండా ఎముకలను దృఢంగా ఉంచుతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు రాకుండా నిరోధించి, చర్మాన్ని నిత్య నూతనంగా ఉంచుతాయి. కాలేయంలో పేరుకుపోయే వ్యర్థాలను తొలగించి, దాని పనితీరును మెరుగుపరచడంలో కూడా బార్లీ సహాయపడుతుంది.
సమతుల్య ఆహారంలో భాగంగా బార్లీ సూప్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు తొలగిపోతుంది. బార్లీలో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్ని ఉన్నప్పటికీ, కొందరు దీనిని తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. గ్లూటెన్ ఉండటం వల్ల దీని అలర్జీ గానీ, సెలియాక్ వ్యాధి ఉన్నవారు గానీ బార్లీకి దూరంగా ఉండాలి. అధిక మోతాదులో తీసుకుంటే కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ వంటి సమస్యలు తలెత్తవచ్చు. రక్తపోటు, మధుమేహానికి మందులు వాడుతున్న వారు బార్లీని ఆహారంలో చేర్చుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం అవసరం.














Click it and Unblock the Notifications
