ప్రపంచీకరణపై 'కథన' కుతూహలం

Posted By:
Subscribe to Oneindia Telugu

మునుపటి వలె కథ సాహిత్య వేదికల తెర వెనుకన అణగిమణగి వుండడం లేదు. సమకాలీనతను దాని అన్ని నుంచి వ్యక్తం చేయ గలిగిన సమర్థతను, సృజనాత్మకతను అది ప్రదర్శిస్తున్నది. కథకుల సొంత కథా సంకలనాలు, అనేక కథకుల సంకలనాలు, పాత కథల కొత్త సంకలనాలు పెద్ద సంఖ్యలో ప్రచురితమవుతున్నాయి. కథకులు తమలో తాము సంభాషించుకుంటున్నారు, తక్కిన సాహిత్యాలతో సంభాషిస్తున్నారు. కథల, కథకుల చుట్టూ వుండే వాతావారణం నుంచి ఎన్నో వివాదాలు చర్చకు వస్తున్నాయి. కథౄ విమర్శ ప్రత్యేక శాఖగా బలపడుతున్నది. ఏటికేడు వేగవంతమూ తీవ్రమూ స్పష్టమూ అవుతున్న ఈ పరిణామానికి దశాబ్దానికి పైగా వయస్సున్నప్పటికీ- ఇటీవలి సంవత్సరాలలో దాని ఉధృతి కొట్టొచ్చినట్టు కనిపించసాగింది. వర్తమాన తెలుగు సాహిత్యాలలో కథా ప్రక్రియ ముఖ్యమైన, సంచలనాత్మకమైన, ప్రభావశీలమైన పాత్రను నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తున్నది. కొత్త శతాబ్దం మొదటి సంవత్సరంలో ఈ సూచన మరింత బలంగా, స్పష్టంగా వ్యక్తమైంది.

రెండు వేల ఒకటో సంవత్సరంలోని కథా సాహిత్య వాతావరణంలో రెండు అంశాలు ముఖ్యమైన ప్రభావం వేశాయి. అవి ప్రాపంచికత, స్థానికత. ఈ రెంటినీ ఒకటిగా కూడా పరిగణించవచ్చును. ప్రపంచీకరణ, దానిలో అంతర్భాగమైన అనేక అంశాలు, స్థానికతావాదం దాని అభివ్యక్తులు- ఈ రెండూ కలిపి కానీ, వేరువేరుగా కానీ ఇతివృత్తంగా తీసుకోవడానికి రచయితలు ఉత్సాహపడ్డారు. గ్లోబలైజేషన్‌ నేపథ్యంలో కులం, మతం, జెండర్‌, స్థానికత వంటి అస్తిత్వాల సమస్యలను చూసిన కథళు అనేకం ఈ సంవత్సరం వచ్చాయి. స్థానిక భాష వినియోగం కథలలో అనివార్యంగా ఎక్కువయింది. మరొక రకంగా కూడా గ్లోబల్‌- లోకల్‌ ద్వంద్వం తెలుగు కథా సాహిత్యంలో ప్రతిఫలించింది. తెలుగు కథా సాహిత్యంలో అంతర్జాతీయ లేదా ప్రవాసాంధ్రుల 'పోషకత్వం' ఒక వివాదాస్పద అంశం అయింది. కథల పోటీల మీద తీవ్రమయిన విమర్శ వ్యక్తమయింది. అలాగే- ప్రవాసాంధ్రుల ప్రమేయంతోనైనా, ప్రమేయం లేకుండానైనా వెలువడుతున్న వార్షిక కథా సంకలనాలలో, కథా సాహిత్య పత్రికలలో తెలంగాణ వారికి ప్రాతినిధ్యం దొరకడం లేదన్న విమర్శ కూడా ఈ ఏడాది బలంగా వచ్చింది. కథా చారిత్రక సంకలనాలలో తెలంగాణకు లభించని ప్రాతినిధ్యం మీద, లేదా లభించిన నామ మాత్రపు ప్రాతినిధ్యం మీద కూడా విమర్శలు వెలువడ్డాయి. తెలంగాణా కథా సాహిత్య చరిత్ర గురించి అనేక వ్యాసాలు ఈ ఏడాది ప్రచురితమయ్యాయి. కథకులకూ, విమర్శకులకూ మధ్య సంభాషణ పేరుతో కె. సురేష్‌, ఖదీర్‌బాబు కలిసి కీసరగుట్టలో ఏర్పాటు చేసిన విహారచర్చలో తెలంగాణా కథకులకు తగిన ప్రాతినిధ్యం లేనందుకు ఒక చిన్న దుమారం రేగింది. మొత్తం మీద కథా సాహిత్యంలో కూడా శిబిరాలు ఏర్పడిపోయాయి. కథలను ఆదరిస్తున్న ఒక పత్రిక మూత పడడం, మరొక పత్రిక ప్రచురణ విరమించడం- నిరుత్సాహం కలిగించినా, కతకుల స్వయంకృషిని పెంపొందించడానికి, కొత్త మార్గాల అన్వేషణకు నిర్బంధ ప్రేరణ లభించింది. రెండు పత్రికల ప్రత్యేక సంచికల (ప్రజాతంత్ర, ప్రజాశక్తి 'గమనం')ను కథాసంకలనాలని కూడా అనవచ్చును.

మూతపడిన పరిశ్రమలు, మార్జిన్లలో కూడా మిగలకుండా పోయిన జీవితాలు, హైటెక్‌ శరీర వ్యాపారం, విదేశాలకు ఎగబడడం, జీవనాధారాలను కుంగదీసే అభివృద్ధి, సంస్కరణల పేరుతో తాకట్టు పడుతున్న దేశం, ఈ దుస్థితిని ఎదుర్కొనడానికి రంగంలో నిలబడిన రాజీకీయ శక్తులు, వాటి వల్ల ఉత్పన్నమయ్యే భిన్న పరిస్థితులు, స్వేచ్ఛను, స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటున్న స్థానిక ప్రజాశక్తులు, ఆ ఆకాంక్షల నుంచి వ్యక్తమవుతున్న అనేకాకానేక తారతమ్యాలు, వైరుధ్యాలు- ఇవి 2001 సంవత్సరం తెలుగు కథలో ప్రతిఫలించిన కొన్ని ముఖ్య సన్నివేశాలు. సంవత్సరారంభంలో వచ్చిన ప్రజాతంత్ర సాహిత్య సంచికలోని కుప్పిల పద్మ కథ 'సాలభంజిక', జి. ఉమామహేశ్వర్‌ 'నిశ్వబ్ద విప్లవం', గీతాంజలి 'సంటిది' దగ్గరి నుంచి- 'తానా' మెచ్చిన సురేష్‌ కథ 'టైటానిక్‌', మహ్మద్‌ ఖదీర్‌బాబు ఒంటి కథ పుస్తకం 'ఖాదర్‌ లేడు' మీదుగా ఈ సంవత్సరం చివరాఖర్న వచ్చిన గొరుసు జగదీశ్వర రెడ్డి 'బతుకుగోస' దాకా ప్రపంచీకరణ వ్యతిరేక కథలే. ఆకాశపు దారులంట హడావుడిగా వెళ్లిపోయే ప్రపంచ అభివృద్ధి రథ చక్రాల కింద నలిగిపోతున్న జీవితం గురించి రాసిన కథలే. ప్రపంచీకరణ ప్రభావాల గురించి ఇంత ఉరవడిలో కథనం చేయడానికి రచయితలు నిజానికి చాలా కాలం తీసుకున్నారు, కట్టెదుట కనిపించే బీభత్సానికి ఏడేడు సముద్రాల ఆవల జరిగే నిర్ణయాలకు ఉన్న సంబంధాన్ని ఒక చిన్న కథలో స్థాపించడం కష్టమే. బాహ్య వాస్తవికతలో ఆ సంబంధం అస్పష్టంగా, నర్మగర్భంగా, చాప కింద నీరులా కాక- స్పష్టంగా, సూటిగా, బాహాటంగా కనిపిస్తుండటంతో రచయితల పని ఇటీవలి సంవత్సరాలలో సులువు అయింది. ప్రపంచీకరణకు, సంస్కరణకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ముఖ్యమైన రంగస్థలం కావడం, ఆ విధానాలకు ఇక్కడి ప్రజా జీవితంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత నిర్మితం కావడం- ఈ కథా వాతావరణాన్ని నిర్మించాయి. ఉదారవాద ఆర్థిక విధానాల పేరుతో, ప్రవైటీకరణ పేరుతో, గ్లోబలీకరణ పేరుతో శిథిలమవుతున్న జన జీవితాన్ని దాని చలనంలో పట్టుకోగలిగిన సాహిత్యం విస్తృతంగా రావలసిన అవసరం వున్నది. సురేష్‌ కథా, జగదీశ్వర రెడ్డి కతా ఒకే ఇతివృత్తాన్ని కథనం చేసి వుండవచ్చును, ఆ కథల నాయకులు పాడుపడిన పని స్థలాలలో పిచ్చివారిగానో పిశాచాలుగానో తిరుగాడిన కథలే కావచ్చును- కానీ అభివృద్ధి పేరు మీద, బంగారు భవిష్యత్తు పేరు మీద మనుషుల మొహాల మీద మూసేసిన వేల, లక్షల బతుకుతెరువులను అక్షరాలలోకి దించడానికి ఎన్ని కథలయితే సరిపోతాయి? శైలీ శిల్పాల గురించిన పరిగణన పక్కకు పెడితే- గ్లోబలీకరణను ప్రత్యక్షంగా, పరోక్షంగా స్పృశించే కథలు అసంఖ్యాకం. సీరియస్‌ కథలలోనే కాదు, సాధారణ, కాలక్షేపపు కథా సాహిత్యంలో కూడా ప్రస్తుతం అమలవుతున్న గ్లోబల్‌ విధానాల మీద ఏదో ఒక రకం విమర్శ కనిపించడం సాధారణమైపోయింది.

మహ్మద్‌ ఖదీర్‌బాబు రాసిన 'ఖాదర్‌ లేడు' కత స్థానికతకూ ప్రాపంచికతకూ ఉన్న తార్కిక సంబంధాన్ని ప్రతిభావంతంగా ఆవిష్కరించింది. వాస్తవమయిన రోడ్ల వెడల్పును, మరింత వాస్తవమయిన నిర్వాసీకరణను- ఒక ప్రతీకాత్మక అంశాలుగా మార్చిందీ కథ. రోడ్ల వెడల్పులోనే కాదు, ప్రపంచ బ్యాంక్‌ రోడ్డు రోలర్‌ ప్రయాణించే దారి పొడవునా ఇటువంటి బాధితులే వున్నారు. ఈ బాధితులలోని కడగొట్టువారిలో ముస్లిములూ వున్నారు. అదే అభివృద్ధి మనుషులను మరబొమ్మలుగా, విలాసవస్తువులుగా మారుస్తుంది. బంగారు భవిష్యత్తు నిర్మించుకోవడానికి కొందరు పడే పరిశ్రమకు మరి కొందరు విశ్రాంతిగా, వినోదంగా మారి సహకరించవలసి వుంటుంది. 'సాలభంజిక' చెప్పే చేదు నిజం అదే. స్త్రీ రచయిత రాసే ఉత్తమ కథకు ఇచ్చే రంగవల్లి స్మారక అవార్డు ఈ ఏడాది ఈ కథకు లభిస్తున్నది.

ప్రాపించక ప్రమాదం, స్థానిక అభివ్యక్తి ప్రపంచీకరణా, దాని వేయి చేతులూ అన్ని సామాజిక, ఆర్థిక వర్గాలకూ ఒకే రకంగా వుండనట్టే అన్ని ప్రాంతాలకూ ఒకే రకంగా వుండవు. అనేక చారిత్రక, రాజకీయ కారణాల వల్ల ఇంతకాలంగా వివక్షకు లోనయిన వర్షాధార ప్రాంతాలు, ఇతర బాధిత ప్రాంతాల ప్రజానీకాన్ని నిస్సహాయులను, నిరాధారులను చేయడంగా కనిపిస్తున్నది. విద్యుత్‌ సంస్కరణలు గురి పెట్టినదీ ప్రాంతాలకే. ఆత్మహత్యలూ, ఆకలిచావులూ జరుగుతున్నదీ ప్రాంతంలోనే. ప్రపంచీకరణ ప్రక్రియతో ఎంతో చురుకుగా కలిసి పని చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ పాలక వర్గాలు, బాధితులుగా ఉన్న ప్రజలు వేరువేరు ప్రాంతాలవారు కావడంతో తెలంగాణా వంటి అస్తిత్వ ఆకాంక్షలు అతి సహజంగా ప్రపంచీకరణను కూడా వ్యతిరేకిస్తాయి. ఈ సంవత్సరంలో తెలంగాణా నుంచి వచ్చిన కథా సాహిత్యం- తెలంగాణా నిర్దిష్ట సమస్యలను, తెలంగాణా వ్యక్తీకరణల ద్వారా చెప్పడానికి ప్రయత్నించినట్టు కనిపించినా- అది తన పరాధీనతకు, అంతర్గత వలసీకరణకు ఉన్న అంతర్జాతీయ పార్శ్వాలను అన్వేషించడమే. తన స్వయం నిర్ణయాధికార ఆకాంక్ష సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో అంతర్భాగమేనని చెప్పడమే. శ్రీధర దేశ్‌పాండే రాసిన 'మరే కిసాన్‌', బోధనం నర్సిరెడ్డి రాసిన 'పేగుబంధం' తెలంగాణ వ్యవసాయ సంక్షోభాన్ని, అమెరికా ఎండమావి మింగుతున్న తెలంగాణా నేలను సూచిస్తాయి. కాసుల ప్రతాప రెడ్డి రాసిన 'హత్య' అన్న కథ- కోస్తాంధ్ర విద్యా వ్యాపార సంస్థలలో చేరి చదువుల పందెంలో సాటివారితో నెగ్గలేక న్యూనపడి ఆత్మహత్యలు చేసుకుంటున్న తెలంగాణ విద్యార్థుల మరణాలు 'హత్యలే' అని నిర్ధారిస్తుంది. పారిశ్రామిక విప్లవం సృష్టించిన బీభత్సాలకు కుంగిపోయి, గతించిన ప్రకృతి సౌందర్యాన్ని, అలనాటి గ్రామీణ జీవిత నిసర్గతను కీర్తించిన యూరోపియన్‌ కాల్పనిక కవుల పరిస్థితిలో ఇప్పటి తెలంగాణా సృజనాత్మకత ఉన్నది. ఇరవై ముప్పయ్యేళ్ల కిందటి దాకా తెలంగాణాలో సజీవంగా ఉన్న అనేక సాంస్కృతిక విశేషాలు ఇప్పుడు పూర్తిగా అంతరించడంతో ఒక రకమైన బెంగతో రాస్తున్న కవిత్వం చాలా వస్తున్నది. బెంగతో పలవరిస్తే కవిత్వానికి సరిపోతుందేమో కానీ, సంస్కృతితో పాటు ధ్వంసమవుతున్న అనేక బతుకు తెరువులను, దీన్నంతటినీ సాధ్యం చేస్తున్న ఒక రాజకీయార్థిక పరిస్థితిని గుర్తించకపోతే కథ రాయడం కష్టమే. పెద్దింటి అశోక్‌కుమార్‌ రాసిన 'గోస' ఆ ప్రయత్నం చేసింది. పోరాటవాదులయిన మిలిటెంట్లు, రాజ్యహింస ఆవరించిన గ్రామ జీవితంలో సాధనాశూరులనే ఒక కులాధార కళాకారుల కులం ఎలా నిరాశ్రయమైందో కథకుడు ఆ కథలో చిత్రించాడు. తెలంగాణ జీవిత సంక్షోభాన్ని చిత్రిస్తున్న కథకులలో బెజ్జారపు వినోద్‌కుమార్‌ను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలాగే సిరీస్‌గా రాసిన కథలయినప్పటికీ- కలువకొలను రామమోహన్‌రాజు రాసిన వాటర్‌షెడ్‌ కథలు ప్రపంచీకరణ, స్వర్ణాంధ్రప్రదేశ్‌ తరహా అభివృద్ధి నేపథ్యంలో ఎంతో ప్రాధాన్యం ఉన్న కథలు.

కాశీభట్ల వేణుగోపాల్‌, పి. రామకృష్ణ, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, చిలుకూరి దేవపుత్ర, సింగమనేని నారాయణ, కొమ్మిశెట్టి మోహన్‌, జి. ఉమామహేశ్వర్‌, లెనిన్‌ ధనిశెట్టి, హరికిషన్‌- మొదలైన రాయలసీమ కథకుల కథలు ఈ ఏడాది ప్రచురితమయ్యాయి. కర్నూలు ప్రాంత కథకుల కథాసంకలనం 'కథాసమయం' ఈ ఏడాది వివిధ రచయితల సంకలనాలో ఒకటి. ప్రాంతీయ అభివ్యక్తి, సమస్యల రీత్యా సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి 'ప్రతిమల మంచం' ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది. అలాగే 'కథాసమయం'లో కనిపించిన కొత్త రచయిత ఇనాయతుల్లా రాయలసీమ ముఠాఘర్షణల వల్ల జరిగే వలసను ఇతివృత్తంగా తీసుకుని రాశాడు. ఉత్తర తెలంగాణా గ్రామాలలో ఎన్ని కారణాల వల్ల దేశాంతర వలస జరుగుతుందో పెద్దింటి అశోక్‌కుమార్‌ అనేక కథలు రాశాడు. ఇంకా రాస్తున్నాడు.

ప్రపంచీకరణ ప్రభావం పరోక్షంగా కూడా పని చేస్తున్నది. కథలలో పూర్తి స్థానిక అభివ్యక్తి వుండడం, స్థానికమయిన భాష వుండడం, ప్రత్యేక సాంస్కృతిక విశేషాలను, విశిష్టమైన జీవన విధానాలను ఇతివృత్తంగా చేసుకోవడం- ఇవన్నీ కూడా కథా రంగంలో విస్తృతంగా కనిపిస్తున్నాయి. గూడ అంజయ్య రాసిన 'అదే మీరయితే' కథ నిజాం కాలంనాటి భూస్వామ్య దోపిడీని చిత్రించినా, కె.వి. నరేందర్‌ 'దొరుంచుకున్న దేవక్క' నిన్నటి వాస్తవికతకు కొనసాగింపుగా కనిపించినా, రెడ్డి ఉపకులాల అంతరాలను ఇతివృత్తంగా కాసుల ప్రతాప రెడ్డి 'పక్షులెగిరిపోయిన తోట' రాసినా- ఇవన్నీ తెలంగాణ సమస్య మీద రాసిన కథలు కాకపోయినప్పటికీ, తెలంగాణా వాస్తవికతను చిత్రించిన కథలు. కాలువ మల్లయ్య, పులుగు శ్రీనివాస్‌ రాసిన అసంఖ్యాకమైన కథలు, కతన సాహిత్యానికి దగ్గరగా వున్న వుప్పల నరసింహం 'తెలంగాణా స్వగతాలు' కూడా ఈ కోవలోకి వస్తాయి.

వామపక్ష అభ్యుదయవాదం లాగానే దళిత, స్త్రీవాదాలు కూడా తెలంగాణకు 'వలస' వచ్చిన సిద్ధాంతాలు అనే ఒక అభిప్రాయం వున్నది. స్త్రీవాదం వల్ల తమ 'పురుష'త్వానికి ఎదురయ్యే సవాల్‌తో పాటు, తెలంగాణా ప్రాంత స్త్రీల సమస్యలు ఆ వాదంలో ముఖ్యమైన భాగం కాలేకపోతున్నాయన్న ఆవేదన కూడా తెలంగాణ పురుషులలో అటువంటి భావనలకు ఆస్కారమిస్తున్నది. కథన సాహిత్యానికి ఎంతో అనువైన సంక్లిష్ట సందర్భాలు కలిగి వున్న ఆ సంఘర్షణలను ఒకరిద్దరు తెలంగాణా కథకులు గట్టిగానే పట్టించుకున్నారు. కాసుల ప్రతాప రెడ్డి కథ 'లవ్‌ 2020' ప్రేమికురాలి నుంచి ఎదురయ్యే 'మితిమీరిన' ఒత్తిడిని నిర్దాక్షిణ్యంగా తోసిపుచ్చి, భార్య దగ్గరికే వెళ్లిపోయే కథా నాయకుడిని ఎంతో సానుకూలంగా చిత్రిస్తుంది. పులుగు శ్రీనివాస్‌ 'చుడీదార్‌ పిల్ల' ఏకంగా కొన్‌ఇన ఆపాదనలు కూడా చేస్తుంది. తెలంగాణా పురుషుడిది బాధిత అస్తిత్వమే, కోస్తా స్త్రీది కూడా బాధిత అస్తిత్వమే. ఇద్దరు బాధితుల మధ్య ఉన్న సంబంధంలోని ఉద్రిక్త పార్శ్వాన్ని అధికం చేసి చూపించడం వాంఛనీయం కాదు. గతంలో స్త్రీవాదులకూ దళితవాదులకూ కూడా తరచు ఇటువంటి సందర్భాలు ఎదురయ్యాయి. కవిత్వంలో కనిపించేంత ఆవేశకావేశాలకు కథలలో స్థానం వుండనప్పటికీ- ఈ సందర్భంలో కథకులు కొంచెం జాగ్రత్త వహించడం అవసరమినిపిస్తుంది. అయితే, మానవ సంబంధాలు, సామాజిక సంబంధాలు కలగలిసిన ఈ సంక్లిష్ట ఇతివృత్తాలను కథకులు మాత్రం ఎప్పుడూ నిరకారించకూడదు. ఆ ఇతివృత్తాలను బాధ్యతతో నిర్వహించాలి. అలాగని, యాంత్రికమైన చైతన్యంతో కథలకు ముగింపులు పలకనక్కరలేదు!

వార్షిక సంకలనాలుఈ సంవత్సరం అచ్చయిన 2000 వార్షిక కథా సంకలనాలు కథా రంగ వాతావరణంలో అనేక వివాదాలకు, చర్చలకు కారణమయ్యాయి. ప్రచురణకర్తలు, సంపాదకులు బహిరంగంగా అంగీకరించకపోయినా, వాసిరెడ్డి నవీన్‌- పాపినేని శివశంకర్‌ సంపాదకత్వంలో వచ్చే కథా సిరీస్‌నూ, తెలుగు యూనివర్శిటీ ప్రచురణగా జయధీర్‌ తిరుమలరావు సంపాదకత్వంలో వెలువడే తెలుగు కథ సిరీస్‌నూ పోటీ సంకలనాలుగా పాఠకులు, కథా రచయితలు పరిగణిస్తున్న మాట నిజం. తెలుగుకథ- 2000, కథ 2000 సంకలనాలలో సంపాదకుల ఎంపిక దాదాపుగా భిన్నంగా వుండడం ఈ సందర్భంగా గమనార్హం. ఈ రెండు సంకలనాలతో పాటు, విజయవాడ నుంచి కథసమయమూ, సందర్భమూ అన్న సంకలనం 2000 సంవత్సరం చివరలోనే వచ్చింది. ఒక సంవత్సరంలో వచ్చిన ఎంపిక చేసిన కథలను- కథకుడు చెప్పే కథానేపథ్యమూ, విమర్శకుడి వ్యాఖ్యలతో పాటు ప్రచురించే ఈ కొత్త తరహా సంకలనాన్ని ప్రతి యేటా తేవాలన్న సంకల్పం ప్రచురణకర్తలకు ఉన్నది. (2001 సంవత్సరపు ప్రయత్నం ఇంకా జరగలేదు మరి) ఈ సంకలనంలోని ఎంపిక కూడా భిన్నంగా ఉన్నది. వార్షిక సంకలనాలు అనేకం వస్తాయన్న స్పృహ- కథా సాహిత్య రంగంలో అధిక ప్రజాస్వామ్యాన్ని సాధ్యం చేస్తుంది. ఎంపిక విషయంలో ఏ ఒక్కరికో అవాంఛనీయమైన అధికారం వుండకుండా ఇది నివారిస్తుంది. చాలా కాలంగా వార్షిక సంకలనాలు తీస్తున్నందువల్ల సంక్రమించిన అవలక్షణాలు ఏవైనా వుంటే- ముఖ్యంగా కథా సాహితి సిరీస్‌కి- వాటి నిరోధానికి పనికి వచ్చే విమర్శనాత్మక ప్రత్యామ్నాయాలు అందుబాటులో వుంటాయి. ఈ ఊడు సంకలనాలు కూడా కొన్ని కథల ఎంపిక విషయంలో చేసిన పొరపాట్లు (ముఖ్యంగా అనర్హమైనవి చేర్చడంలో కాక, అర్హమైనవాటిని మినహాయించడంలో) సాధారణమైనవి కావు. ఈ సంకలనాలలోకి వేరువేరు కథలు రావడం వల్ల ఎక్కువ మందికి ప్రాతినిధ్యం దొరికే మాట నిజమేకానీ, ఈ సంకలనాల ఉద్దేశం అది కాదు. 'ఉత్తమమైన' కథలను ప్రచురిస్తున్నామని చెప్పే సంపాదకుల మధ్య ఇంతటి అభిరుచి వైవిధ్యం వుండడం అనుమానాస్పదం. ప్రాంతీయతలు, కథకుల సామాజిక నేపథ్యం, కథలోని ఇతివృత్తానికి సంబంధించిన రాజకీయ, సామాజిక నేపథ్యం, రచయిత ఉపయోగించిన స్థానిక భాషతో సంపాదకులకుండే పరిచయం, వ్యక్తిగతమైన ప్రాధాన్యాలు- ఇటువంటి అనేక అంశాలు సాహిత్య 'ఉత్తమ'త్వాన్ని నిర్ణయిస్తాయి. అన్ని స్థలాల తెలుగు సాహిత్యాన్ని ఒకే గొడుగు కింది పరిశీలించడంలో వివక్ష తప్పదని గమనించిన 'బాధిత ప్రాంతాలు' తమ వికాసాన్ని తమ చేతులలోకి తీసుకోవాలనుకుంటున్నాయి. ఈ సంవత్సరం నుంచి తెలంగాణా కథల ప్రత్యేక సంకలనం తీయాలని జరుగుతున్న ప్రయత్నాలు- ఈ వాతావరణానికి కొత్త పార్శ్వాన్ని జోడిస్తాయి.

ఇక అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్రుల తెలుగు కథను ప్రోత్సహించడం- ఒక పోషకత్వంగా అభ్యంతరకరమైనదేమీ కాదు కానీ- ఆ ప్రోత్సాహంలో ఉన్న పోటీ అది సృస్టిస్తున్న అవాంఛనీయ ప్రలోభాలు, ఇంకా అనేకానేక అనుబంద అవలక్షణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బమ్మిడి జగదీశ్వర రావు రాసిన 'పందెపు పోతులు' ప్రత్యేకంగా ప్రస్తావించదగ్గది. ఈ సంవత్సరం 'తానా' పోటీలో బహుమతి పొందిన కథల ఎంపిక కూడా పూర్తిగా వివాదాలకు వెలిగా లేదు. అంతేకాక, తెలుగు ఉమ్మడి సాహిత్య ఛత్రం కింద అమలు జరిగే వివక్షలు 'ప్రవాసాంధ్ర' పోషకత్వంలో మరింతగా స్థిరపడతాయని, బలపడతాయని తెలంగాణా ప్రాంత సాహిత్య రంగం అనుమానిస్తున్నది. ఒక వైపున అమెరికా ప్రవాసాంధ్రుల కథా సాహిత్య పోషణ మూడు పోటీలు ఆరు ప్రైజులుగా వర్ధిల్లుతుండగా, పరమ స్థానికమైన కథల పోటీలు చిన్న స్థాయిలోనైనా ప్రారంభం కావడం విశేషం. తెలంగాణాకు చెందిన మహోన్నత కథా, నవలా రచయిత, దాదాపుగా విస్మృతుడు వట్టికోట ఆళ్వారుస్వామి పేరిట సిద్ధిపేట నుంచి ఒక తెలంగాణా స్థాయి కథా పోటీలు జరిగాయి. కథల కాలం 2000 సంవత్సరం అయినా, ప్రథమ పురస్కార కార్యక్రమం ఈ సంవత్సరంలో జరిగింది. పెద్దింటి అశోక్‌కుమార్‌ కథ 'వలసపక్షి' ఈ బహుమానాన్ని అందుకుని వట్టికోట ఆళ్వారుస్వామి సాహిత్య, స్థానిక, రాజకీయ వారసత్వాలను మరొక్కమారు ఆవిష్కరించింది.

వంద సంవత్సరాల తెలుగు కథల నుంచి వాడ్రేవు చిన వీరభద్రుడు ఎంపిక చేసిన వ్యాఖ్యానించిన 'వందేళ్ల తెలుగు కథ' ఒక విశిష్టమైన ప్రచురణ. ఎమెస్కో ప్రచురణగా వెలువడిన ఈ సంకలనంలో సంపాదకత్వం మీద విమర్శ వున్నప్పటికీ తెలుగు సమాజాల గమనాన్ని అర్థం చేసుకోవడానికి వీలుగా వీరభద్రుడు నిర్మించిన కథా సాహిత్య చరిత్ర ఆసక్తికరంగా వుంటుంది.

ఒక రచయిత విడి కథా సంకలనాలు ఈ సంవత్సరం చాలానే వచ్చాయి. 'కాళోజీ కథలు', ముదిగంటి సుజాతారెడ్డి 'మింగుతున్న పట్నం', బోయ జంగయ్య 'బోజకథలు', ఓల్గా 'భిన్న సందర్భాలు', కుప్పిలి పద్మ 'సాలభంజిక', 'కాశీభట్ల వేణుగోపాల్‌ కథలు', పులుగు శ్రీనివాస్‌ 'సంకర విత్తులు', చైతన్యప్రకాశ్‌ 'రేణ', హరికిషన్‌ 'నయాఫత్వా' ఈ ఏడాది ప్రచురితమైన అసంఖ్యాకమైన విడి కథాసంకలనాలలో కొన్ని మాత్రమే. పెద్దింటి అశోక్‌కుమార్‌ 'వలసపక్షి', ఖదీర్‌బాబు 'ఖాదర్‌ లేడు' ఒకే కథతో పుస్తకంగా వెలువడ్డ ప్రచురణలు. ప్రత్యేకంగా చెప్పుకోవలసిన ప్రచురణ సౌదా రాసిన 'అపూర్వ పురా గాధలు'. స్పష్టమైన బ్రాహ్మణవాద వ్యతిరేకతతో, ప్రత్యేకమైన రచనా శైలి, విశిష్టమైన పుస్తక ప్రచారంతో సౌదా తన రచనను విస్తృతంగా పాఠకులకు అందించగలిగాడు. దళితవాదపు ప్రభావంతో పురాణ కథల పునర్‌ కథనం కొద్దిగా పాతపడిన మాట నిజమే కానీ, సౌదా ఆశ్చర్యకరమైన శైలి ఆ పరిమితిని చాలా వరకు అధిగమించింది.

ఈ సంవత్సరం కథారంగ విశేషాలలో సంచలనాత్మకమైనది స్కైబాబ 'సుల్తానా' మీద జరిగిన చర్చ. ఆ కథలో హిందూ ముస్లిం పాత్రల సాధారణీకరణ గురించి వివాదం చిలికి చిలికి 'హర్యాలీ' పుస్తకంగా రూపొందింది. ఆ కథ మీద అభ్యంతరం చెప్పినవారు చాలా మంది ఉన్నప్పటికీ, ఆ కథను విమర్శిస్తూ ఒక పత్రికలో ఒక రచయిత స్కైబాబ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం వివాదానికి కారణమైంది. ఆ విమర్శలో సాహిత్యేతరమైన ఆపాదనలు ఉండడం వల్ల రచయితలు, విమర్శకులు తీవ్రమైన నిరసనను తెలియజేశారు. ఆ నిరసన ఒక పుస్తక రూపంలో వెలువడింది. స్కైబాబ కథకు జవాబుగా హరికిషన్‌ 'నయా ఫత్వా' అన్న చిన్న కథల పుస్తకం తీసుకు వచ్చాడు. ముస్లింలతో ముడిపడిన కథావస్తువుతో రాసిన కథలలో 'సుల్తానా', 'ఖాదర్‌ లేడు'తో పాటు డాక్టర్‌ వి. చంద్రశేఖర్‌ రావు రాసిన 'సలీం సుందర్‌ ప్రేమకథ' కూడా ముఖ్యమైనంది. సెప్టెంబర్‌ 11 తరువాతి పరిణామాలతో ముస్లిం అస్తిత్వం అంతర్జాతీయంగా తీవ్ర సమస్యాత్మకం అయిన సమయంలో చంద్రశేఖర్‌ రావు కథకు అదనపు ప్రాసంగికత వున్నది.

మరికొన్ని- చాలా కాలం తర్వాత దేవరాజు మహారాజు కథ రాయడం. 1970లలోనే తెలంగాణ కథకు పాదు వేసిన రచయిత ఆయన. విశిష్ట రచయిత కాశీభట్ల వేణుగోపాల్‌ కథకుడిగా కథరూపంలోనో, కథా విమర్శలో భాగంగానో ఈ ఏడాది తరచు తారసపడ్డారు. బమ్మిడి జగదీశ్వరరావు పోటీ కథల ప్రలోభాల మీద కథ రాసి, రానున్న కాలంలో కథాసాహితి విషయంలో 'నిబద్ధ' రచయితల వైఖరిని సూచన ప్రాయంగా చెప్పారు. పురుషోత్తం హత్య ఇతివృత్తంగా కూర్మనాథ్‌ రాసిన కథ 'ఒక జననం తరువాత' మంచి పాఠకాభిమానాన్ని సంపాదించింది. ఈయనను, జగదీశ్వరరావును, అప్పల్నాయుడును మినహాయించి- ఉత్తరాంధ్రలో పెద్దగా కదలిక కనిపించడం లేదు. రాస్తూ వున్నవారు ఈ ఏడు రాసినట్టు లేరు. ఇండియా ఇన్ఫో డాట్‌ కామ్‌లో ఈ ఏడాది మూడు ఎన్నారై కథలు 'అచ్చయ్యాయి'. నల్లగొండ సీనియర్‌ కథకులు ఎన్‌కె రామారావు గ్లోబలైజేషన్‌ మీద ఒక వ్యంగ్య కథ రాశారు. బి.యస్‌.రాములు ఈ ఏడాది కత రాయకపోగా, తెలంగాణా కథకు ప్రాతినిధ్యం సంగతి అటో ఇటో తేలిపోవాలన్నట్టు కథా సాహితి సిరీస్‌ మీద విమర్శల దండెత్తారు. తెలంగాణా కథలను ప్రారంభం నుంచి సంకలనాలుగా ప్రచురించాలని ఆయన ఆలోచన.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి