ఆధునిక సాహిత్యంలో హాస్యం

Posted By:
Subscribe to Oneindia Telugu

ఆధునిక సాహిత్యంలో హాస్య ప్రాధాన్యత పెరగడం గమనించవచ్చు. ఈ కాలపు రచయితలు ఆంగ్ల సాహిత్యం చేత ప్రభావితులైనవారు. ఆంగ్ల రచయితలు హాస్యానికిచ్చిన ప్రముఖ స్థానాన్ని వీరు గమనించారు. చెప్పదలచిన విషయాన్ని సున్నితంగా, సరసంగా, ఆకర్షణీయంగా చెప్పడానికి హాస్యం ఉపయోగపడుతుందని గుర్తించారు. అందువల్లే హాస్య ప్రధాన రచనలు అనేకం ఈ కాలం నుంచి రచించబడుతూ వచ్చాయి.

నవ్యాంధ్ర సాహిత్య ప్రక్రియలకు స్థితిని, ప్రాచుర్యాన్ని కల్గించిన కందుకూరి వీరేశలింగం గారు హాస్య ప్రియులు. ఏ విషయం గురించి రాసినా హాస్య ధోరణిలో రాయగల సమర్థులు. అయితే హాస్యాన్ని కేవలం వినోదం కోసం కాక సంఘ సంస్కరణోద్యమానికి అస్త్రంగా ప్రయోగించారు. కందుకూరి ఎన్నో ప్రహసనాలు, నాటకాలు, నవలలు, వ్యాసాలు రాశారు. అన్నింటిలోను సంఘంలోని అవినీతిని, మూర్ఖత్వాన్ని, ఆలోచనా రాహిత్యాన్ని వ్యంగ్యంగా ఎత్తి చూపుతూ అపహసించడం కనిపిస్తుంది. వీరి 'సత్య రాజ పూర్వ దేవ యాత్రలు' తెలుగులో వ్యంగ్య ప్రధాన హాస్య నవలలకు శ్రీకారం చుట్టింది. చిలకమర్తి లక్ష్మీ నరసింహంగారు కూడ సహజంగా హాస్య ప్రియులు. హాస్య పూరితమైన ప్రహసనాలు, 'గణపతి' అనే హాస్య నవలే కాక 'వినోదములు', 'నవ్వుల గనులు' పేరుతో 'జోక్స్‌', హాస్య వృత్తాంతాలు సంకలనం చేశారు. జనంలో వాడుకలో ఉన్న హాస్య వృత్తాంతాలను ఒక చోట కూర్చడం చిలకమర్తిగారితోనే ప్రారంభమయిందనవచ్చు.

ఈ కాలంలో కూడ హాస్య కావ్యాలుగా పేరుకెక్కిన అధిక్షేప కావ్యాలు రచించబడ్డాయి. తిరుపతి వేంకట కవుల 'గీరతం' ఈ కోవకు చెందినదే. ఇలాంటిదే శ్రీరాములు గారి 'తెలుగునాడు'. దీనిలో వివిధ బ్రాహ్మణ శాఖల వేషం, భాష మొదలైన వాటిని అనుకరణ ద్వారా అవహేళన చేయడం జరిగింది. అభినవ వికటకవిగా పేరు పొందిన అనంతపంతుల రామలింగస్వామి గారి 'శుక్లపక్షము' సరసమైన హాస్యాన్ని అందిస్తుంది. కృష్ణశాస్త్రి 'కృష్ణపక్షము'ను అధిక్షేపిస్తూ చేసిన రచన ఇది. 'భావ కవిత్వము' అనే ఖండికలో-
"...... అప్ప కవి సెప్పినది యెల్ల దప్పవలయు
నరయు గర్ణద్వయము గప్పియాడు కురులు
పెంచవలె నూత్న వేషంబు వేయవలయు..."

అంటూ భావ కవి వేషభాషలను పరిహసిస్తారు రచయిత. భోగరాజు నారాయణమూర్తి గారి 'పండుగ కట్నం' ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరిస్తూ రాసిన హాస్య కావ్యం. 'శరభ రాజు' అనే పిసినిగొట్టు వృత్తాంతం దీనిలో హాస్యాన్ని చిందిస్తూ, హాస్య ప్రధానంగా రాయబడిన ఇలాంటి కథాకావ్యం తెలుగులో మరొకటి లేదని చెప్పవచ్చు.

'హాస్య కవితాగ్రేసరుడు' పానుగంటి లక్ష్మీ నరసింహరావు గారి నాటకాలన్నీ హాస్య రసం అంతో యింతో కలిగి వున్నవే. వానిలో 'కంఠాభరణము', 'వృద్ధ వివాహము' అనే నాటకాలు హాస్య పూరితాలు. వీరి సాక్షి వ్యాసాల్లో కూడ హాస్యం అంతర్వాహినిలా ప్రవహిస్తూ వుంటుంది. సాక్షి సంఘ సభ్యుల్లో ఒకడైన కాలాచార్యుడిని వర్ణిస్తూ రచయిత ".... ఈతని తల పెద్దది. గుండ్రని కనులుండుటచే, ముక్కు కొంచెము వెనుకాడుటచే, మొగము గుండ్రముగా నుండుటచే నీతడు నరులలో బుల్‌ డాగ్‌ జాతిలోని వాడు. ఈతడు మాటలాడిన మొఱిగినట్లుండును" అంటారు. ఇలాంటి హాస్య రచనా ధోరణి 'సాక్షి' వ్యాసాల్లో సర్వత్రా కనిపిస్తుంది. గురజాడ అప్పారావుగారి 'కన్యాశుల్కం' సంఘ సంస్కరణాభిలాషతో రచింపబడింది. అయినా దీనిని హాస్య ప్రధాన నాటకంగా చెప్పుకోవచ్చు. సంభాషణల్లో, సంఘటనల్లో, రచనా ధోరణిలో, పాత్రపోషణలో హాస్యం చిందులాడుతుంటుంది. ఇంగ్లీషు, తెలుగు పదాలు కలుపుతూ భాషా వికృతి వల్ల గిరీశం పాత్ర ద్వారా మంచి హాస్యం సృష్టించారు రచయిత. ఉదాహరణకొకటి-
"ఫుల్లు మూను లైటటా
జానమిన్ను వైటటా
మూను కన్న
మొల్ల కన్న
నీదు మోము బ్రైటటా
టా! టా! టా!"

వేదం వెంకటరాయశాస్త్రిగారి చారిత్రక నాటకం 'ప్రతాపరుద్రీయం'లో శుద్ధ హాస్యం కనిపిస్తుంది. పండిత హాస్యం మొదలు పామర హాస్యం వరకూ కల విభేదాలన్నిటితోను హాస్యం దీనిలో పోషించబడింది. శ్రీపాద కామేశ్వరరావు గారి 'క్రొత్తల్లుడు' మొదలైన ప్రహసనాలు సరసమైన హాస్యాన్ని అందిస్తున్నాయి.

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఎన్నో హాస్య రచనలు చేశారు. ముఖ్యంగా వీరి ఏకాంకికలు, కథల్లో చక్కని హాస్యం పోషించబడింది. ముట్నూరి కృష్ణారావుగారు 'యమలోకపు జాబులు', 'వడగళ్లు' అనే శీర్షికలతో కృష్ణా పత్రికలో హాస్యపూరిత వ్యాసాలు రాశారు. అడవి బాపిరాజుగారి 'కోనంగి'లో రచనా ధోరణిలో, ప్రధాన పాత్ర పోషణలో హాస్యదృష్టి కనిపిస్తుంది. అయితే ఇది నవల చివరి వరకు కొనసాగలేదు. మొక్కపాటి నరసింహశాస్త్రి గారు రచించిన 'బారిష్టరు పార్వతీశం' ఎక్కువగా సంఘటనాత్మక హాస్యంతో కూడుకున్న మంచి హాస్య నవల. ప్రసిద్ధులైన హాస్య రచయితల్లో భమిడిపాటి కామేశ్వరరావుగారు ఒకరు. వీరి చిన్న కథ, ఏకాంకిక, వ్యాసం మొదలైన రచనలన్నింటిలో హాస్యం ప్రధానంగా కనిపిస్తుంది. వాచాలత అతిశయోక్తి, మూర్ఖత వంటివి ఆధారంగా హాస్యం సృష్టించడంలో సిద్ధహస్తులు ఈ రచయిత. ఏకాంక నాటికల ద్వారా హాస్యాన్ని అందించడంలో విశ్వనాథకవిరాజు గారు ప్రసిద్ధులు. గుడిపాటి వెంకట చలంగారి రచనల్లో కూడ హాస్యం లభిస్తుంది. మునిమాణిక్యం నరసింహరావుగారి 'కాంతం' కథల్లో దాంపత్య జీవితంలోని మధుర హాస్యం అత్యంత సహజంగా, సరసంగా అందించబడింది. ''నేను ఒట్టి తెలివి తక్కువ వాడిననా నీ అనుమానం'' అని అడిగిన భర్తతో ''అహహ అనుమామేమీ లేదు గట్టి నమ్మకమే'' అంటుంది కాంతం. భార్యభర్తల మధ్య సాగే ఇలాంటి సరస, చమత్కార సంభాషణలతో నిండిన ఈ కథలు తలచుకున్నప్పుడంతా నవ్వు రాక మానదు. చింతా దీక్షితులుగారి హాస్య కథల సంపుటిలో చక్కని హాస్యాన్నందించే కథలున్నాయి. కొడవటిగంటి కుటుంబరావు రచనల్లో మనస్తత్వ పరిశీలనతో పాటు హాస్యం జోడించబడింది.

తెలుగువారికి వికాస శీలమైన హాస్యాన్ని అందించిన రచయిత ముళ్లపూడి వెంకటరమణ. పరమ రమణీయమైన శాబ్దిక హాస్యాన్ని సృష్టించి, మాటలకు కొత్త అర్థాలను కల్పించి పాఠకులకు గిలిగింతలు పెట్టడం ముళ్లపూడి మార్గం. పాత్రోచితమైన భాషాశైలులను ఉపయోగించడంలో దిట్ట. 'ముళ్లపూడి మార్కు' హాస్యం ఈయన రచనలన్నింటిలోను కనిపిస్తుంది. భావ, అభ్యుదయ కవిత్వాలకు ఊపిరి పోసిన కవులు దేవులపల్లి, శ్రీశ్రీలు హాస్యం సృష్టించడంలోనూ అంతటి సమర్థులే. జరుక్‌శాస్త్రి పేరడీలు హాస్యానికి ఆకరాలు.

ముప్పాళ రంగనాయకమ్మ 'అండాలమ్మ', 'స్వీట్‌హోమ్‌'ల ద్వారా హాస్యం సృష్టించారు. మునిమాణిక్యం హాస్యం లాగ సాంసారిక సంబంధమైన హాస్యాన్ని సృష్టించిన మరో రచయిత్రి శ్రీమతి నందగిరి ఇందిరాదేవి. సున్నితమైన హాస్యానికి ఈమె 'పేరులు- దారులు' వ్యాసం చక్కని ఉదాహరణ. రావి కొండలరావు, గొల్లపూడి మారుతీరావు, ఆదివిష్ణు, నండూరి పార్థసారథి మొదలైన రచయితలు హాస్య సమ్మిశ్రితమైన రచనలో ఆరితేరినవారే.

ప్రస్తుత కాలంలో హాస్యానికి మరింత ప్రాధాన్యత పెరిగిందని చెప్పవచ్చు. మాసపత్రికలు, వార పత్రికలు, దిన పత్రికల సంఖ్య క్రమంగా పెరుగుతూ రావడం దీనికి ఒక కారణంగా భావించవచ్చు. ఈ పత్రికల్లో హాస్య కథలో, ధారావాహిక రచనలో తప్పక చోటు చేసుకోవడం కనిపిస్తుంది. ప్రతికా ముఖంగా తమ రచనలను ప్రచురించి హాస్య రచయితలుగా పేరు పొందిన ఈనాటి రచయితల్లో యర్రంశెట్టి శాయి, మల్లిక్‌ మొదలైన రచయితలు ముఖ్యులు. ఈ విధంగా తెలుగు సాహిత్యంలో హాస్య ప్రాముఖ్యత క్రమంగా పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా నవల, నాటకం, కథ వంటి ఆధునిక ప్రక్రియల్లో హాస్యానికి ఉన్నత స్థానం లభించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి