కొత్త ముఠాకు ప్రాణం!

Posted By:
Subscribe to Oneindia Telugu

'కొత్త తరం... కొత్త స్వరం' శీర్షికన ఒక దినపత్రిక సాహిత్యం పేజీలో ప్రసేన్‌ ఓ వ్యాసం రాశారు. వాదాలతో సంబందం లేకుండా ఒక కొత్త తరం కవులు ముందుకు వచ్చారని ఆయన అన్నారు. అయిల సైదాచారి, రమణజీవి, ఎస్‌. జగన్‌రెడ్డి, ఎం.ఎస్‌. నాయుడు, పులిపాటి గురుస్వామి, తదితరులను కొత్త తరం కవులుగా ఆయన చెప్పారు. అయితే, అంతటితో ఆగకుండా ఇతర కవులపై ఆయన కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. ప్రసేన్‌ రాసిన ఈ వ్యాసంలో కొన్ని అభ్యంతరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రసేన్‌ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇప్పటికే ముఠాలుగా విడిపోయి భ్రష్టు పట్టిన సాహిత్యాన్ని మళ్లీ అదే దిశగా నడిపించేట్టుగా వున్నాయి. ఈ వ్యాసం మొదటి పేరాలో 'కొత్త కవులు పాత తరాన్ని తమ కవితా శక్తితో తోసిరాజంటున్నారు' అని అన్నారు. ఈ 'తరం' అనే పదం కానీ, ఆ అర్థం కానీ సాహిత్యానికి సంబంధించింది కాదు. చరిత్రను చెప్పేటప్పుడో, సాంఘిక స్థితిగతులను వివరించేటప్పుడో 'తరం' ప్రస్తావన వస్తుంది తప్ప సాహిత్యంలో కాదు. ఈ రోజుకు కూడా నన్నయ్య, గురజాడ, శ్రీశ్రీ, తిలక్‌ల కవిత్వాన్ని 'కోట్‌' చేస్తున్నామంటే ఇక 'తరం' ప్రస్తావనకు అర్థమెక్కడిది?

ఇటీవల 'కవిత్వం' పేరుతో ప్రసేన్‌, వంశీకృష్ణ, సీతారాం, అఫ్సర్‌ ఒక కవితాసంకలనాన్ని తీసుకు వచ్చారు. కవిత్వాన్ని కవిత్వంగానే గౌరవిద్దాం, కవిత్వంగానే గుర్తుంచుకుందాం అనే కాన్సెప్ట్‌తో ఈ సంకలనం వచ్చింది. ఇందులో ఏ కవితను ఎవరు రాశారు తెలియపరచకుండా కవర్‌ పేజీపై మాత్రమే పై నలుగురూ తమ పేర్లను ప్రకటించుకున్నారు. అదీ, చిరునామా కోసం మాత్రమే. ఈ సంకలనాన్ని చేతిలోకి తీసుకున్నాక నేను గొప్ప అనుభూతికి లోనయ్యాను. రాజకీయ పార్టీలలో కన్నా కవిత్వంలో ఎక్కువగా రాజకీయాలు ఉన్న ఈ రోజుల్లో కవుల పేర్లు లేకుండా కవితా సంకలనం రావడమంటే ఊహించలేని విషయమే. ఇంత మంచి ఆలోచనలకు బాట వేసిన వారిలో ఒకరైన ప్రసేన్‌ ఇప్పుడు హఠాత్తుగా మరో దిక్కు చూస్తున్నారు. కవిత్వాన్ని కాకుండా కవులనే ఎస్టాబ్లిష్‌ చేయాలనుకుంటున్నారు. కొత్త తరం- పాత తరం కవులుగా విభజించి మరి కొన్ని ముఠాలకు ఊపిరి పోస్తున్నారు.

ఇక్బాల్‌ చందు, ఎమ్మెస్‌ నాయుడు, రమణజీవి, సైదాచారి, పులిపాటి గురుస్వామి, జగన్‌ రెడ్డి, శ్రీకాంత్‌, దేశరాజు కవిత్వ స్వరూపాన్ని మార్చేసారని ప్రసేన్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో నాకు పేచీ లేదు. కాలానుగుణంగా సమాజంలో వస్తున్న మార్పులను అనుసరిస్తూ కవిత్వం ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటుంది. అందులో భాగంగా మనం చర్చించాల్సింది మారుతున్న కవిత్వ రూపాన్ని మాత్రమే. అంతకు మించి చర్చలను కవుల దాకా పొడిగిస్తే విషయం పల్చనవుతుందని ప్రసేన్‌ గ్రహిస్తే బావుంటుంది.

'చాలా కాలం ఏలిన స్టార్‌ కవులూ, నెంబర్‌ వన్‌ కవులూ ఇక పెన్ను మూత పెట్టేయొచ్చు' అని ప్రసేన్‌ చెప్పాల్సిన అవసరం లేదు. కొద్ది మంది కవులు మాత్రమే సాహిత్య పేజీలలో కనిపిస్తూ 'స్టార్‌' లెవెల్‌కు ఎదిగారంటే వారిలో, వారి కవిత్వంలో కనిపించాల్సిన సాహిత్య లక్షణాల కన్నా ముఠా సంస్కృతియే బలంగా పని చేసింది. ఈ విషయం ప్రసేన్‌కు తెలియదని నేను అనుకోను. అయినప్పటికీ శివారెడ్డి పెన్ను మూయాల్సిందేనని చెప్తున్నారంటే ఇంత కాలం శివారెడ్డి ఆక్రమించిన గద్దెను ఆయన కొడుకు శ్రీకాంత్‌కు లేదా ప్రసేన్‌ ఇష్టపడుతున్న మరికొంత మంది కవులకూ పదిలం చేయాలని అనుకుంటున్నట్లు అర్థం చేసుకోవాల్సి వుంటుందేమో!

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X