పార్ట్-23

Posted By:
Subscribe to Oneindia Telugu

రాంరెడ్డికి ఏదీ అంతుబట్టడం లేదు. అంత గందరగోళంగా, అయోమయంగానూ ఉంది. చర్చల అంశాన్ని ఎందుకు సాగదీస్తున్నారనే ఆలోచన నుంచి పుట్టిన గందరగోళం, అయోమయం అది. తనకెందుకీ ఆలోచన అని చాలాసార్లు అనుకన్నాడు. అంటీ ముట్టనట్లు వ్యవహరించడం వల్ల తాను హాయిగా వుండవచ్చుననేది ఆయనకు తెలుసు. అయినా అదో ఆరాటం. ఈ అరాటం ఎందుకు? ఎవరి కోసం? తన కోసమా, ప్రజల కోసమా? తానేదో ప్రజలను ఉద్ధరించడానికి ఉన్నానని తానెప్పుడూ అనుకోలేదు. అయితే ప్రజల పేరు చెప్పి అందుకు విరుద్ధంగా వెళ్తున్నట్లనిపించినప్పుడు మాత్రం అతని గుండె మండిపోతుంది. అలా మండడం నేరమని, అది ఘోరతప్పిదమని, అది క్షమార్హం కాదని అతనికి ఎప్పటికప్పుడు అనుభవంలోకి వస్తున్నదే. కుక్క తోక వంకర అనే సామెత ఇతనికీ వర్తిస్తుంది. తాను మాట్లాడడం, మాట్లాడకపోవడం అనేవాటిలో తన వ్యక్తిగత లాభనష్టాలు ఏవీ భాగం కాదు.

ఇదంతా తనకెందుకని తన ఆత్మను బుజ్జిగించి ఆఫీసు బయటకు వచ్చి ఇరానీ హోటల్‌ దారి పట్టాడు. హైదరాబాద్‌ను తలుచుకుంటే ఒక్కోసారి చాలా బెంగగా ఉంటుంది. హైదరాబాద్‌ మునుపటిలా అక్కున చేర్చుకునే తల్లిలా అనిపించడం లేదు. రక్తం పీల్చి పిప్పి చేసే బ్రహ్మరాక్షసిలా మారిపోతందేమోనని భయంగా ఉంది. అలా మారిపోతే రిక్షావాళ్లు, కూలీలు ఏమవుతారనేది అతని బెంగ. తనలాంటి వాళ్లు కుంటుతూనో, గునుస్తూనో కాలం వెళ్లదీయగలరు. ఇరానీ హోటల్‌లో అడుగుపెట్టేసరికి ఆ బెంగ పెరిగి పెద్దదైంది.

ఒకతను- రిక్షా కార్మికుడు కాబోలు, బన్‌ను చాయ్‌లో అద్దుకుంటూ తింటున్నాడు. మరో మూల ఇంకోతను దాల్‌ రైస్‌ తింటున్నాడు. మూడో వాడు తాను. హోటల్‌ యజమాని కౌంటర్‌లో కూర్పాట్లు పడుతున్నాడు. ఇంతకు ముందు ఇదే హోటల్‌ కిటకిటలాడుతూ ఉండేది. కూర్చోవడానికి సీటు దొరికేది కాదు. ఎందుకిలా అయిపోయింది. అంతా మారిపోయింది. అభివృద్ధి అన్ని రంగాల్లోనూ ప్రవేశించి పాతవాటిని మింగేస్తోంది. ఇరానీ హోటల్స్‌ ఒక్కటొక్కటే మాయమైపోతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ దర్శన్‌ల పేరిట టిఫిన్‌ సెంటర్లు వచ్చేస్తున్నాయి. ఈ టిఫిన్‌ సెంటర్లు దాల్‌రైస్‌ను, బన్‌లను అందించగలదా? దర్శన్‌లు అందించే ఆహారపదార్థాల ధరలు కూలీలకు, రిక్షా కార్మికులకు అందుబాటులో ఉంటాయా? ఉండవనేది స్పష్టమవుతూనే ఉంది.

తాను హైదరాబాద్‌కు వచ్చిన చాలా రోజులకు ఒక హైదరాబాదీ తననో ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న తనను ఎంత ఆశ్చర్యానికి గురిచేసిందో చెప్పడం కష్టం.
''హైదరాబాద్‌లో రిక్షాకార్మికులు ఎలా బతుకగలుగుతున్నారో తెలుసా?'' అని అతను వేసిన ప్రశ్న. తాను సమాధానం చెప్పలేకపోయాడు.
''ఇరానీ హోటళ్లే లేకపోతే వారు బతకడం కష్టమే'' అన్నాడు.
''ఎలా?'' ప్రశ్నించాడు రాంరెడ్డి.
''బన్‌, దాల్‌రైస్‌ తింటారు. అవే లేకపోతే వారికి తిండి కూడా దొరకేది కాదు'' అన్నాడతను.
ఆ సంభాషణ గుర్తు రాగానే అతని మనోవల్మీకాన్ని మబ్బులు కమ్మేశాయి. ఇప్పుడెలా అనేది అతని మథనం.

ఓ టేబుల్‌ దగ్గరకు వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు. టీ ఆర్డరిచ్చాడు. జేబులోంచి సిగరెట్‌ పాకెట్‌ తీసి ఓ సిగరెట్‌ బయటకు తీసి రెండు పెదవుల మధ్య బిగించాడు. మరో జేబులోంచి అగ్గిపెట్టె తీసి పుల్లను తీసి గీకి సిగరెట్టు అంటించి ఓ దమ్ము లాగి పొగ వదిలాడు. అయినా వీడని నిరుత్సాహం; అలసట. ఏ పనీ చేయకుండానే అలసట ఆవహించడం ఓ రోగం కావచ్చు అని అనుకున్నాడు.

టీ తాగేసి బయటకు వచ్చాడో లేదో ఎదురుగా ప్రమీల.
''నీ కోసం ఎంత వెతికానో!'' అంది తనను చూడగానే.
''ఎందుకు వెతకడం?'' అన్నాడతను.
''నువ్వు ఇరానీ హోటల్‌లో ఉంటావని ఎందుకనుకుంటాను'' అదేదో చేయరాని పని అన్న ధ్వని ఆమె మాటల్లో ఉందనిపించింది.
''ఇరానీ చాయ్‌ లేకపోతే హైదరాబాద్‌లో ఉండగలమా?!'' ఇది ఆమెకు చెప్పిన సమాధానమో, తనకు తాను వేసుకున్న ప్రశ్నో అతనికే అర్థం కాలేదు.
''పద'' అంది.
''ఎక్కడికి?'' అడిగాడు.

''ఎప్పుడూ ఈ దుమ్ములో ఈ ధూళిలో ఏం కొట్టుకుంటావు. అలా నెక్లెస్‌ రోడ్డు వైపు వెళ్దాం'' అంది. ఈ నెక్లెస్‌ రోడ్డు రావడం కూడా అతనికి ఏ మాత్రం ఇష్టం లేదు. కృత్రిమంగా తయారు చేసేవి మనిషికి ఆహ్లాదాన్ని పంచలేవని అతనెందుకో అనుకుంటాడు. అక్కడ మనిషిని ప్రశాంతంగా కూర్చోనిస్తారా? చేపల మార్కెట్‌లా ఉంటుంది. ప్రశాంతంగా ఉండదు. ఎక్కడో పచ్చని చేల మధ్య ఒంటరిగా కూర్చుంటే తన బాధ తీరేట్లు లేదు. తాను మార్పును వ్యతిరేకిస్తున్నాడా? ప్రతి మార్పు మానవాళికి వ్యతిరేకమైందనే భావన తనలో తనకు తెలియకుండానే నాటుకుపోయిందా? ఇలా అనుకునేసరికి ''తీవ్రవాదం అభివృద్ధికి ఆటంకం. తీవ్రవాదం నశిస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుంది'' అనే ముఖ్యమంత్రి మాటలు గుర్తొచ్చాయి. అలా గుర్తు వచ్చినందుకు అతను కాస్తా చిరాకు పడ్డాడు కూడా. ఎటు తిరిగి ఆలోచనలు అటే వెళ్లడం అతనికి ఏ మాత్రం రుచించడం లేదు. ఇద్దరూ నడుస్తున్నారు. ఆఫీసు పార్కింగ్‌ వద్దకు వచ్చి టూవీలర్‌ బయటకు తీశాడు. అతను బండి స్టార్ట్‌ చేశాడు. ఆమె వెనక కూర్చుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి