పార్ట్-30

Posted By:
Subscribe to Oneindia Telugu

''టీ తాగేసి ప్రెస్‌ గ్యాలరీలోకి వెళ్దాం'' చెప్పాడు కృష్ణ. ఇద్దరూ అటు వైపు నడిచారు. లాబీలో క్యాంటిన్‌ ఉంది. కానీ వీరిద్దరూ కలిస్తే ఎప్పుడూ అక్కడ టీ తాగారు. లాబీలో ఉన్న క్యాంటిన్‌కు వెళ్తే అక్కడ ఎమ్యెల్యేలు, పైరవీల కోసం వచ్చే పొలిటీషయన్స్‌ పలకరిస్తూ ఉంటారు. అందుకని అసెంబ్లీ ఆవరణలోనే ఉన్న రెండో క్యాంటిన్‌కు వెళ్తూ ఉంటారు.

''మన పత్రికలకు వేడివేడి బజ్జీలు కావాలి. అందుకని మనం రాసే వార్తలను అచ్చేస్తారు'' అన్నాడు కృష్ణ. అతని అబ్జర్వేషన్స్‌, చేసే కామెంట్స్‌ కొత్తగా ఉంటాయి. వెంటనే ఎదుటి మనిషిని ఆకట్టుకుంటాయి. అతని మాటలంటే రాంరెడ్డికి మహా ఇష్టం. సంచలనం కలిగించే వార్తల గురించి అతను ఆ కామెంట్‌ చేశాడని అర్థమవుతూనే ఉంది రాంరెడ్డికి.

క్యాంటిన్‌ బయట చెట్టు కింద అవినాశ్‌ కనిపించాడు. అవినాశ్‌ ఒక ఆంగ్ల దినపత్రిక రిపోర్టర్‌. వీరిద్దరిని చూసి విష్‌ చేశాడు. అతని దగ్గరకు వెళ్లి ముచ్చట్లలో పడిపోయారు. కొద్ది సేపటికి అక్కడ ఓ ఐదారుగురు చేరారు. రిపోర్టర్లందరూ కలిస్తే చాలు, వార్తల గురించి, ప్రభుత్వాల గురించి, తాజా పరిణామాల గురించి ఎవరి అభిప్రాయాలు వారే చెబుతుంటారు. రాజకీయాలను తామే నడిపిస్తున్నామనే భావన చాలా మంది రిపోర్టర్లలో ఉంటుంది. వచ్చే వారు వస్తున్నారు, వెళ్లిపోయేవారు వెళ్లిపోతున్నారు. మాట్లాడేవారు మాట్లాడుతూనే ఉన్నారు. అలా ఆఖరికి వీరిద్దరే చెట్టు కింద మిగిలిపోయారు.

''ఇదేమిటి? మనిద్దరమే మిగిలాం.'' అన్నాడు రాంరెడ్డి. ''అంతే. అంతా ఒక రొటీన్‌ వ్యవహారం. ఒకరి పట్ల ఒకరికి మెకానికల్‌ రిలేషన్స్‌ మాత్రమే ఉంటాయి. ఎవరొచ్చారో ఎవరు వెళ్లిపోయారో గమనించే స్థితిలో కూడా మనం ఉండం.'' అన్నాడు కృష్ణ. రాంరెడ్డి మాట్లాడలేదు.

''రసూల్‌ కూడా వచ్చి మనతో మాట్లాడే వెళ్లి వుంటాడు'' అన్నాడు కృష్ణ.

రాంరెడ్డి ఆశ్చర్యపోలేదు. చచ్చిపోయిన మనిషి మనతో మాట్లాడి వెళ్లాడంటే ఆశ్చర్యం వేయడం సహజం. కానీ కృష్ణ తత్వం తెలిసిన రాంరెడ్డికి ఆశ్చర్యం వేయకపోవడం కూడా అంతే సహజం. రాస్తే కృష్ణ మంచి సార్ట్‌ స్టోరీ రైటర్‌ అయి వుండేవాడు. కానీ రాయడు. చాలా అందంగా, ఆసక్తికరంగా కథలు చెప్పగలడు. అతను చెప్పే కథలను తీసుకుని పేపర్‌ మీద పెడితే మంచి మ్యాజిక్‌ రియలిజంతో కూడిన కథలవుతాయి. అదే విషయం చాలాసార్లు కృష్ణతో చెప్పాడు రాంరెడ్డి. 'నువ్వు కథారచయితవే కదా, రాయ రాదూ' అంటుంటాడు. అలాంటి కొన్ని కథలు రాసి సాహితీ ప్రపంచంలోని చాలా మందిని రాంరెడ్డి శత్రువులను చేసుకున్నాడు.

''రియల్లీ, రసూల్‌ వచ్చి మాట్లాడిపోయినా మనం ఇంతే ఉదాసీనంగా వుంటాం. ఒకరికొకరం పట్టం. మనకు మనుషులు ముఖ్యం కాదు. చర్చలు ఎప్పుడూ పండుతూ వుండాలి. మనకు కావాల్సింది అదే'' అన్నాడు.

రసూల్‌ ప్రస్తావన వచ్చేసరికి రాంరెడ్డి మనస్సు కలుక్కుమంది. ఓ అపరాధ భావన అతన్ని ఎప్పటికీ పీడిస్తూనే ఉంది. తాను చేసిన తప్పు ఏమీ లేదని ఎన్నిసార్లు మనసు సరిపుచ్చుకోవడం లేదు. అతను రాసిన కొన్ని న్యూస్‌ స్టోరీస్‌ను బ్లాక్‌ చేసి ఉంటే అతను బతికి వుండేవాడేమో అనిపిస్తూ వుంటుంది. అతను రాస్తున్న కొద్దీ తాను అచ్చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఎడిటర్‌ కూడా తనకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. తాను సిటీ స్పెషల్‌ ఇన్‌చార్జి అయిన తర్వాత హైదరాబాద్‌లో పత్రిక సర్క్యులేషన్‌ పెరిగింది. దాని వల్లనే ఎడిటర్‌ బహుశా జోక్యం చేసుకుని ఉండడు.

రాంరెడ్డి రసూల్‌ రాసే వార్తలను చూశాడే తప్ప వాటి వెనుక పొంచి వున్న ప్రమాదాన్ని పసిగట్టలేకపోయాడు. జర్నలిస్టుం తమకేం అవుతుందనే ధీమా కూడా పని చేసి ఉంటుంది.

రెండు రోజులుగా రసూల్‌ ఆఫీసుకు రాలేదు. అలా డ్యూటీ ఎగ్గొట్టడం రసూల్‌కు అలవాటే కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు రాంరెడ్డి. కానీ సూర్యుడు రక్తముద్దలా ఉదయిస్తాడని ఊహించలేకపోయాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X