వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిబద్ధత నష్టం చేసింది: పతంజలి

By Staff
|
Google Oneindia TeluguNews

వృత్తి రీత్యా జర్నలిస్టు అయిన కె.ఎన్‌.వై. పతంజలి ప్రవృత్తి రీత్యా సృజనాత్మక రచయిత. ఆయన కథలు, నవలలు మానవుల హిపొక్రసీపై చర్నాకోల విసురుతాయి. మొదటి దశలో రాసిన 'పెంపుడు జంతువులు', 'ఖాకీవనం' నవలలతో పాటు 'పిలక తిరుగుడు పువ్వు', 'గోపాత్రుడు', 'వీరబొబ్బలి' తదితర నవలలు, ఇంకా పలు కథలు ఆయనకు వచనంపై, వచన సాహిత్య రీతులపై వున్న పట్టే కాకుండా మానవ జీవిత పరిశీలనపై వున్న పట్టు అర్థమవుతుంది. వ్యంగ్యంలో అందెవేసిన చేయి అయిన రావిశాస్త్రి ప్రభావంతో ముందుకు వచ్చిన పతంజలి గురువును మించిన శిష్యుడు. ఆయన రచనలు హాస్యరస బీభత్స ప్రధానాలు. స్థిరీకృత వాదాలను వెనక్కి నెడుతూ ఆయన పలు కొత్త వాదనలు వినిపిస్తున్నారు. సృజనాత్మక వచన సాహిత్యం తెలుగులో వెల్లివిరియడానికి ఆయన చెబుతున్న విషయాలు టానిక్‌లు. ఆయన 'ఇండియా ఇన్ఫో'కు ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలు-

కథలు, నవలలు మీరు ఎందుకు రాస్తారు?
సహజంగా రాస్తాను. రాయకుండా ఉండలేను కాబట్టి రాస్తాను. నాకు రాయబుద్ధి అయితే రాస్తా. నా 11వ యేట నుంచే నాకు రాయడం అలవాటుంది. ఎదుటి వాళ్లకు ఏదైనా బోధించాలనుకునే దురహంకారం నాకెప్పుడూ లేదు. నా రచనల్లో తిట్లు వుండొచ్చు. కానీ తిట్టడానికే నేను రచనలు చేయలేదు. కథల వెనుక, నవలల వెనుక, పాత్రల వెనుక దాక్కోవడానికి నేను వ్యంగ్యాన్ని ఆశ్రయించలేదు. స్పష్టంగా జీవితంలో వున్నదే రచనల్లో చూపాను.

వ్యంగ్య సాహిత్యంలో మీదే ప్రధాన స్థానమా?
సాహిత్యంలో వ్యంగ్యసాహిత్యం అంటూ ప్రత్యేకంగా ఏదీ వుండదు. వ్యంగ్య సాహిత్యం, విషాద సాహిత్యం అంటూ ఇలా వర్గీకరించాల్సిన అవసరం లేదు. గురజాడ, రావిశాస్త్రి నా మీద బాగా ప్రభావం చూపిన రచయితలు. నా కన్నా ముందు తెలుగులో ఎందరో మహారచయితలున్నారు. వారందరి నుంచి నేను నేర్చుకున్నాను.

కన్యాశుల్కం అందరికీ అర్థమయింది కదా, మీ రచనలు, వానిలోని మాండలికం, ఉన్నతమైన వ్యంగ్యంతో కూడిన సంక్లిష్ట స్థాయి- అందరికీ అర్థం కావన్న అపవాదు వుంది కదా, మీ సమాధానం...కన్యాశుల్కం అందరికీ అర్థం కావడం గురజాడ గొప్పతనం. నా కథలు, నవలలు అందరికీ అర్థం కావడం లేదంటే అది నా వైఫల్యం. గురజాడ నిజంగా చాలా గొప్ప భాష తెలిసిన రచయిత. నేను కాదు. నిజంగా ఇప్పటికీ గురజాడను చదువుతుంటే ఇంత భాష, జీవితం తెలిసిన తెలుగు రచయిత మరొకడు లేడనిపిస్తుంది.

తెలుగు సాహిత్యంలో మీకు ఎక్కువగా- అంటే, రావలసినంత పేరు రాకపోవడానికి కారణం ఏమిటి?
తెలుగు నేల మీద సాహిత్యం కానిదే ఎక్కువగా సాహిత్యంగా ప్రచారంలోనికి రావడానికి ఎవరినీ తప్పు పట్టాల్సిన పని లేదు. రాకపోనీయండి- పెద్దగా వచ్చిన నష్టం ఏమీ లేదు. అయినా పేరు రావాలని నేను రచనలు చేయలేదు. చెడును, దుర్మార్గాన్ని వెక్కిరిస్తే నాకు సంతోషం. అన్యాయాన్ని బజారుకీడిస్తే ఆనందం. అందుకే నా తృప్తి కోసమే, నన్ను నేను సంతోషపరుచుకోవడానికే ఆ రచనలు చేశాను. నా వ్యంగ్యంలో బాధ, క్రోధం ఉన్నాయి. అందులో స్వచ్ఛమైన ప్రతిస్పందన కనిపిస్తుంది. నాకు రాయాలనిపించింది, తెలిసింది, నేను రాశాను. పేరు కోసం రాయలేదు. అయినా కొవ్వలికి, జంపనకు అప్పుడు, ఆ తర్వాత యండమూరి వీరేంద్రనాథ్‌కు వచ్చిన పేరు గురజాడ అప్పారావుకు రాలేదంటే ఏం చెప్పగలం? పేరు వేరు, యశస్సు వేరు. పుస్తకాలు అచ్చుసుకోవడం, వాటిని పట్టుకుని అందరి చుట్టూ తిరగడం- ఇలాంటివి నా వల్ల కాని పనులు. బహుశా నాకందుకే ఎక్కువ పేరు (మీరంటున్న పేరు) రాలేదేమో!

తెలుగు సాహిత్యంలో విమర్శ ఎదకపోవడానికి కారణమేమిటి?
కట్టమంచి, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ తెలుగులో మంచి విమర్శకులు. విమర్శ అనేది ఒక సృజనాత్మకమైన కళ. గొప్ప అభివ్యక్తి కావాలి. చక్కని వచనం రాయడం రావాలి. విమర్శ కూడా ఒక కళ. అందరికీ అబ్బదు కదా! విమర్శకులు బాగా చదువుకోవాలి. సాహిత్యం, భౌతిక విజ్ఞానం, చరిత్ర, రాజకీయ స్థితి గతులు, తాత్వికశాస్త్రం, తత్వ శాస్త్రం- ఇవన్నీ విధిగా తెలియాలి. పరభాషా సాహిత్యం బాగా తెలియాలి. ఇవన్నీ చదువుకున్న వారే సాహిత్య విమర్శకులు కావాలి. అలాంటి మహానుభావులు ఇప్పుడు ఉన్నట్లు నాకు తెలీదు.

మార్క్సిస్టు విమర్శ అనేది వుందంటారు.....చూసే దృక్కోణం నుంచి విమర్శ వుంటుందని చెప్పలేం. మార్క్సిస్టు విమర్శకులు వుంటే శూద్ర విమర్శకులు, దళిత విమర్శకులు, స్త్రీవాద విమర్శకులు కూడా వుండాలి కదా! ఈస్థటిక్స్‌ నుంచి విమర్శ అభివృద్ధి చెందితే బాగుంటుంది.

రారా (రాచమల్లు రామచంద్రారెడ్డి) గానీ, మరెవరైనా గానీ మార్క్సిస్టు విమర్శను అభివృద్ధి చేశారని మీరు భావిస్తున్నారా? రారా గొప్ప విమర్శకుడు. విమర్శ కూడా కళే. కచ్చితంగా విమర్శలో మంచి వచనం రాయగలగాలి. ఇప్పుడు విమర్శకుల్లో వల్లంపాటి వెంకటసుబ్బయ్య ఒక్కరే కనిపిస్తున్నారు. రారా అభివృద్ధి చేశాడా, లేదా అంటే నేనేమీ చెప్పలేను. త్రిపురనేని మధుసూదనరావుకు సాహిత్యం కన్నా సిద్ధాంతం ముఖ్యం. కె.వి. రమణారెడ్డికి విమర్శానా శక్తి ఉన్నా వ్యక్తీకరణ శక్తి లేదు.

మార్క్సిస్టు విమర్శ- ఆ పేరుతో వచ్చిన నిబద్ధత రచయితలకు, రచనలకు నష్టం చేశాయా?
కచ్చితంగా. నిబద్ధత పరిధిలో మంచి రచనలు ఎప్పుడూ రావు. జీవితం విస్తృతమైంది. సృజనాత్మక భావాలకు అదృశ్య శృంఖలాలు వుండకూడదు. రావిశాస్త్రి, గురజాడ, శ్రీశ్రీలాంటి మహారచయితలను ఒకే పరిధిలోంచి చూడలేం. నిబద్ధత పరిధిలో చాలామంది రచయితలు నష్టపోయారు. ప్రజలకు దగ్గరయిన రచయితలను కూడా ఒక సిద్ధాంత నిబద్ధత పరిధిలో- చట్రంలో బిగించి చూపడం వల్ల వారు సమాజంలోని చాలా రకాల స్వభావాలు గల ప్రజలకు, ఇతరులకు దూరమయ్యే ప్రమాదం వుంది.

మార్క్సిస్టు సిద్ధాంతం మీద వున్న విముఖతతో శ్రీశ్రీ, రావిశాస్త్రి లాంటి రచయితలను ఎందుకు చదవాలి, వారు మాకేం ఒరగబెట్టారు అనే సరికొత్త ప్రశ్నలు దళిత బహుజన వాదాల్లోంచి వినిపిస్తున్నాయి, దీనిపై మీరేమంటారు?
దళితులైనా, మరెవరైనా శ్రీశ్రీ, రావిశాస్త్రిలను చదవకపోతే ఆ రచయితలకు నష్టం ఏమీ లేదు. ఎప్పుడైనా చదవని వారికే నష్టం. విమర్శించడానికైనా చదవాలి కదా! చదువకుంటే ఎలా విమర్శించగలరు? ఒక సిద్ధాంతానికి, ఒక నిబద్ధతకు కట్టుబడిన రచయితలుగా వారిని ప్రచారం చేయడం వల్ల వచ్చిన నష్టం ఇది. కాబట్టే సిద్ధాంతం మీదున్న సందేహాలను రచయితల మీద కూడా వ్యక్తం చేస్తున్నారు కొత్త వాదాల కవులు, రచయితలు. విస్తృతంగా చదవడం, మంచిని స్వీకరించడమే ఇప్పుడు మనం చేయాల్సింది.

ప్రస్తుత తెలుగు నవల పరిస్థితి ఏమిటి?
ఈ విమర్శకులను అడగాలి; నన్ను కాదు. మీ మీద రావిశాస్త్రి ప్రభావం బాగా వుందంటారు....నేను రావిశాస్త్రి దగ్గర నేర్చుకున్నాను. ఆయనతో సాన్నిహిత్యం బాగా వుండేది. నా దృష్టి కూడా అదే. ఒక్క రావిశాస్త్రే కాదు, నా మీద చాలా మంది ప్రభావం వుంది. చెకోవ్‌, మొపాసా, గురజాడ, చాసో, ఆస్కార్‌వైల్డ్‌, మార్క్‌ట్వయిన్‌, వేమన, సెర్వాంటిజ్‌ వంటి రచయితల, కవుల ప్రభావం బాగా వుంది. ఎవరి ప్రభావం లేకుండా ఏ రచయితా వుండడు. అది తప్పేం కాదు. ఎవరి వల్ల ప్రభావితం కానివాడు కళాకారుడే కాదు.

'ఖాకీవనం', 'పెంపుడు జంతువులు' నవలలు రాసిన మీరు ఆ తర్వాత రాజుల గురించే రాస్తున్నారు. కారణం ఏమిటి?
అవి రెండూ నా మొదటి దశ రచనలు. అవి జర్నలిస్టిక్‌ రచనలు. మరొకరి జీవితాల్లోకి తొంగి చూసి, తెలియని వాటి గురించి తెలుసుకుని రాసినవి. వాటికంత ప్రాధాన్యం లేదు. ఆ తర్వాతి రచనలు నాకు తెలిసిన విషయాల గురించి తెలిసి రాసినవి, ఇవి 'స్వదేశీ'. ఎవరైనా ఈ స్వదేశీ రచనలే చేయాలనుకుంటాను. దళిత, మైనారిటీ సాహిత్యం, సీమ సాహిత్యం, స్త్రీవాద సాహిత్యం, తెలంగాణా సాహిత్యం అనేవి కూడా ఈ 'స్వదేశీ సాహిత్యం' కోవలోకే వస్తాయని నేను అనుకుంటున్నాను.

మీ రచనల్లోని పాత్రలు, వాటి స్వభావాలు మీ ప్రాంతానికి సంబంధించినవా? ఆ ప్రాంతం ప్రజలు, రాజులు అలా వుంటారా?
ఆ పాత్రల పేర్లు మా ప్రాంతానివే. గుణాలు మాత్రం మన అందరివీనూ! భాష మారవచ్చు, వేషం మారవచ్చు; కానీ మనుషులందరిలోనూ ఇవే గుణాలు, స్వభావాలు వుంటాయనుకుంటాను.

మీరు అంత బాగా ఎలా రాయగలిగారు?
జీవించడమే! జీవించడంలో చుట్టూ వున్న వాటిని పరిశీలించడం. కన్ను, ముక్కు, చెవి వుంటే చాలు, అంతా కనబడుతుంది, వినబడుతుంది, మనుషుల స్వభావాలను వాసన ద్వారా పసిగట్టగలం కూడా.

కమ్యూనిజం ప్రభావం మీ మీద వుందా? కమ్యూనిస్టు ఉద్యమాల వల్ల ఏమైనా మేలు జరిగిందా?
ఉంది. అయితే, ఆ తరహా రచనలు నేనెప్పుడూ చేయలేదు; అంటే కమ్యూనిస్టు రచనలు. రాజ్యం తాలూకు హింసను తప్పు పడుతూ రాశాను. నేను కమ్యూనిస్టును మాత్రం కాను. కమ్యూనిస్టుల వల్ల చాలా మేలు జరిగింది. వాళ్ల యెడల ప్రగాఢమైన ప్రేమ వుంది. వాళ్లకేమైనా నష్టం జరిగిందంటే నా మనసుకు చాలా కష్టంగా వుంటుంది. చైనాలో మావో కాలంలో ప్రజలు అడుక్కుతిన్నారు. దుర్భరమైన బాధలతో, ఆకలితో బతుకులీడ్చారు. ఇప్పుడు అక్కడ ఆకలి లేదు. దారిద్ర్యం లేదు. రోగాలు లేవు. అంత ఎక్కువ జనాభా గల దేశంలో అది ఎలా సాధ్యమైంది? కమ్యూనిస్టుల వల్ల ఇక్కడ కూడా కొంత మేలు జరిగింది. మా ఇంట్లో కమ్యూనిస్టు అనుకూల, వ్యతిరేక పుస్తకాలు చాలా వుండేవి. అవన్నీ చదివాను. నేను యువకుడిగా వున్నప్పుడు శ్రీకాకుళ ఉద్యమ ప్రభావం మా యువ మనసుల మీద బాగా పడింది.

దళితవాదం మీద మీ అభిప్రాయం ఏమిటి? కులాల వారీగా రచనలు చేయడం సమంజసమేనా?
దళితవాదం ఆహ్వానించదగ్గ పరిణామం. కచ్చితంగా అన్ని కులాల నుంచి సాహిత్యం రావాలి. వారి అనుభవాలు, జీవితాలు వారే బలంగా వ్యక్తీకరించగలరు. అలా వచ్చినప్పుడే సాహిత్యం పరిపుష్టం అవుతుంది.

స్త్రీవాదం మీద మీ అభిప్రాయం ఏమిటి?
స్త్రీల బాధలు రచనల్లో ప్రతిఫలించాలి. స్త్రీలే ఆ విషయాలు మాట్లాడాలి. స్త్రీలు మాత్రమే అవి రాయాలి.

ఇప్పుడు స్త్రీవాదం బలహీనపడుతున్న దాఖలాలున్నాయా?
అది ప్రబలంగా రావాలని నేను కోరుకుంటున్నాను. సరిగ్గా రాకపోతే మనమేం చెప్పలేం. బలహీనపడడమంటే మనమెలా చెప్పగలం? అది స్త్రీవాదులు చెప్పాలి.

కొత్తగా వస్తున్న గ్లోబలైజేషన్‌ పరిణామాలను ఇప్పటి కవులు, రచయితలు అర్థం చేసుకుంటున్నారా? వారు తెలుసు కోవాలంటారా, రాయాలంటారా?
కచ్చితంగా. కొత్తగా వస్తున్న ఏ మార్పులనైనా, పరిణామాలనైనా రచయిత తెలుసుకోవాలి. గ్లోబలైజేషన్‌ గురించి తెలుసుండాలి. చదివి తెలుసుకోవాలి. తెలియకపోవడం అజ్ఞానం. తెలుసుకుని రచనలు చేయాలి.

మీ 'ఒక దెయ్యం ఆత్మకథ' ఎవరి మీద రాశారు?
నా మీదే రాసుకున్నాను. అది నా కథే. నా దుర్లక్షణాల మీదే రాసుకున్నాను. అవే లక్షణాలు మీలో గానీ, మరెవరిలో గానీ వుంటే నేనేం చేయలేను. నాలో వుండే లక్షణాలే మీలో కూడా వుండొచ్చు కదా!

మీరు వేసిన 'భూమి బల్లపరుపుగా వుందా, గుండ్రంగా వుందా?' అనే ప్రశ్న దేనికి సింబల్‌?
దేనికీ సింబల్‌ కాదు. మా బంధువుల్లో ఒక వ్యక్తి ఒక సందర్భంలో భూమి బల్లపరుపుగా ఉందని గట్టిగా మూడు గంటలు వాదించడం విని వాడి పట్టుదలకు ఆశ్చర్యపోయాను. అదే విషయాన్ని 'గోపాత్రుడు'లో తీసుకున్నాను. 'కవిత్వం కేంద్ర స్థానం నుంచి తప్పుకుంది' అనే వాదన కొత్తగా వినిపిస్తోంది; మీ కామెంట్‌....చాలా కాలం క్రితమే తప్పుకుంది. శ్రీశ్రీ తర్వాత ఆ స్థానంలోకి ఎదిగిన కవి ఎవరూ లేరు. రాకపోవడమే మంచిది. ఇప్పుడందరూ రాస్తున్నారు. నాకు బాగా నచ్చిన కవి శ్రీశ్రీయే. ఇప్పుడొస్తున్న కవిత్వం కూడా చదువుతున్నాను. యువకవులు బాగా రాస్తున్నారు. మీ కవిత్వం కూడా ఇవ్వండి చదువుతాను.

రచయితలలో మీకు ఎవరి వచనం, శైలి బాగా నచ్చుతాయి?
మొదటగా నాకు గురజాడ, రావిశాస్త్రి బాగా ఇష్టం. ఇప్పుడు రాస్తున్న వాళ్లలో కేశవరెడ్డి, నామిని సుబ్రహ్మణ్యంనాయుడు, నందిగం కృష్ణారావు మంచి రచయితలు.

సాహిత్యానికి ప్రాంతీయత వుంటుందా?
సాహిత్యానికి కచ్చితంగా ప్రాంతీయత వుంటుంది.

లాటిన్‌ అమెరికాలో లాగా తెలంగాణా నుంచే మంచి సాహిత్యం వస్తుందని మీరన్నారు, ఎందుకు?
మార్క్వెజ్‌ 'హండ్రెడ్‌ ఇయర్స్‌ ఆఫ్‌ సాలిట్యూడ్‌' రాశాడు. తెలంగాణాది 'తౌజెండ్‌ ఇయర్స్‌ ఆఫ్‌ సాలిట్యూడ్‌'. వేల యేళ్ల బాధ. కాకతీయుల ముందు నుంచి ఎంత మందో పీక్కుతున్నారు తెలంగాణాను. ఎన్ని గాయాలు?! మాటల్లో చెప్పలేనంత బాధ, చరిత్ర వున్నాయి తెలంగాణాకు. మంచి సాహిత్యం ఇక్కడి నుంచే రావడానికి వీలుంది. ఆ వీలుందనడానికి తెలంగాణాలోని జానపద గేయ సంపదే సాక్ష్యం. ఇక్కుడున్నంత జానపద సాహిత్యం మరెక్కడా లేదు. ఇక్కడి ప్రజల జీవితాల్లో సజీవ సాహిత్యం వుంది. చచ్చు పడిన ప్రాంతాల నుంచి ఏదీ రాదు. బ్లీడింగ్‌ ఏరియా తెలంగాణా. అందుచేత ఇక్కడి నుంచే మంచి సాహిత్యం వస్తుంది. నెత్తురోడుతున్న ఆ గాయాలు ఇంకా పచ్చిగానే వున్నాయి. అందులోంచే ఏదైనా రావాలి.

ఇప్పటి వరకు తెలంగాణా నుంచి గొప్ప రచనలు వచ్చిన దాఖలాలు లేవు...రాకపోతే ఇప్పుడొస్తుంది. కొత్తగా వస్తున్న ఈ తరం రచయితలే ఆ పని చేయాలి. తెలంగాణావాళ్లు తమను తాము వ్యక్తీకరించుకోవాలి. తమను గురించి తమను చెప్పుకోవాలి. తెలంగాణాలోని పది జిల్లాల ప్రజలు తమ వేల యేళ్ల గాయాల వల్ల పడిన బాధల గురించి ఒక్క నవలయినా రాయొచ్చు కదా! చరిత్రను తెలుసుకోవాలి. రికార్డు యేయాలి. ఇలా అనుకోకపోవడం, అనిపించకపోవడం సరి కాదు.

అలా అనిపించకపోవడానికి ఉద్యమాలు నిమగ్నతకు కాకుండా నిబద్ధతకు పెద్ద పీట వేయడమే కారణమా?
అవును. కచ్చితంగా నిబద్ధత అనేది నష్టం చేసింది. దాని నుంచి యువతరం బయటపడడం వల్లనే నేటి దళిత వాదం, ఇతర కొత్త వాదాలు వచ్చాయని, వస్తున్నాయని అనుకుంటున్నాను. రావాలి కూడా. జీవితం అన్ని కోణాల నుంచి సాహితీకరిచంబడాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X