సాహిత్యం- పలుకుబడి

Posted By:
Subscribe to Oneindia Telugu

తెలుగు సాహిత్యంలో కోస్తా జిల్లాలోని వ్యవహారిక భాషే సాహిత్య భాషగా చెలామణి అవుతోంది. నిజానికి తెలుగు నేల మీద నివసించే వారంతా ఒకే భాష మాట్లడటం లేదు. ఒకే భాషలో ఆలోచించడం లేదు. వ్యవహారిక భాష విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రతి జిల్లాకీ ఒక ప్రత్యేక కనిపిస్తుంది. అలాగే గ్రామాల్లో ప్రజలు మాట్లాడే భాషకీ, పట్టణాల్లో ప్రజలు మాట్లాడే భాషకీ బోలెడు వ్యత్యాసం వుంటుంది. ఈ వ్యత్యాసం ఆయా ప్రాంతాల్లో వారి బ్రతుకుతెరువుపై ఆధారపడి వుంటుంది.

రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న జిల్లాల్లో పొరుగు రాష్ట్రాల భాషా ప్రభావం కనిపిస్తుంది. తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న చిత్తూరు, నెల్లూరు జిల్లాల వ్యవహారిక భాషపైన తమిళనాడు యాస కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అలాగే ఒరిస్సా సరిహద్దు జిల్లాల్లో ఒరియా భాషా ప్రభావం కనిపిస్తుంది. ఈ రెండు కారణాలు కాక పాలకుల ప్రభావం కూడా వ్యవహారిక భాషపై బలమైన ప్రభావం చూపిస్తుంది. ఇందుకు తెలంగాణ ప్రాంతంలో వ్యవహారిక భాషలో ఉర్దూ పదాలు ఎక్కువగా చోటు చేసుకోవడం కొన్ని చోట్ల ఉర్దూ యాసలో తెలుగు మాట్లాడటం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నైజాం నవాబుగారి ఏలికలో ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు పావలాని 'చారాణా' అని అంటారు. సమాజంలో కాస్తో కూస్తో ఉన్నత స్థానాన్ని అలంకరించిన వారి పేర్ల చివర సాబ్‌ అనే పదం చేర్చి పలకండం మనం ఇవాల్టికీ గమనించవచ్చు. భారత రిపబ్లిక్‌లో నైజాం రాజ్యం చేరిపోయి ఇన్నాళ్లయినప్పటికీ సమైక్యాంధ్ర రాష్ట్రం ఏర్పడి దశాబ్దాలు గడిచినప్పటికీ తెలంగాణా మాండలికంలో చెప్పుకోదగ్గ మార్పేమీ రాలేదు. అయితే తెలంగాణా ప్రాంతంలో కూడా ఇవాల్టికీ కోస్తాంధ్ర ప్రాంత భాషే సాహిత్యంలో వ్యవహారిక భాషగా చలామణి అవుతోంది. అంటే పరోక్షంగా తెలంగాణా ప్రాంత పరజల అంతరంగిక ప్రపంచాన్ని ఆవిష్కరించే సాహిత్యం ఇంత వరకూ వెలువడలేదని అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యం నుంచి బొత్తిగా సాహిత్య సృజన జరగడం లేదా అంటే జరుగుతోందనే చెప్పవచ్చు. అయితే అది చెప్పుకోదగిన స్థాయిలో జరగడం లేదు.

తెలంగాణా సాయుధ పోరాట కాలంలో వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి రంగాచార్య వంటి కొందరు రచయితలు తెలంగాణా మాండలికంలో కొన్ని రచనలు చేశారు. ఆ కాలంలో పోరాటం తెలంగాణాకి మాత్రమే పరిమితం కావడం వల్ల కూడా తమ జాతీయతని కాపాడుకోవడానికి తెలంగాణా ప్రాంతపు రచయితకి అనివార్యంగా తెలంగాణా మాండలికంలో సాహిత్య సృజన చేయాల్సిన పరిస్థితి ఏర్పడి వుంటుంది.

తెలంగాణా సాయుధ పోరాటానంతరం మొత్తం ఆంధ్ర రాష్ట్రమంతటా కోస్తా జిల్లాల వ్యవహారిక భాషే సాహిత్య భాషగా రాజ్యమేలింది. తిరిగి నక్సల్బరీ ఉద్యమ ప్రభావంతో అటు శ్రీకాకుళంలోనూ, ఇటు తెలంగాణాలోనూ పోరాటం చెలరేగడంతో స్థానిక మాండలికంలో రచనలు వెలువడసాగాయి. ఇందుకు ఉదాహరణగా అటు భూషణం, ఎన్‌.ఎస్‌. ప్రకాశరావు, అట్టాడ అప్పల్నాయుడు, వంగపండు ప్రసాదరావు వంటి రచయితలూ, ఇటు గద్దర్‌, బి.ఎస్‌. రాములు, అల్లం రాజయ్య, జూకంటి, సదానంద శారద, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, దేవరాజు మహారాజు వంటి రచయితలనూ పేర్కొనవచ్చు.

ఎప్పుడో ఒకసారి పత్రికల్లో చెదురుమొదురుగా తెలంగాణా మాండలికంలో రచనలు వెలువడుతున్నాయి. తెలంగాణా ప్రాంతంలో అక్షరాస్యత సంఖ్య తక్కువ కావడం వల్ల పత్రికలు తెలంగాణా మాండలికంలో వెలువడుతున్న రచనల్ని పెద్దగా ప్రోత్సహించడం లేదు. నిజాం పరిపాలన అనంతరం తెలంగాణాలో నిరక్షరాస్యత కారణంగా కోస్తాంధ్ర ప్రాంతం నుంచి వచ్చినవారే పరోక్షంగా తెలంగాణాని పరిపాలించారని చెప్పవచ్చు. ఈ కారణంగా వారు తెలంగాణా ప్రాంతంలోని సాహితీసంస్కృతులని కూడా ప్రభావితం చేశారు. కోస్తాంధ్ర వ్యవహార భాషే తెలంగాణాలోని అధికార భాషగానూ, సాహిత్యంలో వ్యవహారంగానూ చలామణి కాసాగింది. ఇది ఇంకా కొనసాగుతోంది. తెలంగాణా ప్రజలు అనేక వీరోచిత పోరాటాల్లో పాల్గొన్నప్పటికీ సాహిత్యంలో జాతీయతని నిలుపుకోలేక పోవడంతో ఇప్పుడు తెలంగాణా మాండలికం వెకిలి చెయ్యబడుతోంది. బానిసలతో ముష్టి యుద్ధాలు చేయించి విలాసంగా నవ్వుకొనే యజమానుల్లా, మని సినిమా వాళ్లు సినిమాల్లో, ఇళ్లలోపని చేసే వాళ్లతోటీ, హోటల్‌ సప్లయిర్లతోటీ, చిన్న చిన్న రౌడీల్తోటి తెలంగాణా మాండలికం మాట్లాడించి ఆనందిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి